జట్టుకు ఎందుకు దూరంగా ఉన్నానో తెలీదు

జట్టుకు ఎందుకు దూరంగా ఉన్నానో తెలీదు

టీమ్ లో ఎంపిక చేయకపోవడంపై అమిత్ మిశ్రా ఆవేదన

న్యూఢిల్లీ: టీమిండియాలో తాను లేకపోవడానికి కారణం తెలియదని వెటరన్ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా చెప్పాడు. గాయం తర్వాత సెలెక్టర్లను సంప్రదించినప్పటికీ వారు తనను కాంటాక్ట్ అవ్వలేదని, ఎటువంటి కమ్యూనికేషన్ జరగలేదని లెగ్గీ అన్నాడు. మాజీ సెలెక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ ప్లేయర్స్ తో కమ్యూనికేషన్ పెంచుకోవడం గురించి ఈమధ్య ఎక్కువగా మాట్లాడుతున్నాడు. వరల్ట్ కప్ జట్టులో నుంచి అంబటి రాయుడును టీమ్ తప్పించడం నుంచి ట్రిపుల్ సెంచరీ కొట్టిన కరుణ్ నాయర్ ను విండీస్ టెస్ట్ సిరీస్ లో సెలెక్ట్ చేయకపోవడంపై ఎమ్మెస్కే చాలా విషయాలను రీసెంట్ గా పంచుకున్నాడు. తాను ప్లేయర్స్ తో బాగా కమ్యూనికేషన్ చేస్తూ ఉండేవాణ్నని ఎమ్మెస్కే చెప్పాడు. అయితే తాజాగా మెన్ ఇన్ బ్లూ సీనియర్ ప్లేయర్స్ చెప్తున్న విషయాలను బట్టి ఎమ్మెస్కే ఆటగాళ్లతో పెద్దగా కమ్యూనికేషన్ లో లేడని తెలుస్తోంది. ఎమ్మెస్కే తనతో ఎప్పుడూ మాట్లాడలేదని సీనియర్ లెఫ్టాండర్ సురేష్ రైనా చెప్పిన మరుసటి రోజే అమిత్ మిశ్రా కూడా అదే రకమైన కామెంట్ చేశాడు. తాను ఆడిన చివరి వన్డే సిరీస్ ల్లో మిశ్రా చాలా బాగా పెర్ఫామ్ చేసినప్పటికీ అతడికి సీనియర్ స్పిన్నర్ల వల్ల చోటు దక్కలేదు. 2016లో న్యూజిలాండ్ తో సిరీస్ లో మిశీ 16 వికెట్లతో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా ఐదు వన్డేల సిరీస్ ను గ్రాండ్ గా ముగించాడు. ఒక మ్యాచ్ లో ఆరు ఓవర్లలో ఐదు వికెట్లతో చెలరేగాడు. ఆ తర్వాత దురదృష్టవశాత్తు మళ్లీ ఒక్క వన్డే కూడా ఆడలేకపోయాడు.

సెలెక్టర్స్ నుంచి కమ్యూనికేషన్ లేదు
‘నేను న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాను. ఆ తర్వాత ఇంగ్లండ్ తో జరిగిన ఓడీఐ సిరీస్ లో ప్లేయింగ్ ఎలెవన్ లో నన్ను ఎంపిక చేయలేదు. మూడో టీ20లో మాత్రమే నన్ను ఆడించారు. ఆ మ్యాచ్ లో కూడా నేను బాగా పెర్ఫామ్ చేశా. ఆ మ్యాచ్ లోనే నాకు గాయమైంది. అప్పుడు కోచ్ అనిల్ కుంబ్లేతో నేను మాట్లాడా. అనిల్ భాయ్ నన్ను ఫిట్ గా మారమని చెప్పారు. నేషనల్ క్రికెట్ అకాడమీలో ఎనిమిది నెలల పాటు ఉన్నా. గాయం నుంచి కోలుకునే క్రమంలో సెలెక్టర్లతో మాట్లాడా. కానీ వారి నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలేదు. తర్వాత ఫిట్ గా ఉండాల్సిందిగా ఫిజియో నుంచి ఓ మెసేజ్ వచ్చింది. అనంతరం ఆడిన మూడు మ్యాచుల్లో 20 నుంచి 22 వికెట్లు తీశా. ఫిట్ నెస్ సాధించాక ఒక వన్డే, టీ20తోపాటు ఐపీఎల్ ఆడా. కానీ సెలెక్టర్ల నుంచి ఎలాంటి కమ్యూనికేషన్ లేదు. ఐపీఎల్ తర్వాత నాతో ఎవరూ చర్చలు కూడా జరపలేదు. ఎవరూ మెసేజ్ కూడా చేయలేదు. జట్టు నుంచి నన్ను ఎందుకు బయట ఉంచారో నాకు తెలీదు’ అని మిశ్రా ఆవేదన వ్యక్తం చేశాడు.