న్యూఢిల్లీ: ఇండియా ఎకానమీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7 శాతం వృద్ధిని నమోదు చేయనుందని, ఇది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) అక్టోబర్‌లో అంచనా వేసిన 6.6 శాతం కంటే ఎక్కువగా ఉందని ఐఎంఎఫ్ మాజీ చీఫ్ ఎకనామిస్ట్ గీతా గోపీనాథ్ తెలిపారు. టైమ్స్ నెట్‌వర్క్ ఇండియా ఎకనామిక్ కాన్‌క్లేవ్ 2025లో మాట్లాడుతూ, జులై–-సెప్టెంబర్ క్వార్టర్‌లో జీడీపీ గ్రోత్ రేట్ 8.2 శాతం రావడంతో సంస్థ అంచనాలు తక్కువగా ఉన్నాయని అన్నారు.
ఆర్‌బీఐ కూడా ఇటీవల జీడీపీ వృద్ధి అంచనాను 6.8 శాతం నుంచి 7.3 శాతానికి పెంచింది. ‘‘భారత్ 20 సంవత్సరాల పాటు 8 శాతం వృద్ధిని కొనసాగిస్తే 2047 లక్ష్యాలకు చేరువవుతుంది. కానీ దీన్ని సాధించడానికి నిరంతర సంస్కరణలు అవసరం”అని గోపీనాథ్ వివరించారు. ఇండియా–అమెరికా వాణిజ్య సంబంధాలపై మాట్లాడుతూ, యూఎస్ భారత్‌కు కీలక భాగస్వామి అని, ఇరు దేశాలు పరస్పర అంగీకారంతో సమస్యలు పరిష్కరించుకోవాలని అన్నారు.
ట్రంప్ ప్రభుత్వం భారత వస్తువులపై టారిఫ్‌లను 50 శాతం వరకు పెంచడం, రష్యా క్రూడ్ ఆయిల్ కొనుగోలుపై అదనపు సుంకం విధించడం సంబంధాలను దెబ్బతీసిందని ఆమె గుర్తుచేశారు.
7.5 శాతం వృద్ధి..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇండియా జీడీపీ 7.5 శాతం వృద్ధి చెందుతుందని కేర్‌ఎడ్జ్ రేటింగ్స్ అంచనావేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7 శాతానికి తగ్గనుందని తెలిపింది. డాలర్‌తో రూపాయి ప్రస్తుతం 91 మార్క్ దాటినా, 2026–27లో 89–90 స్థాయికి పుంజుకుంటుందని అంచనా వేసింది. ద్రవ్యోల్బణం తగ్గడం, తక్కువ పన్నులతో వృద్ధి పుంజుకుంటుందని అభిప్రాయపడింది.
