ఇండియా రెజ్లర్లపై భారీ అంచనాలు

ఇండియా రెజ్లర్లపై భారీ అంచనాలు

(వెలుగు స్పోర్ట్స్‌‌‌‌ డెస్క్‌‌)భారీ పోటీ ఉండే ఒలింపిక్స్‌‌లో పతకాల పట్టికలో ఇండియా ఎప్పుడూ చివరి వరుసలోనే ఉంటుంది. గతేడాది టోక్యోలో వచ్చిన ఏడు మెడల్సే ఒలింపిక్స్‌‌లో మన దేశానికి అత్యధికం. కానీ, కామన్వెల్త్‌‌ గేమ్స్‌‌లో మాత్రం ఇండియన్స్‌‌ పతకాల మోత మోగిస్తుంటారు..! బ్రిటిష్‌‌ వాళ్లు పరిపాలించిన ‘కామన్వెల్త్’ దేశాలు పోటీ పడే ఈ గేమ్స్‌‌లో గత ఐదు ఎడిషన్ల నుంచి ఇండియా టాప్‌‌–5లో నిలుస్తూ వస్తోంది. 2018లో 66 మెడల్స్‌‌తో మూడో స్థానం సాధించింది. ఈ గేమ్స్‌‌లో చాలా ఆటల్లో బరిలోకి దిగినప్పటికీ.. కొన్ని ఆటల్లోనే  మన అథ్లెట్లు ఎక్కువ పతకాలు తెస్తుంటారు. అందులో రెజ్లర్లు  ఎప్పుడూ ముందుంటారు. 2018లో మన రెజ్లర్లు 5 గోల్డ్‌‌ సహా 12 పతకాలు సాధించి  రెజ్లింగ్‌‌ ఈవెంట్‌‌లో టాప్‌‌ ప్లేస్‌‌ సాధించాడు. దాంతో, ఈనెల 28వ తేదీ బర్మింగ్‌‌హామ్‌‌ వేదికగా జరిగే కామన్వెల్త్‌‌ గేమ్స్‌‌లోనూ వారిపై  అంచనాలున్నాయి.

వినేశ్‌‌, సాక్షికి లక్కీ చాన్స్
ఒలింపిక్స్‌‌, వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్స్‌‌, ఏషియన్‌‌ గేమ్స్‌‌తో పోలిస్తే కామన్వెల్త్‌‌ గేమ్స్‌‌ రెజ్లింగ్‌‌లో పోటీ తక్కువగా ఉండటం ఇండియా రెజ్లర్లకు ప్లస్‌‌ పాయింట్‌‌.  కొంతకాలంగా నిరాశ పరుస్తున్న విమెన్స్‌‌ స్టార్‌‌ రెజ్లర్లు వినేశ్‌‌ ఫొగట్‌‌, సాక్షి మాలిక్‌‌ గోల్డ్‌‌ మెడల్స్‌‌తో కాన్ఫిడెన్స్‌‌ పెంచుకునేందుకు ఇది మంచి అవకాశం. టోక్యోలో భారీ అంచనాలతో బరిలోకి దిగిన వినేశ్‌‌ పతకం లేకుండానే వెనుదిరిగి నిరాశ పరిచింది. పెద్ద ప్రత్యర్థులను ఎదుర్కొనేప్పుడు ఆమె తరచూ ఇబ్బంది పడుతోంది. ఆటలో ఆమె మానసికంగా కూడా సమస్యలు ఎదుర్కొంటోంది. ఓ పెద్ద విజయం లభిస్తే..వీటన్నింటి నుంచి తేరుకోవడంతో పాటు తిరిగి కాన్ఫిడెన్స్‌‌ పెంచుకోవచ్చు. 2024 పారిస్‌‌ ఒలింపిక్స్‌‌కు కూడా సమయం దగ్గరపడుతోంది కాబట్టి బర్మింగ్‌‌హామ్‌‌లో పెర్ఫామెన్స్‌‌ వినేశ్‌‌ కెరీర్‌‌కు బూస్టప్‌‌ కానుంది. సాక్షి మాలిక్‌‌ పరిస్థితి కూడా అలానే ఉంది. రియో ఒలింపిక్స్‌‌లో బ్రాంజ్‌‌ తర్వాత వరుస ఫెయిల్యూర్స్‌‌ ఎదుర్కొన్న ఆమె.. ఈ మధ్య సైకాలజిస్ట్‌‌ సాయంతో కాస్త మెరుగైంది. కామన్వెల్త్‌‌ ట్రయల్స్‌‌లో సోనమ్‌‌ మాలిక్‌‌ను ఓడించిన సాక్షి డిఫెన్స్‌‌పైనే ఆధార పడకుండా అటాకింగ్‌‌లో జోరు పెంచడం సానుకూలాంశం.  ఇక  గాయాలతో కాస్త ఇబ్బంది పడుతున్నప్పటికీ టాలెంట్‌‌, ఫామ్‌‌ ప్రకారం చూస్తే అన్షు మాలిక్‌‌ నుంచి గోల్డ్‌‌ ఆశించొచ్చు. 68 కేజీ కేటగిరీలో దివ్యా కక్రాన్‌‌ కూడా ఆధిపత్యం చూపెట్టగలదు. పూజా గెహ్లోట్‌‌ (50 కేజీ), పూజా సిహగ్ (76 కేజీ)  కూడా ఏదో ఒక పతకంతో తిరిగొస్తారని నమ్మకం ఉంచొచ్చు. 

బజ్‌‌రంగ్‌‌ దూకుడు చూపాల్సిందే
మెన్స్‌‌ స్టార్‌‌ రెజ్లర్‌‌ బజ్‌‌రంగ్‌‌ పునియాకు కూడా ఈ గేమ్స్‌‌ కీలకం కానున్నాయి. టోక్యో ఒలింపిక్స్‌‌కు ముందు మోకాలి గాయానికి గురైన బజ్‌‌రంగ్‌‌ అప్పటి నుంచి అటాకింగ్‌‌ గేమ్‌‌ ఆడటంలో ఇబ్బంది పడుతున్నాడు. రెజ్లింగ్‌‌లో మేటి దేశాలపైన ఇరాన్‌‌, రష్యా, జపాన్‌‌, కజకిస్తాన్‌‌ కామన్వెల్త్‌‌లో లేవు కాబట్టి బజ్‌‌రంగ్‌‌ తన పూర్తి పవర్‌‌ చూపెట్టి గోల్డ్‌‌తో తిరిగి రావాలని అంతా ఆశిస్తున్నారు. టోక్యో ఒలింపిక్స్‌‌ సిల్వర్‌‌ మెడలిస్ట్‌‌ రవి దాహియ గోల్డ్‌‌ మెడల్‌‌ లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాడు. ఇప్పుడు అతను ఉన్న ఫామ్‌‌ చూస్తే.. ఒకే కాలు, చేయితో కూడా విజయం సాధించగలడు అనొచ్చు. గాయాల కారణంగా వరుసగా టోర్నీలకు దూరం అవుతున్న దీపక్‌‌ పునియా (86 కేజీ)కు మాత్రం కామన్వెల్త్‌‌లో కాస్త సవాల్‌‌ ఎదురవనుంది. ప్రత్యర్థులతో పాటు తన బాడీపై కూడా అతను ఫోకస్‌‌ పెట్టాల్సి ఉంటుంది. నవీన్‌‌ (74 కేజీ), దీపక్‌‌ (97 కేజీ), మోహిత్ (125) కూడా తమ కేటగిరీల్లో పతకాలు సాధించే సత్తా ఉన్నవాళ్లే. 

ఇండియా రెజ్లింగ్‌‌ టీమ్‌‌
మెన్స్‌‌: రవికుమార్‌‌ దాహియ (57 కేజీ), బజ్‌‌రంగ్‌‌ పునియా (65 కేజీ), నవీన్‌‌ (74 కేజీ), దీపక్‌‌ పునియా (86 కేజీ), దీపక్‌‌ (97 కేజీ), మోహిత్‌‌ గ్రేవాల్‌‌ (125 కేజీ).
విమెన్స్‌‌: పూజా గెహ్లోట్‌‌ (50 కేజీ), వినేశ్‌‌ ఫొగాట్‌‌ (53 కేజీ), అన్షు మాలిక్‌‌ (57 కేజీ), సాక్షి మాలిక్‌‌(62 కేజీ), దివ్యా కక్రాన్‌‌ (68 కేజీ), పూజా సిహగ్‌‌ (76 కేజీ).