- పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కుమారుల ఆవేదన
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను అడియాలా జైలులో చీకటి గదిలో నిర్భందించి మానసిక హింసకు గురి చేస్తున్నారని ఆయన కుమారులు కాసిం ఖాన్, సులేమాన్ ఇసా ఖాన్ ఆరోపించారు. జైలులో ఉన్న తమ తండ్రిని ఇక ఎప్పటికీ చూడలేమేమోనని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఓ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో వారు ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆగస్టు 2023 నుంచి జైలులో ఉన్న తమ తండ్రిని కొన్ని నెలలుగా చూడలేదు, మాట్లాడలేదని వారు చెప్పారు. ఇమ్రాన్ చిన్న కుమారుడు కాసిం ఖాన్ మాట్లాడుతూ.. “మా నాన్నను రెండేండ్లకు పైగా ఒంటరిగా నిర్బంధ గదిలో ఉంచారు. అక్కడ ఆయనకు మురికి నీరు ఇస్తున్నారు. హెపటైటిస్‌తో చనిపోతున్న ఖైదీల మధ్య ఆయన ఉన్నారు. అక్కడి పరిస్థితులు అసహ్యకరంగా ఉన్నాయి.
కనీసం జైలు గార్డులను కూడా ఆయనతో మాట్లాడటానికి అనుమతించడం లేదు. ఆయనను బయటకు తీసుకురావడానికి ఏ మార్గం కనిపించడం లేదు. పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి" అని ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు. పెద్ద కుమారుడు సులేమాన్ ఖాన్ మాట్లాడుతూ.. తన తండ్రికి కేటాయించిన గదిని డెత్రూంగా అభివర్ణించారు. ఎక్కువ సేపు తన తండ్రి నిర్బంధ గదిలోనే గడుపుతున్నారని అన్నారు.
శుక్రవారం ఓ ఆర్మీ ప్రతినిధి ఇమ్రాన్ ఖాన్‌ను ఇప్పుడు అధికారికంగా పూర్తి ఏకాంతంలో ఉంచినట్టు ప్రకటించారని ఆయన చెప్పారు. అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా ఆయన జైలు జీవితం గడుపుతున్నారని ఆయన పేర్కొన్నారు. కాగా, ఇటీవల ఇమ్రాన్ ఖాన్ జైలులోనే మరణించారని ప్రచారం జరగడంతో
పాకిస్తాన్లో ఆందోళనలు ఉధృతమయ్యాయి.
