- ఉపాధి హామీ పేరు మార్పుపై కేంద్ర మాజీ మంత్రి చిదంబరం
న్యూఢిల్లీ: ఉపాధి హామీ పథకం పేరు మార్చడమంటే జాతిపితను రెండోసారి హత్యచేయడమేనని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పేరును మారుస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త బిల్లును ఆయన తప్పుబట్టారు. ఇది ముమ్మాటికీ మహాత్మా గాంధీని అవమానించడమేనని దుయ్యబట్టారు.
ఈమేరకు ఆయన ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. మొన్నటి వరకు వాళ్లు (బీజేపీ నేతలు) దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ ను నిందించారు. ఇక ఇప్పుడు మహాత్ముడిని లక్ష్యంగా చేసుకున్నారు. భారతీయుల మనస్సుల్లో నుంచి మహాత్మా గాంధీని తొలగించడమే వారి టార్గెట్. నేటి పిల్లలకు గాంధీ పేరు తెలియకూడదని, ప్రజలు గాంధీ పేరును మరిచిపోవాలని సిస్టమేటిక్ గా పావులు కదుపుతున్నారు.
చరిత్రలో నుంచి మహాత్ముడి పేరును తొలగించడమే వారి లక్ష్యం’ అంటూ చిదంబరం మండిపడ్డారు. కాగా, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి హోదాలో 2004 బడ్జెట్లో చిదంబరం ప్రకటించారు.
