ముగియనున్న రోహిత్ అధ్యాయం.. టీమిండియా తదుపరి కెప్టెన్ ఎవరు..?

ముగియనున్న రోహిత్ అధ్యాయం.. టీమిండియా తదుపరి కెప్టెన్ ఎవరు..?

2024 టీ20 ప్రపంచకప్ అనంతరం భారత జట్టు కెప్టెన్‌ రోహిత్ శర్మ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు నివేదికలు వస్తున్నాయి. పరిమిత ఓవర్ల సారథిగా అతని స్థానంలో యువ నాయకుడిని నియమించే పనిలో బీసీసీఐ పెద్దలు ఉన్నట్లు జాతీయ మీడియా కథనాన్ని ప్రచురించింది. 

ప్రస్తుతం రోహిత్ వయసు.. 37 ఏళ్లు. పరిమిత ఓవర్ల క్రికెట్‍లో అతను మరింత కాలం కొనసాగకపోవచ్చు. అందునా, తదుపరి టీ20 ప్రపంచకప్ 2026లో జరగనుంది. ఆ సమయానికి యువ భారత జట్టును సిద్ధ చేయాలని బీసీసీఐ యోచిస్తోందట. ఈ క్రమంలో ప్రస్తుత టీ20 మెగా టోర్నీ అనంతరం రోహిత్ సహా విరాట్ కోహ్లీ సైతం టీ20 ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పనున్నారని సమాచారం. అదే నిజమైతే పొట్టి ప్రపంచకప్ తరువాత భారత జట్టులో పలువురు యువ క్రికెటర్లు కనిపించనున్నారు.

తదుపరి కెప్టెన్ ఎవరు..?

2022లో భారత జట్టు కెప్టెన్ గా ఏకంగా ఏడుగురు పని చేశారు. హార్ధిక్ పాండ్యా, జస్ప్రిత్ బుమ్రా, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్.. ఇలా ఒక్కో సిరీస్‌కి ఒక్కొక్కరు నాయకత్వం వహించారు. ఇప్పుడు వీరిలో ఎవరికి నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తారనేది అంతుపట్టని విషయం. 

పాండ్యా

భారత జట్టు తదుపరి కెప్టెన్‌గా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. టీ20ప్రపంచకప్ ముగిశాక భారత జట్టు.. జింబాబ్వేతో టీ20 సిరీస్ ఆడనుంది. అనంతరం జూలై మూడో వారంలో శ్రీలంకతో సిరీస్ ఉంది. ఈ రెండు సిరీస్‌లలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కనిపించకపోవచ్చు. దీంతో బీసీసీఐ పెద్దలు.. పాండ్యాకు ఇప్పటినుంచే మిషన్ 2026 టీ20 ప్రపంచకప్ బాధ్యతలు పనిలో ఉన్నట్లు సమాచారం. దీనిపై మరికొన్ని రోజుల్లో స్పష్టత రానుంది. తదుపరి కెప్టెన్‌గా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.