శంషాబాద్ ఎయిర్ పోర్టులో సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్ సదుపాయం

శంషాబాద్ ఎయిర్ పోర్టులో సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్ సదుపాయం

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం గేట్ ఎంట్రీ నంబర్ 9 సమీపంలో సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. మెరుగైన సామర్థ్యంతో  అంతరాయం లేని ప్రయాణాన్ని పెంచడానికి, విమానాశ్రయం ఎనిమిది పూర్తి ఆటోమేటెడ్ సెల్ఫ్-బ్యాగేజ్ యంత్రాలను ఏర్పాటు చేసింది. ఈ యంత్రాల్లో స్కానర్లు, స్కేల్స్, సెన్సార్లు అమర్చి ప్రయాణికులు తమ బ్యాగేజీ చెక్ ఇన్ సదుపాయాన్ని 45 నుంచి -60 క్షణాల్లోనే పూర్తి చేసుకోవచ్చు.

సెల్ఫ్-బ్యాగ్ డ్రాప్ ఎలా ఉపయోగించాలంటే..

స్టెప్ 1: సెల్ఫ్ చెక్ ఇన్

బోర్డింగ్ పాస్ ప్రింట్ చేయడానికి ప్రయాణికులు కియోస్క్ లో సెల్ఫ్ చెక్ చేసుకుంటారు. కియోస్క్ వద్ద వారు బ్యాగేజ్ ఆప్షన్ను ఎంచుకుని.. బ్యాగుల సంఖ్య, బరువు వంటి వివరాలను అందించి, బ్యాగ్ ట్యాగ్ ను  ప్రింట్ తీసుకుంటారు.

స్టెప్ 2: సెల్ఫ్ బ్యాగ్ డ్రాప్

బ్యాగేజీ ట్యాగింగ్ తర్వాత, ప్రయాణికులు సెల్ఫ్ బ్యాగ్ డ్రాప్ యూనిట్ కు  వెళ్తారు. వారు బ్యాగేజీని కన్వేయర్ బెల్ట్ పై ఉంచుతారు. బ్యాగ్ డ్రాప్ ప్రక్రియను ప్రారంభించడానికి వారి బోర్డింగ్ పాస్ లోని బార్ కోడ్ ను స్కాన్ చేస్తారు. సెల్ఫ్-బ్యాగ్ డ్రాప్ యూనిట్ బ్యాగ్ పై  తనిఖీలు చేసి అంతా సక్రమంగా ఉంటే.., బ్యాగ్ ను  ప్రాసెస్ చేసి విమానయాన సంస్థకు ఆమోదాన్ని పంపుతుంది. ఒకవేళ బ్యాగేజ్ అవసరమైన ప్రమాణాలను అందుకోనట్లయితే, సెల్ఫ్-బ్యాగ్ డ్రాప్ యూనిట్ దానిని తిరస్కరించి చెక్-ఇన్ ఏజెంట్ నుండి సహాయం పొందమని ప్రయాణికుడికి తెలియజేస్తుంది.

ఒకవేళ అదనపు బ్యాగేజీ ఉంటే ప్రయాణికుడు విమానయాన సంస్థకు చెందిన బ్యాగేజ్ కౌంటర్ ను ఆశ్రయించాల్సి ఉంటుంది. తొలుత బెంగళూరు, చెన్నై వెళ్లే ఇండిగో ఎయిర్ లైన్స్ ప్రయాణికులకు సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.