కిలో చికెన్పై రూ.40 మార్జిన్ ఇస్తున్నాం.. అయినా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు: పౌల్ట్రీ కంపెనీలు

కిలో చికెన్పై రూ.40 మార్జిన్ ఇస్తున్నాం.. అయినా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు: పౌల్ట్రీ కంపెనీలు

చికెన్ రేటు మార్జిన్ విషయంలో చికెన్ రిటైల్ షాపు వ్యాపారులు పొంతన లేకుండా వ్యవహరిస్తున్నారని బ్రాయిలర్ ఇంటిగ్రేషన్ కో ఆర్డనేషన్ కమిటీ తెలిపింది. రిటైల్ షాపుల ఆరోపణలపై 2026 ఏప్రిల్ 02న హైదరాబాద్ సోమాజిగూడాలోని ఓ హోటల్ లో కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ నాయకులు రామిరెడ్డి , బాలసుబ్రహ్మణ్యన్ , రాజిరెడ్డి లు మాట్లాడారు. 

చికెన్ లైవ్ రేట్ తో పాటు రిటైల్ ధరలను పేపర్ ద్వారా ప్రకటనలు ఇస్తున్నామని తెలిపారు. గత కొన్నేళ్లుగా కిలో కు 40 రూపాయలు మార్జిన్ ఇస్తున్నామని , కరోనా సమయంలో కూడా అంతే ఇచ్చామని తెలిపారు. బంద్ లో ఉన్న వ్యాపారులు కిలోకు 30 రూపాయలు అడుగుతున్నారని... తాము 40 ఇస్తున్నామన్నారు. కొందరు కావాలనే వ్యాపారులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కంపెనీలు నష్టాల్లో ఉన్నా కస్టమర్ పై భారం పడకుండా రేటును నిర్ణయిస్తున్నామని తెలిపారు. రిటైల్ వ్యాపారులతో తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని, వారికి వస్తున్న మార్జిన్ పై వివరించి చెబుతామని అన్నారు.

మరోవైపు చికెన్ పై మార్జిన్ పెంచి, న్యాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర రిటైల్ చికెన్ షాప్స్ అసోసియేషన్ చేస్తున్న బంద్ రెండో రోజుకు చేరుకుంది. 2026 ఏప్రిల్ 01 నుంచి బంద్ ప్రకటిస్తున్న రిటైల్ అసోసియేష్ సభ్యులు.. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ పెంచేవరకూ నిరవధిక బంద్పాటిస్తామని హెచ్చరించింది. చికెన్ పై మార్జిన్ ఇవ్వకపోవడం పౌల్ట్రీ కంపెనీల తీరుకు నిరసనగా అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు రాజు, శ్రీనివాస్, గోపి, యాదగిరి, వేముల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఇటీవల 26 శాతం ఉన్న మార్జిన్ ను పౌల్ట్రీ కంపెనీలు16 శాతానికి తగ్గించాయని, దీనివల్ల చికెన్ షాపుల నిర్వాహకులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

పౌల్ట్రీ కంపెనీలు రిటైల్ చికెన్ వ్యాపారులకు నష్టం కలిగించే విధంగా చర్యలు తీసుకుంటున్నాయని ఆరోపించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మార్జిన్ ను రూ.50కి పెంచాలన్నారు. షాప్ కిరాయి, నిర్వహణ ఖర్చులు, పనిచేసే బాయ్స్ జీతాలు పెరిగినందున కంపెనీలు ప్రస్తుతం ఇచ్చే మార్జిన్ సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని పౌల్ట్రీ కంపెనీలతో మాట్లాడాలని కోరారు.