పేరుకు మాత్రం ప్రపంచ ప్రఖ్యాత ఫుడ్ అవుట్ లెట్.. వ్యాపారం కూడా అదే స్థాయిలో ఉంటుంది.. అయినా నాసిరకం వంట నూనెలు, ఆహార పదార్థాలతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. కుళ్లిన కూరగాయాలు, మరగబెట్టిన నాసిరకం నూనెలతో ఫుడ్స్ తయారు చేసి అమ్ముతున్నారు. ప్రజల ప్రాణాలు మీదకు తెస్తున్నారు. ఆహార భద్రతా తనిఖీల్లో విస్తు పోయే విషయాలు వెల్లడయ్యాయి. వివరాల్లోకి వెళితే..
మెక్‌డొనాల్డ్స్ (McDonald's) ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఫాస్ట్ ఫుడ్ చైన్.. భారతదేశంలో మెక్‌అలూ టిక్కీ, మహారాజా మాక్, మెక్‌స్పైసీ పనీర్ మెక్ స్పూసీ చికెన్ వంటి శాఖాహార, మాంసాహార బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ నగ్గెట్స్, మెక్‌కాఫే కాఫీలు బాగా ప్రాచుర్యం పొందాయి. ఇవి స్థానిక రుచులకు అనుగుణంగా ప్రత్యేకమైన మెనూను అందిస్తూప్రజల్లో మంచి ఆదరణ పొందింది.
అయితే ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారులు చేసిన తనిఖీల్లో విస్తు పోయే నిజాలు బయటికొచ్చాయి. రాజస్థాన్ రాజధాని జైపూర్ లోని మెక్ డొనాల్డ్స ఫుడ్ అవుట్ లెట్ పై దాడులు నిర్వహించిన అధికారులు కుళ్లిన కూరగాయాలు, నాసిరకం నూనెలు, బాగా మరిగించిన నూనెల తిరిగి వాడుతున్నారని గుర్తించారు.
తనిఖీల్లో 150 డిగ్రీల కంటే ఎక్కువగా వేడిచేసిన నూనెను రోజంతా వినియోగిస్తున్నట్లు గుర్తించారు. ఆ నూనెలు నల్లగా మారిపోయాయి ఉపయోగించలేనివి ఉన్నాయని దాదాపు 40 లీటర్ల నూనెను ధ్వంసం చేశారు. కొత్త స్టాక్ తో భర్తీ చేయాలని ఆదేశించారు. శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపించారు.
మాంసాహార ఫుడ్స్ లో ఉపయోగించే నూనెలో టోటల్ పోలార్ కాంపౌండ్ (TPC) స్థాయిలు 28 శాతం ఉన్నాయని , శాఖ హార వంటకాల్లో 31 శాతం టీపీసీ నమోదు అయిందని అధికారులు తేల్చారు. ఆహార భద్రతా నిబంధనల ప్రకారం. 25 శాతం కంటే ఎక్కువ టీపీసీ స్థాయిలు ఉండకూడదు. అది ఆరోగ్యానిక అంత సురక్షితం కాదు. మెక్ డొనాల్డ్స్ లాంటి పేరుమోసిన రెస్టారెంట్లలోనే ఇలా జరగడం ఫుడ్ సేఫ్టీపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
