ర్యాపిడో డ్రైవర్ రాడ్డుతో రుబాబు: డ్రైవింగ్‌లో ఫోన్ వాడొద్దు స్టీరింగ్ పట్టుకోమన్నందుకు గొడవ

ర్యాపిడో డ్రైవర్ రాడ్డుతో రుబాబు: డ్రైవింగ్‌లో ఫోన్ వాడొద్దు స్టీరింగ్ పట్టుకోమన్నందుకు గొడవ

ఫరీదాబాద్ రిజిస్ట్రేషన్ నంబరు కలిగిన ఒక ర్యాపిడో క్యాబ్ డ్రైవర్, ప్రయాణికుడిపై రాడ్‌తో దాడికి యత్నించిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. ఒక జర్నలిస్ట్ తనకు ఎదురైన ఈ చేదు అనుభవాన్ని వీడియో రూపంలో పంచుకోవడంతో ప్రయాణికుల భద్రతపై మరోసారి పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.

ప్రయాణం మధ్యలో డ్రైవర్ ఫోన్ మాట్లాడుతూ.. ఒక చేత్తోనే కారు నడుపుతున్నాడని సదరు జర్నలిస్ట్ వీడియోలో చెప్పాడు. ఈ క్రమంలో క్యాబ్ ఒక మోటార్ సైకిల్‌ను ఢీకొట్టినంత పని అయ్యింది. భద్రత దృష్ట్యా సదరు జర్నలిస్ట్ డ్రైవర్‌ను ఫోన్ పక్కన పెట్టి రెండు చేతులతో స్టీరింగ్ పట్టుకోవాలని సూచించాడు. దీంతో చిర్రెత్తుకొచ్చింది ఆ క్యాబ్ డ్రైవర్ కి. వెంటనే క్యాబ్ రోడ్డు మధ్యలో ఆపేసి, కారులో ఉన్న ఒక ఇనుప రాడ్‌ను తీసుకుని జర్నలిస్ట్‌పై దాడికి దిగాడు. ఈ క్రమంలో ట్రాఫిక్‌ నిలిచిపోవటంతో స్థానికులు జోక్యం చేసుకున్నారు.

డ్రైవర్ చేతిలో రాడ్ పట్టుకుని ఆవేశంగా జర్నలిస్టుపై దాడికి ప్రయత్నించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చుట్టుపక్కల ఉన్నవారు "ఎందుకు కొడుతున్నావు? అతడిని కొడితే నీకు డబ్బులు వస్తాయా?" అని డ్రైవర్‌ను ప్రశ్నించారు ఆ వీడియోలో. మరికొందరు "కారు తీసి పక్కకు పెట్టు, ట్రాఫిక్ ఆగిపోతోంది" అని వారించడంతో డ్రైవర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే ఈ విషయం గురించి ర్యాపిడోకు కంప్లెయింట్ చేసినా ఎలాంటి స్పందన రాలేదని తన పోస్టులో చెప్పాడు బాధిత జర్నలిస్ట్. ఆ డ్రైవర్ ఇంకా వారి ప్లాట్‌ఫారమ్‌లో కొనసాగుతున్నాడని అనిపిస్తోంది. ఉబెర్ కంటే కొంచెం తక్కువ ధర ఉండొచ్చు కానీ, ఇక్కడ మీ ప్రాణాలకు రక్షణ లేదని తన ఎక్స్ పోస్టులో ర్యాపిడో యూజర్లను హెచ్చరించాడు. 

ALSO READ : అరే ఏంట్రా ఇది.. అది బైక్ రా.. ఆటో కాదు..

అయితే ఈ దాడి వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాడు అప్పటికే రాడ్ సిద్ధంగా పెట్టుకున్నాడంటే వాడు ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవాలని ఒక యూజర్ కామెంట్ చేయగా.. మరో యూజర్ తనకు కూడా గతంలో ఇలాంటి అనుభవం ఒకటి ఎదురైందని కామెంట్ పెట్టారు. అలాగే మహిళా ప్రయాణికుల భద్రత గురించి కూడా పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ ఘటనపై ర్యాపిడో సంస్థ నుండి గానీ, పోలీసుల నుండి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే క్యాబ్ సర్వీసుల్లో డ్రైవర్ల ప్రవర్తనను పర్యవేక్షించే వ్యవస్థ మరింత కఠినంగా ఉండాలని యూజర్ల నుంచి డిమాండ్ పెరుగుతోంది. ఒకవేళ మీకు ఎప్పుడైనా ఇలాంటి సమస్య ఎదురైతే వెంటనే సంబంధిత యాప్‌లోని 'SOS' బటన్‌ను వాడటం లేదా పోలీసులకు ఫిర్యాదు చేయడం మంచిది.