తిరుపతి లడ్డూ ధర భారీగా పెంపు?

తిరుపతి లడ్డూ ధర భారీగా పెంపు?

తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లిన భక్తులు లడ్డూ ప్రసాదం తీసుకోకుండా కొండ దిగరు. తమ బంధువులకు , మిత్రులకు ఇవ్వడం కోసం వీలైనన్నీ లడ్డూలు తీసుకురావడానికే ప్రయత్నిస్తారు. అయితే శ్రీవారి ప్రసాదం ధరను ప్రస్తుతం ఉన్నదానికి రెట్టింపు చేసింది టీటీడీ పాలకమండలి.

శ్రీవారి దర్శనం కోసం నడకన వచ్చే భక్తులకు ఒక లడ్డూను ఉచితంగా ఇస్తున్నారు. మరో రెండు లడ్డూలను రూ.25 చొప్పున కొనుగోలు చేయవచ్చు. ధర్మదర్శనం భక్తులకు 20 రూపాయలకు రెండు లడ్డూలు ఇస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు ఒక్కో టికెట్ పై 2 లడ్డూలు, అదనంగా 2 లడ్డూలను రూ.25పై కొనుగోలు చేయవచ్చు.

అయితే …మార్కెట్ ధర ప్రకారం ఒక్కో లడ్డూ తయారీకి రూ.40 వరకూ ఖర్చు అవుతుంది. దీనిపై ఇచ్చే  రాయితీతో భారం  ఎక్కువ అవుతోంది. దీంతో TTD లడ్డూ అమ్మకాలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఒక్కో లడ్డూను 50 రూపాయలకు అమ్మాలని భావిస్తోంది. దర్శనానికి వచ్చే ప్రతి ఒక్కరికీ ఒక లడ్డూను ఉచితంగా ఇవ్వాలని, ఆపై లడ్డూ కావాలంటే రూ.50 పెట్టి కొనుక్కునేలా ప్రణాళికను సిద్ధం చేస్తోంది.

ధరల పెంపునకు బోర్డు సభ్యులు అందరూ సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.