బుద్వేల్ భూములపై సర్కార్ ఫోకస్

బుద్వేల్ భూములపై సర్కార్ ఫోకస్
  • రేపు ప్రీ బిడ్ సమావేశం.. 8 వరకు రిజిస్ట్రేషన్లు
  • 10న ఆన్ లైన్ లో వేలం.. ఎకరా కనీస ధర రూ.20 కోట్లు
  • మొత్తం రూ.3 వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా 

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్ర ప్రభుత్వం వరుసపెట్టి భూములు అమ్ముతున్నది. మొన్న కోకాపేట భూములు అమ్మిన సర్కార్.. ఇప్పుడు బుద్వేల్ భూములు అమ్మేందుకు సిద్ధమైంది. గత నెల 31న జరిగిన కేబినెట్ మీటింగ్ లో బుద్వేల్ భూములు అమ్మేందుకు మంత్రివర్గం ఆమోదం తెలపగా, వారం కూడా తిరక్కుండానే ఆ భూముల వేలానికి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. నిజానికి ఇంకో వారం, పది రోజుల తర్వాత ఈ భూముల అమ్మకానికి నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉన్నది. అయితే మొన్న కోకాపేట భూములకు రికార్డు స్థాయిలో ధర రావడంతో అదే ఊపులో బుద్వేల్ భూములు అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేల్‌‌లో మల్టీ పర్పస్​ బిల్డింగ్​ల నిర్మాణానికి అనుగుణంగా అభివృద్ధి చేసిన 100 ఎకరాలను హెచ్ఎండీఏ ద్వారా విక్రయించనుంది. ఎకరా కనీస ధర రూ.20 కోట్లుగా నిర్ణయించింది. అయితే ఇది నియోపొలీస్ లేఅవుట్ కు 15 నిమిషాల దూరంలోనే ఉంటుందని పేర్కొన్న ప్రభుత్వం.. ఎకరా రూ.30 కోట్లకు పైనే పలుకుతుందని, మొత్తం రూ.3 వేల కోట్లకు పైనే ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నది. 

రెండు సెషన్లలో వేలం.. 

బుద్వేల్ లో అభివృద్ధి చేసిన 100 ఎకరాలను విక్రయించేందుకు హెచ్ఎండీఏ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక్కడ మొత్తం 14 ప్లాట్లను అమ్మకానికి ఉంచారు. ఒక్కో ప్లాట్  3.47 ఎకరాల నుంచి 14.33 ఎకరాల వరకు ఉంది. ఎకరా కనీస ధర  రూ.20 కోట్లుగా నిర్ణయించారు. ఈ నెల 6న ప్రీబిడ్ సమావేశం నిర్వహించనున్నట్లు అధికారులు తెలి పారు. 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్లకు చాన్స్​ ఉంటుందని చెప్పారు. 10న ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో వేలం నిర్వహిసతామ్నారు. 

అసైన్డ్ భూములనే ఆరోపణలు.. 

బుద్వేల్​లో ప్రభుత్వం వేలం వేస్తున్నవి అసైన్డ్ భూముల ని, వాటిని పేదల నుంచి గుంజుకున్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బుద్వేల్​లో సర్వే నంబర్​282 నుంచి 299 వరకు దాదాపు 255 ఎకరాల 35 గుంటల భూమి ని 66 మంది పేదలకు 1979లో అప్పటి ప్రభుత్వం అసైన్డ్​ చేసింది. అయితే ఈ భూముల్లో రైతులు వ్యవసాయం చేయడం లేదని, ప్లాట్​లుగా మార్చి అమ్ముకుంటున్నారని 2000 సంవత్సరంలో చేవేళ్ల ఆర్డీఓతో అప్పటి ప్రభుత్వం ఒక ఆర్డర్​పాస్ చేయించి వాటిని వెనక్కి తీసు కున్నది. ఇందులో 164 ఎకరాల 35 గుంటలను హెచ్​ఎండీఏకు, 91 ఎకరాలను టూరిజం డిపార్ట్ మెంట్ కు అప్పగించింది. దీనిపై 2002లో కొందరు రైతులు హైకోర్టును ఆశ్రయించగా, ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ పై కోర్టు స్టే విధించింది. అయితే బీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది రైతులకు కొన్ని గజాల భూమికి కన్వీయెన్స్ డీడ్ లు రాయించి ఇచ్చి, మిగతా మొత్తాన్ని గుంజుకున్నదనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ భూములనే సర్కార్ వేలం వేస్తున్నదని బీఎస్పీ ఆరోపిస్తున్నది. 

పేదల నుంచి గుంజుకున్న భూములే: ఆర్ఎస్ ప్రవీణ్  

అసైన్డ్ భూములకు హక్కు పత్రాలు ఇవ్వాల్సింది పోయి.. దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ ప్రభుత్వం అసైన్డ్ ​భూములను బహిరం గంగా వేలం వేస్తున్నదని బీఎస్పీ స్టేట్​ చీఫ్​ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. పేదల భూములను గుంజుకుని అపర కుబేరులకు కట్టబెడుతున్నదని శుక్రవారం ఆయన ట్వీట్ చేశారు. ‘‘నిన్న కోకాపేట.. రేపు బుద్వేల్.. ఎల్లుం డి ఆర్ఆర్ఆర్.. కేసీఆర్ పాలనలో పేద ప్రజలకు చివరకు గోచి గుడ్డ కూడా మిగిలే పరిస్థితి లేదు. బుద్వేల్ లో 255 ఎకరాల భూమి పేదల నుంచి బలవంతంగా గుంజుకున్నదే”అని అన్నారు.