గ్లోబల్ మార్కెట్ పతనం.. మూడో రోజూ స్టాక్ మార్కెట్ డౌన్‌‌‌‌‌‌‌‌..

గ్లోబల్ మార్కెట్ పతనం.. మూడో రోజూ స్టాక్ మార్కెట్ డౌన్‌‌‌‌‌‌‌‌..
  • 120 పాయింట్లు పడ్డ సెన్సెక్స్‌‌‌‌‌‌‌‌
  • ఆల్‌‌‌‌‌‌‌‌ టైమ్ కనిష్టం నుంచి కోలుకున్న రూపాయి

ముంబై: వరుసగా మూడో రోజు స్టాక్ మార్కెట్లు బలహీనంగా ముగిశాయి. గ్లోబల్ మార్కెట్లు పడడంతో  సెన్సెక్స్ బుధవారం 120 పాయింట్లు  (0.14శాతం) తగ్గి 84,559.65 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఇది 263.88 పాయింట్లు తగ్గి 84,415.98 వరకు చేరింది.  ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఈ నిఫ్టీ కూడా 41.55 పాయింట్లు లేదా 0.16శాతం నష్టపోయి 25,818.55 వద్ద ముగిసింది.

 సెన్సెక్స్‌‌‌‌‌‌‌‌లో ట్రెంట్ 1.61శాతం నష్టపోగా, హెచ్‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌సీ బ్యాంక్ దాదాపు 1శాతం పతనమైంది. ఐసీఐసీఐ బ్యాంక్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫిన్‌‌‌‌‌‌‌‌సర్వ్, భారత్ ఎలక్ట్రానిక్స్, టైటాన్, ఏషియన్ పెయింట్స్ కూడా బలహీనంగా ముగిశాయి. అయితే ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ  1.51శాతం పెరిగి సెన్సెక్స్‌‌‌‌‌‌‌‌ నష్టాలను కొంత తగ్గించింది.  ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, మారుతి కూడా లాభాల్లో నిలిచాయి.  

‘‘ విదేశీ పెట్టుబడిదారులు నిధులను ఉపసంహరించుకుంటున్నారు.  అభివృద్ధి చెందిన  మార్కెట్ల వైపు చూస్తున్నారు.  దీంతో  ఎమర్జింగ్ మార్కెట్లపై ఒత్తిడి పెరుగుతోంది”అని జియోజిత్ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్స్ ఎనలిస్ట్ వినోద్ నాయర్  అన్నారు. రెలిగేర్ బ్రోకింగ్‌‌‌‌‌‌‌‌కి చెందిన అజిత్ మిశ్రా మాట్లాడుతూ, గ్లోబల్ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు ఇన్వెస్టర్ సెంటిమెంట్‌‌‌‌‌‌‌‌ను మరింత దెబ్బతీశాయని చెప్పారు. 

ఫారిన్ ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఐలు)  మంగళవారం నికరంగా రూ.2,381.92 కోట్ల విలువైన షేర్లను అమ్మగా, బుధవారం మాత్రం రూ.1,100 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. బ్రెంట్ క్రూడ్ ధర 2.12శాతం పెరిగి బ్యారెల్‌‌‌‌‌‌‌‌కు  60.17 డాలర్లకి చేరింది.

పుంజుకున్న రూపాయి 

డాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో రూపాయి విలువ బుధవారం రికార్డు కనిష్ట స్థాయి నుంచి ఒక శాతానికి  పైగా పుంజుకుని తాత్కాలిక ఉపశమనం ఇచ్చింది. ఇంట్రాడేలో  89 వద్ద ట్రేడ్ అయిన రూపాయి చివరికి 90.38 వద్ద ముగిసింది.  ఇది గత కనిష్టం 90.93 కంటే 55 పైసలు తక్కువ.