- రోబోటిక్స్, త్రీడీ ప్రింటింగ్, సెన్సర్ టెక్నాలజీపై ప్రాక్టికల్ ట్రైనింగ్
- వారానికి రెండు ల్యాబ్ క్లాసులు.. ఎంసెట్, నీట్‌కు సన్నద్ధం
- చేసేలా విద్యాశాఖ అడుగులు..విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, ఆవిష్కరణలపై ఆసక్తి పెంచడమే ధ్యేయం
మెదక్, వెలుగు: పదో తరగతిలో మంచి జీపీఏతో ఉత్తీర్ణత సాధిస్తున్న విద్యార్థుల్లో చాలా మంది ఇంటర్మీడియట్లో వెనుకబడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా మ్యాథ్స్, ఫిజిక్స్, బయో సైన్స్ సబ్జెక్టులపై పట్టు లేకపోవడం వల్ల ఇంజినీరింగ్, మెడిసిన్ చదవాలని ఉన్నా ఎంసెట్, నీట్ ఎగ్జామ్ లలో మంచి ర్యాంకులు సాధించలేకపోతున్నారు. ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేసేందుకు పాఠశాల స్థాయిలోనే స్టూడెంట్స్‌లో మ్యాథ్స్, సైన్స్, ఫిజిక్స్‌పై ఆసక్తి పెంచి, వారిలో శాస్త్ర పరిజ్ఞానాన్ని పెంపొందించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ప్రయోగాత్మకంగా అవగాహన కల్పించేందుకు వీలుగా ఆధునిక సైన్స్ ల్యాబ్ లను ఏర్పాటు చేసింది.
సమగ్ర శిక్ష అభియాన్(ఎస్ ఎస్ ఏ) కింద అటల్ టింకరింగ్ ల్యాబ్(ఏటీఎల్)లు ఉన్న పీఎంశ్రీ స్కూల్స్ కు ఆర్డినో కిట్స్ సరఫరా చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల్లో పీఎంశ్రీ స్కీం అమలవుతున్న 593 జిల్లా పరిషత్ హైస్కూల్స్(జడ్పీహెచ్ ఎస్), కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, మాడల్ స్కూళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లకు ఇప్పటికే రూ.లక్షల విలువైన ల్యాబ్ మెటీరియల్ వచ్చింది.
ల్యాబ్లో అత్యాధునిక పరికరాలు..
ల్యాబ్ మెటీరియల్‌లో సర్క్యూట్స్, త్రీడీ ప్రింటర్లు, టెలిస్కోప్ లు, అడ్వాన్స్ రోబోటిక్ కిట్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఎల్సీడీ డిస్ప్లేలు, యూఎస్బీ కేబుల్స్, బ్యాటరీలు, రెసిస్టర్ కిట్లు, కెపాసిటర్ కిట్లు, లైనర్ ఓల్టేజ్ రెగ్యులేటర్, వాటర్ పంప్ మాడ్యుల్స్, ఫీజో ఎలక్ట్రిక్ ప్లేట్లు, బ్లూటూత్ మాడ్యుల్స్, లేజర్ డయోడ్ ఎమిటర్, జాయ్ స్టిక్, యాక్టిబ్ బజర్, సౌండ్ ప్లేబ్యాక్ మాడ్యుల్, డీసీ ప్లాస్టిక్ గేర్ మోటార్ విత్ వీల్, వైబ్రేటింగ్ మోటార్, బ్యాటరీ క్లిప్స్ విత్ డీసీ జాక్, జంపర్ కేబుల్, వివిధ రంగుల ఎల్ఈడీలు, టైమర్లు, డయోడ్, ట్రాన్సిస్టర్ కిట్లు, పల్స్ రేట్ హార్ట్ సెన్సర్లు, టచ్ సెన్సర్లు, రెయిన్ డ్రాప్ సెన్సర్, సాయిల్ మాయిశ్చర్ సెన్సర్, టెంపరేచర్ అండ్ హ్యుమిడిటీ సెన్సర్లు, కలర్ రికగ్రేషన్ సెన్సర్, వాటర్ ఫ్లో సెన్సర్, సౌండ్ సెన్సర్, రిలే మాడ్యుల్స్, పవర్ బ్యాంక్, డీసీ మోటార్, డ్రిల్ మిషన్ , సాల్డరింగ్ కిట్, అడాప్టర్లు, సేఫ్టీ మాస్కులు తదితర పరికరాలు ఉన్నాయి.
వారానికి రెండు రోజులు ల్యాబ్ ..
విద్యార్థులకు ప్రయోగాత్మక శిక్షణ ఇచ్చేందుకు ముందుగా డిస్ట్రిక్ రీసోర్స్ పర్సన్ లకు హైదరాబాద్‌లో శిక్షణ ఇచ్చారు. వారి ద్వారా ఏటీఎల్ ల్యాబ్ ఉన్న ప్రతి పీఎంశ్రీ స్కూల్ నుంచి ముగ్గురు టీచర్స్(మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయో సైన్స్)కు మూడు రోజుల శిక్షణ ఇచ్చారు. ఆయా స్కూళ్లలో 8, 9, 10 తరగతుల విద్యార్థులు ప్రతి వారం రెండు ల్యాబ్ క్లాసులు నిర్వహించనున్నారు. స్టూడెంట్స్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, సెన్సర్, రోబోటిక్స్ పై ప్రాక్టికల్స్ లో పాల్గొంటారు.
స్విచ్ ఆన్ చేయకుండానే గదిలోకి అడుగు పెట్టగానే లైట్ వెలగడం, అలారం మోగడం, వాటర్ ట్యాంక్ నిండగానే దానంతటనే అదే మోటార్ ఆగిపోవడం వంటి అంశాలపై రూపొందించడంపై విద్యార్థులకు ప్రయోగాత్మక శిక్షణ ఇస్తారు. అలాగే అత్యాధునిక త్రీడీ ప్రింటర్ ద్వారా నచ్చిన వివిధ రకాల వస్తువులు రూపొందించడం నేర్పిస్తారు. వివిధ ఎలక్ట్రిక్ యంత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ, పనితీరును నేర్పుతారు.
పుస్తకాలకే పరిమితమైన బోధనకు స్వస్తి పలుకుతూ ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడు సైన్స్, రోబోటిక్స్, టెక్నాలజీ ప్రయోగాలకు వేదికలుగా మారుతున్నాయి. విద్యార్థుల్లో చిన్నప్పటి నుంచే శాస్త్రీయ దృక్పథం పెంపొందించి, భవిష్యత్ ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో విద్యాశాఖ అత్యాధునిక అటల్ టింకరింగ్ ల్యాబ్‌లను బలోపేతం చేసింది. త్రీడీ ప్రింటర్లు, రోబోటిక్ కిట్లు, సెన్సర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలతో ప్రభుత్వ పాఠశాలల్లోనే అత్యాధునిక ప్రయోగాలకు అవకాశం కల్పిస్తోంది. దీంతో పదో తరగతి నుంచే విద్యార్థులు సైన్స్‌ను చదవడమే కాకుండా ప్రయోగాత్మకంగా నేర్చుకునే అవకాశం దక్కనుంది.
శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం పెంచేందుకు..
విద్యార్థుల్లో పాఠశాల స్థాయిలోనే శాస్త్ర, సాంకేతిక పరిజ్నానాన్ని పెంపొందింపజేసేందుకు విద్యాశాఖ ఏటీఎల్ ల్యాబ్ లు ఉన్న పీఎంశ్రీ స్కూళ్లకు ల్యాబ్ మెటీరియల్ సరఫరా చేసింది. మెదక్ జిల్లాలో మొత్తం 29 స్కూళ్లకు మెటీరియల్ వచ్చింది. ఇందులో 21 జడ్పీహెచ్ఎస్లు, 4 మాడల్ స్కూళ్లు, 3 రెసిడెన్షియల్ స్కూళ్లు, ఒక కేజీబీవీ ఉన్నాయి. శిక్షణ పొందిన మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయో సైన్స్ టీచర్లు విద్యార్థులకు ప్రయోగాత్మక శిక్షణ ఇస్తారు.
సుదర్శన మూర్తి, అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్, మెదక్
