అవును.. వాళ్లిద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు. ఎంతగా అంటే ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా.. పెద్దలకు ఇష్టం లేకపోయినా 8 నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. అమ్మాయి అంత ఇష్టపడుతుంది కదా అని అమ్మాయి తరపు వాళ్లు ఓకే అన్నారు.. అబ్బాయి తల్లి మాత్రం ససేమిరా అన్నది.. అప్పట్లో కొడుకు బలవంతంతో ఓకే చెప్పినా.. పెళ్లి తర్వాత అసలు సిసలు సినిమా మొదలైంది. ఎనిమిది నెలలు తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్న ఆ అమ్మాయి.. ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్నది.
హైదరాబాద్ సిటీ శివార్లలోని తాండూరు పట్టణం సాయిపూర్ కు చెందిన నరేష్, అనూష. వీళ్లిద్దరూ ఎనిమిది నెలల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి నరేష్ తల్లికి ఇష్టం లేదు. కొడుకు ప్రేమ పెళ్లి చేసుకున్నాడనే కోపంతో.. మొదటి నుంచి కోడలు అనూషను వేధింపులకు గురి చేస్తూనే ఉంది. కోడలు అనూషను సూటిపోటి మాటలతో వేధించటం.. తిట్టటం చేస్తుండేదంట. ఈ క్రమంలోనే చాలా సార్లు పుట్టింటికి వచ్చేసేది. ఆ తర్వాత భర్త నరేష్ రావటం.. బుజ్జగించటం.. ఆ తర్వాత మళ్లీ అత్తారింటికి వెళ్లటం జరిగేదంట.
మూడు రోజుల క్రితం అత్తారింట్లో జరిగిన గొడవతో పుట్టింటికి వచ్చింది అనూష. ఆ తర్వాత భర్త నరేష్ వచ్చి భార్య అనూషను.. తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ ఏం జరిగిందో ఏమో.. 2025, డిసెంబర్ 18వ తేదీ ఉదయం ఇంట్లో చనిపోయింది. ఈ విషయం తెలిసి అనూష పేరంట్స్ ఆస్పత్రికి తరలివచ్చారు.
నా బిడ్డను అత్తమామలే కొట్టి చంపారని అనూష పేరంట్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నా చెల్లిని అకారణంగా వేధించేవారు.. గొడవల వల్ల ఇంటికి వస్తే.. భర్త వచ్చి తీసుకువెళ్లాడు.. ఇంతలోనే తనను ప్రాణాల్లేకుండా చేశారు.. అని అనూష అన్నయ్య చెబుతున్నాడు. అనూష మృతిపై విచారణ చేయాలని.. అనూష భర్త నరేష్, వాళ్ల అమ్మానాన్నలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు బాధిత కుటుంబ సభ్యులు.
