ఇంపాక్ట్ ప్లేయర్‌గా జట్టులోకి వచ్చిన ఆర్సీబీ ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్ అదరగొడుతున్నాడు. అవకాశం వచ్చిన నాలుగు మ్యాచుల్లో బ్యాటింగ్‌లో కీ రోల్ ప్లే చేశాడు. ముఖ్యంగా కేకేఆర్‌పై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఆర్సీబీకి విజయాన్ని అందించాడు. లీగ్ దశలో భాగంగా ఎస్ఆర్హెచ్తో జరిగిన చివరి మ్యాచులోనూ ఆకట్టుకున్నాడు. అయినప్పటికీ జట్టులో వెంకటేష్ అయ్యర్ స్థానానికి గ్యారెంటీ లేకుండా పోయింది.
గాయం నుంచి కోలుకున్న ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ నాకౌట్ మ్యాచులకు అందుబాటులోకి వచ్చాడు. దీంతో వెంకటేష్ అయ్యర్‌ను పక్కన పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ అంశంపై భారత మాజీ క్రికెటర్ సెహ్వాగ్ స్పందించాడు. ఓ స్పోర్ట్స్ చానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సాల్ట్ కోసం వెంకటేష్ అయ్యర్‌ను జట్టులో నుంచి తీసేయొద్దని ఆర్సీబీకి సూచించాడు. ఒకవేళ సాల్ట్‌ను కచ్చితంగా ప్లేయింగ్ లెవన్‌లో ఆడించాలనుకుంటే పెద్దగా ఫామ్‌లోని జితేశ్ శర్మను పక్కన పెట్టాలని సూచించాడు.
అంతేకానీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్న అయ్యర్‌ను జట్టు నుంచి తొలగించకూడదని ఆల్ రౌండర్‌కు మద్దతు తెలిపాడు. అవకాశం వచ్చిన ప్రతిసారి వెంకటేష్ అయ్యర్ తనను తాను నిరూపించుకున్నాడని కొనియాడాడు. వెంకటేష్ అయ్యర్ టాపార్డర్ లో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తాడని.. గత కేకేఆర్ ఫ్రాంచైజీ తరుఫున కూడా అతడు టాపార్డర్ లో బరిలోకి దిగి అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడని గుర్తు చేశాడు. ప్లే ఆఫ్స్ వేళ అయ్యర్ వంటి డాషింగ్ బ్యాటర్ జట్టులో ఉండటం ఆర్సీబీకి కలిసి వస్తుందని చెప్పాడు.
