ములుగు, వెలుగు: ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ వాటిని అధిగమించి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పేదల చిరకాల కోరిక అయిన సొంత ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. మొదటి విడతలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని, ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇచ్చామన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 1. 30 లక్షల గృహప్రవేశాలు జరిగాయని, మరో 80 వేల ఇండ్లు ప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. రెండో విడత కింద రెండున్నర లక్షల ఇండ్లను మంజూరు చేశామని చెప్పారు. సిద్దిపేట, గజ్వేల్ లో అధికంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం జరిగిందని చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ కె. హైమావతి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, గృహ నిర్మాణశాఖ ఎండీ వీపీ. గౌతమ్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దరిపెల్లి చంద్రం, గజ్వేల్ ఆర్డీవో చంద్రకళ పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల వంటి కార్యక్రమం మరెక్కడా లేదు: మంత్రి వివేక్ వెంకటస్వామి
పేదల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం నిజం చేస్తోందని జిల్లా ఇన్ చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చెప్పారు. మధ్యవర్తులు లేకుండా నేరుగా పేదల పేరుతోనే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వంటి పెద్ద కార్యక్రమం దేశంలో మరెక్కడా లేదన్నారు.
ఇందిరమ్మ ఇండ్లకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక యాప్ ద్వారా ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తున్నామని చెప్పారు. అవసరమైన ప్రతీ చోట యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తామన్నారు. స్టూడెంట్లకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 50 వేల మంది టీచర్లను నియమించినట్లు చెప్పారు. త్వరలోనే కొత్త పింఛన్లు అందజేయనున్నట్లు ప్రకటించారు.
