
హైడ్రా ఏర్పాటైన నుంచి హైదరాబాద్ లో ప్రభుత్వ ఆస్తులను సంరక్షిస్తోంది. కబ్జాకు గురైన కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలాలను కబ్జాదారుల నుంచి రక్షిస్తోంది. గచ్చిబౌలిలో రూ.11 కోట్ల విలువైన 600 గజాల స్థలాన్ని కబ్జాదారుల నుంచి సెప్టెంబర్ 9న కాపాడినట్లు హైడ్రా ప్రకటించింది.
తెలంగాణ సెక్రటేరియట్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీకి చెందిన 24 ఎకరాల లే అవుట్‌లో పార్కుల కోసం కేటాయించిన స్థలాన్ని అక్రమంగా అమ్మారని హైడ్రాకు ఫిర్యాదు వచ్చింది. ఫిర్యాదుపై క్షేత్ర స్థాయిలో పరిశీలించిన హైడ్రా ఆక్రమణలను తొలగించి పార్కు స్థలాలకు ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి పార్కు స్థలాలుగా గుర్తించింది. అక్రమంగా అమ్మకాలు, కొనుగోళ్లు జరిపిన వారిపై విచారణ మొదలు పెట్టింది. ఎవరు అమ్మారు, ఎవరు కొనుగోలు చేశారనే దానిపై దానిపై దర్యాప్తు చేస్తోంది. ఇంకా ఎన్ని స్థలాలు అక్రమంగా అమ్మినారో గుర్తించి కేసులు నమోదు చేయనుంది హైడ్రా.
జూబ్లీహిల్స్ లో 100 కోట్ల స్థలం
ఇటీవలే ఆగస్టు 25న జూబ్లీహిల్స్ లో వంద కోట్ల విలువ చేసే భూమిని హైడ్రా కాపాడింది. జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి ప్రజావసరాల కోసం ఉద్దేశించిన భూమి 20 ఏళ్లుగా కబ్జాకు గురైందని ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ జరిపిన హైడ్రా అక్రమ నిర్మాణాలను తొలగించింది. మొత్తం వంద కోట్ల రూపాయల విలువైన 2 వేల గజాల స్థలాన్ని కాపాడారు హైడ్రా అధికారులు.
►ALSO READ | ఈగల్ టీం స్పెషల్ ఆపరేషన్.. రూ. 3 కోట్ల హవాలా డబ్బు సీజ్
మాదాపూర్ లో 400 కోట్ల స్థలం
హైదరాబాద్లోని మాదాపూర్ జూబ్లీ ఎన్ క్లేవ్లో జై హింద్ రెడ్డి అనే వ్యక్తి పార్కులు, ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశాడని హైడ్రాకు జూబ్లీ ఎన్ క్లేవ్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. లే ఔట్‌లో ఉన్న 4 పార్కుల్లో 2 పార్కులతో పాటు, 5 వేల గజాల రహదారి, 300 గజాల ప్రభుత్వ స్థలం కబ్జాకు గురైనట్లు హైడ్రా గుర్తించింది. 2025 ఆగస్టు 21న ఆక్రమణలను తొలగించి మొత్తం 16 వేల గజాల స్థలాన్ని హైడ్రా రక్షించింది. దీని విలువ సుమారు 400 కోట్ల వరకు ఉంటుందని హైడ్రా అధికారులు తెలిపారు.
పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గర 200 కోట్ల స్థలం
జూబ్లీహిల్స్ రోడ్‌నంబర్-41లోని పెద్దమ్మ తల్లి టెంపుల్ సమీపంలో అత్యంత విలువైన పార్కు స్థలాన్ని మే 24,2025న కబ్జా నుంచి రక్షించారు. 30 ఫీట్ల రోడ్డు దారిలో ఆక్రమణలు తొలగించి 2 ఎకరాల పార్కుకు దారి క్లియర్ చేశారు. దాదాపు రూ. 200 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడింది హైడ్రా.