- యాదాద్రి, మెదక్ జిల్లాల్లో 90% పైనే
- అత్యల్పంగా నిజామాబాద్‌లో76 శాతం, సిరిసిల్లలో 79 శాతం
- రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతల్లో కలిపి 85.30 శాతం నమోదు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 12,728 గ్రామ పంచాయతీలకు గాను ఏకగ్రీవాలు (1,205), నామినేషన్లు పడనివి (21), కోర్టు కేసులతో ఆగినవి (5) పోగా.. మిగిలిన 11,497 పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఈ నెల 11న మొదటి విడత, 14న రెండో విడత ఎన్నికలు పూర్తయ్యాయి. బుధవారం చివరి విడత ఎన్నికల్లో 85.77% పోలింగ్ నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా మూడు విడతల్లో కలిపి 85.30 శాతం పోలింగ్ రికార్డు అయింది.
నవంబర్ 26న షెడ్యూల్ విడుదలతో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల ప్రక్రియ బుధవారంతో ముగిసింది. మూడు దశల్లో కలిపి మొత్తం కోటి 66 లక్షల 48 వేల 496 మంది ఓటర్లకు గాను.. కోటి 35 లక్షల23 వేల137 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం మీద 12,702 మంది సర్పంచులు, 85 వేలకు పైగా వార్డు సభ్యులు కొత్త పాలకవర్గాల్లో కొలువుదీరనున్నారు. ఈ మేరకు ఈ నెల 22న ఆయా పంచాయతీల్లో ప్రమాణస్వీకారం జరగనుంది.
పోలింగ్ శాతంలో యాదాద్రి జిల్లా టాప్
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓటర్లు చైతన్యాన్ని చాటారు. మూడో విడత ఎన్నికల్లో 92.56% పోలింగ్‌తో ఈ జిల్లా టాప్‌లో నిలవగా.. మెదక్ జిల్లా 90.68%తో రెండో స్థానంలో నిలిచింది. మిగిలిన జిల్లాలతో పోలిస్తే నిజామాబాద్ (76.45%), రాజన్న సిరిసిల్ల (79.14%)లో తక్కువ పోలింగ్‌శాతం నమోదైంది. నిజామాబాద్, సిరిసిల్ల జిల్లా ల్లో పోలింగ్ శాతం తగ్గడానికి పురుష ఓటర్లే కారణమని తెలుస్తున్నది. నిజామాబాద్ జిల్లాలో పురు షుల ఓటింగ్ శాతం కేవలం 68.70% కాగా.. మహిళలు 83.06% మంది ఓటేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ 82.62% మంది మహిళలు ఓటుహక్కు వినియోగించుకోగా.. పురుషులు 75.43 శాతానికే పరిమితమయ్యారు. ప్రతి జిల్లాలోనూ మహిళలే ఎక్కువ శాతం ఓటింగ్‌లో పాల్గొనగా.. యాదాద్రి(92.79%), మెదక్ (91.42%) జిల్లా ల్లో మాత్రం మహిళలను మించి పురుషులు ఓటేశారు.
2 గంటలకు కౌంటింగ్ ప్రారంభం
ఎన్నికల ఆఫీసర్లు లంచ్ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించగా.. తొలుత పోస్టల్ బ్యాలెట్లు లెక్కించారు. కౌంటింగ్ టైంలో ఎలాంటి గొడవలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. మూడో విడత ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో సెక్షన్ 163 (పాత 144 సెక్షన్) కింద నిషేధాజ్ఞలు అమలు చేశారు. ఊరేగింపులు, ర్యాలీలు, బహిరంగ సభలకు అనుమతి నిరాకరించారు. కాగా, వార్డుల వారీగా రౌండ్ టు రౌండ్ ఓట్ల ఫలితాలను వెల్లడించారు.
సర్పంచ్, వార్డు మెంబర్లుగా గెలుపొందినవారు ప్రత్యేకంగా సమావేశమై ఉప సర్పంచ్‌లను ఎన్నుకున్నారు. మరోవైపు.. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని, పంచాయతీ ఎన్నికల అథారిటి సృజన, ఎస్ఈసీ సెక్రటరీ మంద మకరందు ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని పరిశీలించారు.
ప్రత్యేక ఆకర్షణగా గ్రీన్ పోలింగ్ కేంద్రాలు
మూడు విడతల్లోనూ చెదురుముదురు ఘటనలు మినహా అన్నిచోట్లా పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 3,547 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ నిర్వహించారు. గ్రీన్ పోలింగ్ కేంద్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పర్యావరణ హితం కోరుతూ వీటిని ఏర్పాటు
చేసినట్లు అధికారులు తెలిపారు.
బారులు తీరిన ఓటర్లు
మూడో విడతలో భాగంగా బుధవారం 3,752 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించగా.. ఓటర్లు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్‌కేంద్రాల వద్ద బారులు తీరారు. మధ్యాహ్నం ఒంటి గంట కల్లా పోలింగ్‌ముగిసింది. ఆలోపు క్యూలైన్లో ఉన్నవారిని ఓటేసేందుకు ఎన్నికల ఆఫీసర్లు పర్మిషన్ ఇచ్చారు. పోలింగ్ ముగిసిన తర్వాత గంట లంచ్‌బ్రేక్ తీసుకొని ఆ వెంటనే కౌంటింగ్ ప్రారంభించి.. విజేతలను ప్రకటించారు. దాదాపుగా అన్ని గ్రామాల్లో ఉప సర్పంచుల ఎన్నిక కూడా పూర్తి చేశారు.
మూడో విడత 182 మండలాల్లో 4,159 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా.. 394 సర్పంచ్, 7,908 వార్డు సభ్యులు ఏకగ్రీవమయ్యారు. 11 సర్పంచ్, 116 వార్డు స్థానాలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. మరో 2 సర్పంచ్, 18 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగలేదు. మిగిలిన 3,752 పంచాయతీల్లో సర్పంచ్ పదవికి 12,652 మంది, వార్డు మెంబర్ కోసం 75,725 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ మూడో దశలో 50 లక్షల 56 వేల 344 మంది ఓటర్లకుగాను 43 లక్షల 37 వేల 024 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
మొదటి విడత ఇలా..
- మండలాలు 189
- ఎన్నికలు జరిగిన సర్పంచ్ స్థానాలు 3,834
- వార్డులు 27,628
- ఏకగ్రీవమైన
- పంచాయతీలు 396
- పోలింగ్ కేంద్రాలు 37,562
- పోలింగ్ కేంద్రాల్లో
- వెబ్‌కాస్టింగ్ 3,461
- మొత్తం ఓటర్లు 53,57,277
- ఓటు వేసిన వారు 45,15,141
- మొత్తం పోలింగ్
- నమోదు 84.28 %
- అత్యధికంగా యాదాద్రి భువనగిరి 92.88 %
- అత్యల్పంగా
- భద్రాద్రి కొత్తగూడెం 71.79 %
రెండో విడత ఇలా..
- మండలాలు 193
- ఎన్నికలు జరిగిన సర్పంచ్ స్థానాలు 3,911
- వార్డులు 29,917
- ఏకగ్రీవమైన
- పంచాయతీలు 415
- పోలింగ్ కేంద్రాలు 38,350
- పోలింగ్ కేంద్రాల్లో
- వెబ్‌కాస్టింగ్ 3,769
- మొత్తం ఓటర్లు 54,40,339
- ఓటు వేసిన వారు 46,70,972
- మొత్తం పోలింగ్
- నమోదు 85.86 %
- అత్యధికంగా యాదాద్రి భువనగిరి 91.72 %
- అత్యల్పంగా
- భద్రాద్రి కొత్తగూడెం 76.71 %
మూడో విడత ఇలా..
- మండలాలు 182
- ఎన్నికలు జరిగిన సర్పంచ్ స్థానాలు 3,752
- వార్డులు 28,410
- ఏకగ్రీవమైన
- పంచాయతీలు 394
- పోలింగ్ కేంద్రాలు 36,483
- పోలింగ్ కేంద్రాల్లో
- వెబ్‌కాస్టింగ్ 3,547
- మొత్తం ఓటర్లు 50,56,344
- ఓటు వేసిన వారు 43,37,024
- మొత్తం పోలింగ్
- నమోదు 85.77 %
- అత్యధికంగా యాదాద్రి భువనగిరి 92.56 %
- అత్యల్పంగా
- భద్రాద్రి కొత్తగూడెం 76.45 %
