టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ ఎట్టకేలకు చాలా రోజుల తర్వాత టీమిండియా ప్లేయింగ్ 11లో చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. గిల్ రాకతో మిడిల్ ఆర్డర్ కు పడిపోయిన శాంసన్.. ఆ తర్వాత జితేష్ శర్మ రాకతో ప్లేయింగ్ 11లో చోటు కోల్పోయాడు. జట్టులో రిజర్వ్ ఓపెనర్.. రిజర్వ్ వికెట్ కీపర్ గా సంజును టీమిండియా యాజమాన్యం కొనసాగిస్తోంది. సౌతాఫ్రికాతో జరగనున్న ఐదో టీ20 కోసం టీమిండియా తుది జట్టులో సంజు శాంసన్ ఓపెనర్ గా బరిలోకి దిగడం ఖయాంగా మారింది. గిల్ గాయం కారణంగా తప్పుకోవడంతో అభిషేక్ శర్మతో ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు.
సౌతాఫ్రికాతో నాలుగో టీ20కి ముందు టీమిండియా ఓపెనర్ శుభమాన్ గిల్ గాయం కారణంగా దూరమయ్యాడు. బుధవారం (డిసెంబర్ 17) లక్నో వేదికగా ఏకనా క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ ప్రారంభానికి ముందు నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తుండగా గిల్ పాదానికి గాయమైంది. దీంతో నాలుగో టీ20 మ్యాచ్ కు దూరమయ్యాడు. ఈ మ్యాచ్ పొగమంచు కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టీమిండియా శుక్రవారం (డిసెంబర్ 19) జరగబోయే చివరిదైన ఐదో టీ20 కోసం సిద్ధమవుతోంది. నాలుగో టీ20.. ఐదో టీ20 మ్యాచ్ కు ఒక రోజు మాత్రమే గ్యాప్ ఉండడంతో గిల్ కోలుకోవడం కష్టంగానే కనిపిస్తోంది.
గిల్ స్థానంలో సంజు శాంసన్ ప్లేయింగ్ 11లోకి రావడం ఖాయమైంది. ఫామ్ లో లేని గిల్ ఈ మ్యాచ్ కు దూరం కావడంతో టీమిండియాకు ఎదురు దెబ్బ తగిలింది. గిల్ గాయంపై బీసీసీఐ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. టీ20 వరల్డ్ కప్ ముందు గిల్ ను మ్యాచ్ ఆడించి రిస్క్ చేయాలనే ఆలోచనలో బీసీసీఐ లేదు. చివరి టీ20కి గిల్ కు రెస్ట్ ఇవ్వనున్నట్టు సమాచారం. అదే జరిగితే ఓపెనర్ గా సంజు శాంసన్ నిరూపించుకోవడానికి ఇదే సరైనసమయం. ఆస్ట్రేలియాతో రెండో టీ20 తర్వాత ప్లేయింగ్ 11లో చోటు లేకుండా బెంచ్ కే పరిమితమైన శాంసన్ కు ఇది గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి.
ఈ మ్యాచ్ లో సంజు భారీ ఇన్నింగ్స్ ఆడితే అతడిని జట్టు నుంచి తప్పించలేని పరిస్థితి. కొంతకాలంగా ఫామ్ లో లేకపోయినా గిల్ ను జట్టులో కొనసాగిస్తున్నారని సోషల్ మీడియాలో శుభమాన్ పై విమర్శలు చేస్తున్నారు. గిల్ ను తప్పించి శాంసన్ కు అవకాశం ఇవ్వాలనే డిమాండ్స్ వినిపించాయి. గిల్ కు దురదృష్టవశాత్తు గాయం కావడంతో శాంసన్ కు లైన్ క్లియర్ అయింది. మరి శాంసన్ వచ్చిన అవకాశాన్ని ఎలా వినియోగించుకుంటాడో చూడాలి.
నాలుగో టీ20 రద్దు:
దట్టమైన పొగమంచు కారణంగా.. ఇండియా, సౌతాఫ్రికా మధ్య బుధవారం జరగాల్సిన నాలుగో టీ20 మ్యాచ్ రద్దయింది. సాయంత్రం నుంచే స్టేడియం మొత్తాన్ని పొగమంచు ఆవరించి ఉండ5టంతో విజిబిలిటీ గణనీయంగా తగ్గిపోయింది. దాంతో టాస్ వేయడాన్ని ఆలస్యం చేశారు. అక్కడి నుంచి ప్రతి అర్ధ గంటకు ఒకసారి అంపైర్లు గ్రౌండ్‌ను పరిశీలించారు. విజిబిలిటీ మెరుగుపడితే తక్కువ ఓవర్ల మ్యాచ్‌నైనా ఆడించేందుకు ప్రయత్నించారు. కానీ వాతావరణంలో ఎలాంటి మార్పు కనిపించలేదు. 9.30 గంటలకు ఆరోసారి మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
