గ్రామసభకు రాకపోతే రూ.500 ఫైన్

గ్రామసభకు రాకపోతే రూ.500 ఫైన్

తంగళ్లపల్లి, వెలుగుకలెక్టర్‌‌ సాబ్‌ ‌మన ఊరికి వస్తుండు.. గ్రామ పంచాయతీ ముందు శ్రమదానం చేయాలి.. మీటింగ్‌కు ‌రాకపోతే ఒక్కొక్కరికి రూ.500 జరిమానా వేస్తామనడంపై మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక తయారీలో భాగంగా రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో  శనివారం గ్రామసభ ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్‌‌‌హాజరవుతుండడంతో అధికార పార్టీకి చెందిన సర్పంచ్‌‌అంకారపు అనిత ఐకేపీ అధికారుల సాయంతో మహిళలు గ్రామసభకు కచ్చితంగా హాజరవ్వాలని ఆదేశించారు. స్వశక్తి మహిళలు కలెక్టర్‌‌కార్యక్రమానికి హాజరు కాకపోతే రూ.500 జరిమానా కట్టాలని చెప్పారు. దాంతో మహిళలు పనులు వదులుకుని సభకు హాజరయ్యారు. జరిమానాల పేరుతో భయాందోళనకు గురి చేయడం ఏమిటని ఐకేపీ ఆఫీసర్లను నిలదీశారు. సర్పంచ్‌‌ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. కూలి పని చేస్తేనే పూట గడుస్తుందని, మీటింగ్‌కు తప్పనిసరిగా రావాలనడం సరికాదని అన్నారు. అధికార పార్టీ నాయకులు ఏం చెబితే ఆఫీసర్లు అలా చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై సర్పంచ్‌‌అంకారపు అనిత మాట్లాడుతూ జరిమానా వేస్తామని చెప్పగానే వేయరని, గ్రామాభివృద్ధిలో భాగంగా గ్రామసభలో ప్రజలకు అవగాహన కల్పించడానికి మాత్రమే ఈ విషయం ప్రకటించామన్నారు. మీటింగ్‌కు ‌రావాలనే తప్ప జరిమానా విధించడం తమ ఉద్దేశం కాదని అన్నారు. ఎవరికీ ఫైన్ విధించడానికి తమకు ఎలాంటి అధికారం లేదని సీఏల జిల్లా అధ్యక్షురాలు గుంటి రేణుక తెలిపారు.