
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ మరింత బలపడిందన్నారు మంత్రి, ఆప్ నేత అతిషి. మే12వ తేదీ సోమవారం అతిషి మీడియాతో మాట్లాడుతూ.. "ఈరోజు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆప్ ఎమ్మెల్యేలు అందిరితో సమావేశమయ్యారని తెలిపారు.
తీహార్ జైలు నుంచి సీఎం విడుదలపై ఎమ్మెల్యేలంతా సంతోషం వ్యక్తం చేశారని చెప్పారు. ఆప్ ను విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ, కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నం పూర్తిగా విఫలమైందన్నారు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఆప్ మరింత బలపడిందని.. కేంద్ర సర్కార్ నియంతృత్వంపై పోరాడే ఒక కుటుంబంగా ఆవిర్భవించిందన్నారు. ఈ నియంతృత్వ సర్కార్ ను ఓడిస్తామని ఆమె చెప్పారు.
ఆ తర్వాత ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ.. ‘అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్లినప్పుడు.. పార్టీలోని నలుగురు పెద్ద నేతలంతా జైల్లో ఉన్నారని ఆప్ నేతల్లో కొంత ఆందోళన ఉన్నదని.. కానీ, అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత అందరూ ఒక్కతాటిపైకి రావడం పెద్ద విషయమన్నారు. ఈ ఎన్నికల్లో ప్రతి రాష్ట్రంలో బీజేపీకి సీట్లు తగ్గుతాయని ఆయన జోష్యం చెప్పారు. ఈ ఎన్నికల్లో తమ సీట్లు పెరుగుతాయనుకునే ఒక్క రాష్ట్రం పేరైనా బీజేపీ చెప్పాలన్నారు. బీజేపీకి 200 నుంచి -220 సీట్లే వస్తాయని దేశ ప్రజలు అంచనా వేస్తున్న ఆయన తెలిపారు.