న్యూఢిల్లీ: రష్యా నుంచి క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకోవడంతో కిందటి ఆర్థిక సంవత్సరంలో 25 బిలియన్ డాలర్ల (రూ.2.07 లక్షల కోట్ల) కు పైగా ఇండియా ఆదా చేయగలిగింది. ప్రభుత్వ డేటా ప్రకారం, 2023–24 లో 132.40 బిలియన్ డాలర్ల (రూ.10.98 లక్షల కోట్ల) విలువైన క్రూడాయిల్‌ను ఇండియా దిగుమతి చేసుకుంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఇంతే మొత్తం క్రూడాయిల్ దిగుమతుల కోసం 157.50 బిలియన్ డాలర్ల (రూ.13 లక్షల కోట్ల) ను ఖర్చు చేసింది. 2022–23 లో 232.5 మిలియన్ టన్నుల క్రూడాయిల్ దిగుమతి చేసుకుంటే, కిందటి ఆర్థిక సంవత్సరంలో 232.7 మిలియన్ టన్నుల క్రూడాయిల్‌ను ఇండియా దిగుమతి చేసుకుంది.
రెండు ఆర్థిక సంవత్సరాల్లో సేమ్ అమౌంట్ ఆయిల్‌ను దిగుమతి చేసుకున్నా, రష్యా నుంచి దిగుమతులు పెరగడం వలన 25.10 బిలియన్ డాలర్లు మిగిలాయి. ఆయిల్ దిగుమతుల్లో 85 శాతాన్ని డాలర్లలో ఇండియా చెల్లిస్తోంది. 2023–24 లో బ్యారెల్ క్రూడాయిల్‌కు (ఇండియన్ బాస్కెట్) సగటున 82.58 డాలర్లను ఇండియా చెల్లించింది. ఇది అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో చెల్లించిన 93.15 డాలర్ల కంటే 10.57 డాలర్లు తక్కువ.
ఎన్‌పీజీ, నాఫ్తా, బిటుమెన్ వంటి పెట్రోలియం ప్రొడక్ట్‌ల దిగుమతుల విలువ కూడా 2023–24 లో 25.1 బిలియన్ డాలర్లకు తగ్గింది. 2022–23 లో 28.2 బిలియన్ డాలర్ల విలువైన పెట్రోలియం ప్రొడక్ట్‌లను దిగుమతి చేసుకున్నాం. కాగా, 2023–24 లో 47.4 బిలియన్ డాలర్ల (62.2 మిలియన్ టన్నులు) విలువైన వేరు వేరు పెట్రోలియం ప్రొడక్ట్‌లను ఎగుమతి చేశాం.
