13 నెలలు 86 జట్లు.. 225 మ్యాచ్‌లు

13 నెలలు 86 జట్లు.. 225 మ్యాచ్‌లు

దుబాయ్‌‌‌‌: ఆస్ట్రేలియా వేదికగా 2022లో జరిగే టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌లో పోటీ పడేందుకు భారీ పోటీ ఉండనుంది. కరోనా కారణంగా 2020 నుంచి 2022కు పోస్ట్‌‌‌‌పోన్‌‌‌‌ అయిన ఈ మెగా టోర్నీలో  హోస్ట్‌‌‌‌ టీమ్‌‌‌‌ హోదాలో ఆస్ట్రేలియా నేరుగా అర్హత సాధిస్తుండగా మిగతా 15 స్థానాల కోసం ఏకంగా 86 జట్లు బరిలో నిలుస్తాయి. దీని కోసం ఏడాదికిపైగా సాగే క్వాలిఫికేషన్‌‌‌‌ ప్రాసెస్‌‌‌‌ను ఐసీసీ సోమవారం రిలీజ్‌‌‌‌ చేసింది. షార్ట్‌‌‌‌ ఫార్మాట్‌‌‌‌ గేమ్‌‌‌‌ను వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌ పాపులర్‌‌‌‌ చేసేందుకు ఐదు ఖండాలను అర్హత పోటీల్లో భాగం చేసింది.  దీని ప్రకారం 13 నెలల పాటు సుదీర్ఘంగా సాగే క్వాలిఫికేషన్‌‌‌‌ ఫేజ్‌‌‌‌లో 86 జట్లు 225 మ్యాచ్‌‌‌‌ల్లో తలపడనున్నాయి. ఈ ప్రాసెస్‌‌‌‌  వచ్చే ఏడాది ఏప్రిల్‌‌‌‌లో మొదలవనుంది.  ఐదు ఖండాల్లో ఏకంగా 11 రీజనల్‌‌‌‌ క్వాలిఫికేషన్‌‌‌‌ టోర్నమెంట్లు జరగనున్నాయి.  హంగేరీ, రుమేనియా, సెర్బియా దేశాలు ఫస్ట్‌‌‌‌ టైమ్‌‌‌‌ మెన్స్‌‌‌‌ టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ క్వాలిఫికేషన్‌‌‌‌ ఆడనుండగా, ఫిన్లాండ్‌‌‌‌.. తొలిసారి ఓ ఐసీసీ ఈవెంట్‌‌‌‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. అలాగే, జపాన్‌‌‌‌ కూడా టీ20 వరల్డ్ కప్‌‌‌‌ క్వాలిఫయర్‌‌‌‌ టోర్నీని ఫస్ట్‌‌‌‌ టైమ్‌‌‌‌ హోస్ట్‌‌‌‌ చేయనుంది. కాగా, రీజినల్‌‌‌‌ లెవెల్లో 67 అసోసియేట్‌‌‌‌ దేశాలు ఈ క్వాలిఫికేషన్​ టోర్నీల్లో పోటీ పడతాయి. ఆఫ్రికా, యూరప్‌‌‌‌ ఖండాల్లో క్రికెట్‌‌‌‌ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌కు అవకాశాలు ఎక్కువ ఉండడంతో వీటిలో సబ్‌‌‌‌ రీజనల్‌‌‌‌ క్వాలిఫయర్స్‌‌‌‌ ఆ తర్వాత ఒక్కో రీజియన్‌‌‌‌కు ఫైనల్‌‌‌‌ క్వాలిఫయర్‌‌‌‌ను ఐసీసీ కేటాయించింది.

క్వాలిఫికేషన్‌‌‌‌ ఇలా..

2022 అక్టోబర్​– నవంబర్​లో జరిగే వరల్డ్​కప్​లో మొత్తం 16 జట్లు పోటీ పడతాయి. ఆతిథ్య దేశంగా ఆస్ట్రేలియా నేరుగా క్వాలిఫై అవుతుంది. 2021ఎడిషన్‌‌‌‌ టోర్నీలో ఆసీస్​ మినహా టాప్‌‌‌‌–12  టీమ్స్‌‌‌‌ కూడా అర్హత సాధిస్తాయి. మిగిలిన నాలుగు బెర్తులను క్వాలిఫికేషన్‌‌‌‌ టోర్నీల ద్వారా తేలుస్తారు. వీటి కోసం మూడు అంచెల్లో పోటీలు నిర్వహిస్తారు. తొలి అంచెలో ఆఫ్రికాలో రెండు, యూరప్‌‌‌‌లో మూడు సబ్‌‌‌‌ రీజనల్​ టోర్నీలు జరుగుతాయి. ఆఫ్రికాలో13 జట్లు, యూరప్‌‌‌‌లో24 జట్లు ఇందులో పోటీ పడతాయి. అనంతరం ఆఫ్రికా నుంచి రెండు జట్లు, యూరప్‌‌‌‌ నుంచి మూడు జట్లు రెండో దశ అయిన రీజనల్‌‌‌‌ క్వాలిఫయర్‌‌‌‌కు అర్హత సాధిస్తాయి. అక్కడ.. ఈఏపీ (ఈస్ట్‌‌‌‌ ఆసియా అండ్‌‌‌‌ పసిఫిక్‌‌‌‌–8 జట్లు), అమెరికా (9 జట్లు), యూరప్‌‌‌‌ (4 జట్లు), ఆఫ్రికా (4 జట్లు), ఆసియా–ఎ (5 జట్లు), ఆసియా–బి (6 జట్లు) తమ తమ రీజనల్​ టోర్నీల్లో తలపడతాయి. వీటిలో ఫలితాల ఆధారంగా ఈఏపీ, ఆఫ్రికా, ఆసియా–ఎ, ఆసియా–బి నుంచి ఒక్కో టీమ్‌‌‌‌, అమెరికా, యూరప్‌‌‌‌ రీజియన్ల నుంచి రెండేసి జట్లు మూడో దశ అయిన టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ క్వాలిఫయర్‌‌‌‌–ఎ, క్వాలిఫయర్‌‌‌‌–బి టోర్నమెంట్లకు అర్హత సాధిస్తాయి. వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ క్వాలిఫయర్‌‌‌‌–ఎ టోర్నీలో ఆఫ్రికా రీజినల్‌‌‌‌ క్వాలిఫయర్‌‌‌‌ టీమ్‌‌‌‌, 2021 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌లో చివరి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు, నేపాల్‌‌‌‌, జింబాబ్వే, యూఏఈ, సింగపూర్‌‌‌‌ టీమ్స్‌‌‌‌ మధ్య పోటీలు జరుగుతాయి. వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ క్వాలిఫయర్‌‌‌‌–బి టోర్నీలో… ఈఏపీ నుంచి ఒక టీమ్‌‌‌‌, ఆసియా (ఎ,బి), అమెరికా, యూరప్‌‌‌‌ రీజియన్ల  నుంచి వచ్చిన రెండేసి జట్ల మధ్య పోటీ ఉంటుంది. వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ ఎ, బి క్వాలిఫయింగ్​ టోర్నీల నుంచి రెండేసి జట్ల చొప్పున నాలుగు జట్లు మెగా ఈవెంట్‌‌‌‌ బెర్తులు దక్కించుకుంటాయి.