బీసీలకు 60 సీట్లు ఇవ్వాలె....లేదంటే లక్ష మందితో చలో హైదరాబాద్

బీసీలకు 60 సీట్లు ఇవ్వాలె....లేదంటే లక్ష మందితో చలో హైదరాబాద్

హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు 60 సీట్లు కేటాయించాలని, లేదంటే లక్ష మందితో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపడతామని బీసీ సంఘాల నేతలు హెచ్చరించారు. ఆగస్టులోగా రాజకీయ పార్టీలు తమ వైఖరిని వెల్లడించాలని డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎల్బీ నగర్ లోని కేబీఆర్ కన్వేన్షన్ హాల్ లో బీసీల ప్లీనరీ సమావేశాన్ని ఇవాళ నిర్వహించారు. ఈ సందర్బంగా  బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. దేశంలో చాలా మంది బీసీలు ముఖ్యమంత్రులుగా విజయవంతమైన పాలన అందించారని చెప్పారు. ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ.. బీసీలకు ఉన్న చరిత్ర మిగతా కులాలకు లేదన్నారు. వెనుకబడిన కులాల వారు ప్రజాప్రతినిధులు అయినప్పుడే రాజ్యాంగం అమలవుతున్నట్టు భావిస్తామని అన్నారు. 

మలి దశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలు బీసీలకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నారు. తాను హుజూర్ నగర్ నుంచి పోటీ చేస్తే ఓడించారని, ఆ సెగ్మెంట్ లో 80శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉన్నారని, కేవలం 20 శాతం మాత్రమే ఉన్న ఓసీ గెలుపొందారని చెప్పారు. తాను 2008 నుంచి అధికార పార్టీలో కొనసాగుతున్నానని, ఏదైనా పదవి వస్తుందేమోనని ఆశతో ఎదురు చూస్తున్నానని చెప్పారు. ఈ ప్లీనరీలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, బీఎస్పీ రాష్ట్ర నాయకులు శంకరాచారి, జస్టిస్ ఈశ్వరయ్య, డీఎస్పీ చీఫ్​ విశారదన్ మహరాజ్, కాంగ్రెస్ నాయకులు చెరుకు సుధాకర్, కత్తి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.