బ్యాటరీ కారు ఎక్కువగా కొనట్లే

బ్యాటరీ కారు ఎక్కువగా కొనట్లే

న్యూఢిల్లీ: హ్యుండై ఈ ఏడాది ఆగస్టులో కోనా పేరుతో మనదేశంలోకి తొలి ఎలక్ట్రిక్ ఎస్‌‌యూవీని విడుదల చేసింది. టీవీల్లో, పేపర్లలో అడ్వర్టైజ్‌‌మెంట్స్‌‌తో హోరెత్తించింది. నెలలు గడిచినా దీని అమ్మకాలు కనీసం 200లు కూడా దాటలేదు. మనదేశంలో దాదాపు 15 కోట్ల మంది డ్రైవర్లు ఉన్నారు. కోనా ఎస్‌‌యూవీని కొన్నవారి సంఖ్య 130 మాత్రమే. ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికిల్స్‌‌ అమ్మడం ఎంత కష్టమో  కోనా సేల్స్‌‌ మంచి ఉదాహరణ. ఈవీలకు చాలా రాయితీలు ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నా, కొనడానికి ప్రజలు ఆసక్తి చూపడం లేదు. కోనా ధర దాదాపు రూ.25 లక్షలు. ఇండియన్‌‌ ఏడాది సగటు సంపాదన రూ.1.50 లక్షలు. మనదేశంలో బెస్ట్‌‌ సెల్లింగ్‌‌ కారు ధర రూ.మూడు లక్షల వరకు ఉంటుంది. కోనా వంటి ఖరీదైన కార్లు ఇండియాలో అమ్ముడయ్యే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఇండియాలో గత ఆరేళ్లలో అమ్ముడైన ఈవీల సంఖ్య ఎనిమిది వేలు మాత్రమే. చైనాలో రెండు రోజుల్లో ఎనిమిది వేల ఈవీలు అమ్ముడవుతాయి. ‘‘ఎలక్ట్రిక్ కార్లను కొనగలిగే స్తోమత మనదేశంలో అతితక్కువ మందికే ఉంది. రెండుమూడేళ్ల తరువాత వీటి అమ్మకాలు పెరగొచ్చు’’ అని మారుతీ  చైర్మన్‌‌ ఆర్సీ భార్గవ అన్నారు.

ఫలితం ఇవ్వని రాయితీలు

వాహన కాలుష్యం వల్ల ప్రపంచంలోని అత్యంత కాలుష్య దేశాల్లో ఇండియా కూడా ఒకటిగా మారింది. అందుకే గత నాలుగేళ్ల నుంచి కేంద్రం ఈవీలను ప్రోత్సహిస్తున్నది. వీటికి రాయితీలు ఇవ్వడం, తయారీని పెంచడం, ప్రచారం కల్పించడానికి రూ.10 వేల కోట్ల దాకా ఖర్చు చేయాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఈవీల అమ్మకాలు మందకొడిగా ఉన్నప్పటికీ, క్రమంగా పెరుగుతాయనే వాదనలూ ఉన్నాయి. ఇండియాలో ప్రతి వెయ్యి మందిలో 27 మందికి మాత్రమే కార్లు ఉన్నాయి. జర్మనీ వంటి దేశాల్లో ఈ సంఖ్య 570 వరకు ఉంటుంది. ఈ నేపథ్యంలో మారుతీ తన తొలి ఈవీని వచ్చే ఏడాదిలోపు తీసుకురానుంది. టాటా, మహీంద్రా కంపెనీలు బేస్ లెవెల్‌‌ ఈవీలను తీసుకొస్తాయి. ప్రస్తుతం కొన్ని మోడళ్లు ఉన్నప్పటికీ, వాటిని ప్రభుత్వ కంపెనీలకు మాత్రమే అమ్ముతున్నాయి. తెలంగాణ ఆర్టీసీ సైతం కొన్ని కంపెనీల నుంచి ఎలక్ట్రిక్​ బస్సులను కొని నడిపిస్తున్న సంగతి తెలిసిందే.

భవిష్యత్‌‌పై ఆశలు

2040 నాటికి కొత్త వాహనాల అమ్మకాల్లో 28 శాతం ఈవీలే ఉంటాయని అంచనా. ఎంజీ మోటర్‌‌, నిస్సన్‌‌ మోటర్‌‌ వంటివి కూడా ఈవీలను తయారు చేయడానికి ప్లాన్లను రెడీ చేసుకుంటున్నాయి. సాధారణ వాహనాలతో పోలిస్తే ఈవీలకు మారడం కొంత నెమ్మదిగా జరుగుతుందని ఎంజీ మోటర్‌‌ ఇండియా ఎండీ రాజీవ్‌‌ చాబా అన్నారు. ప్రస్తుతం అయితే ఖరీదైన ఈవీల కంటే పెట్రోల్‌‌, డీజిల్‌‌ వాహనాలనే కస్టమర్లు ఇష్టపడుతున్నారని ఫెడరేషన్‌‌ ఆఫ్ ఆటోమొబైల్‌‌ డీలర్స్‌‌ అసోసియేషన్‌‌ వైస్‌‌ ప్రెసిడెంట్‌‌ వింకేశ్‌‌ గులాటీ అన్నారు. గత ఏడాది మనదేశంలో అమ్ముడైన కార్లలో సగం కంటే ఎక్కువ రూ.ఏడు లక్షల లోపు ధర ఉన్నవే! 2030 తరువాతే ఈవీల ధరలు తగ్గుతాయని వాహన కంపెనీలు అంటున్నాయి. కొందరు పర్యావరణంపై ప్రేమతో కోనా వంటి వాహనాలను కొంటున్నా వాటిని చార్జ్‌‌ చేయడం కష్టమవుతోంది. వీటితో అగ్నిప్రమాదాలు జరుగుతాయంటూ అపార్టుమెంటు కమిటీలు ఆక్షేపిస్తున్నాయని ఢిల్లీకి మహేశ్వరి అనే ఉద్యోగిని వాపోయారు. ఇంట్లోనే చార్జింగ్‌‌ సదుపాయాలు ఉండాలని అన్నారు. మరో సమస్య ఏమిటంటే ఈవీలకు సెకండరీ సేల్‌‌ మార్కెట్‌‌ తక్కువ కాబట్టి వీటి కొనుగోలుకు బ్యాంకులు లోన్లు ఇవ్వడం లేదు. అందుకే కోనా వంటి ఈవీలను కొనడం చాలా మందికి సాధ్యం కావడం లేదని మరో ఢిల్లీవాలా, యాడ్‌‌ ఏజెన్సీ ఉద్యోగి దేవదాస్‌‌ నాయర్‌‌ అన్నారు.