హైదరాబాద్: ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న MLAల కేసులో తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కీలక తీర్పు ప్రకటించారు. MLAల అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టేశారు. ఐదుగురు MLAలపై ఆరోపణలను స్పీకర్ తోసిపుచ్చారు. పార్టీ ఫిరాయించినట్టు ఆధారాలు లేవని స్పీకర్ చెప్పారు. స్పీకర్ నిర్ణయంతో.. ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, కృష్ణమోహన్, ప్రకాష్‌గౌడ్, గూడెం మహిపాల్‌కు ఊరట లభించింది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీ ఫామ్‌పై గెలిచిన 10 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారని, పార్టీ ఫిరాయించారనేది బీఆర్ఎస్ ప్రధాన ఆరోపణ.
ALSO READ : థర్డ్ ఫేజ్.. గెలిచిన సర్పంచ్ అభ్యర్థులు వీరే
ఐదుగురు ఎమ్మెల్యేలపై అనర్హతను తోసిపుచ్చిన స్పీకర్.. మరో ముగ్గురు ఎమ్మెల్యేలు.. పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య, సంజయ్ కుమార్ పై గురువారం తీర్పు వెల్లడించనున్నారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి అనర్హత పిటిషన్లపై విచారణ ఇంకా పూర్తి కాలేదు. స్పీకర్ నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు ఎమ్మెల్యేలు దానం, కడియం మరింత గడువు కోరిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి వివరణ తర్వాత స్పీకర్ తీర్పు ఇవ్వనున్నారు.
వాళ్లు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే.. పార్టీ మారినట్లు ఆధారాలు లేవు: స్పీకర్
మా ఎమ్మెల్యేలు పార్టీ మారారు.. వాళ్లపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై విచారణ చేసిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.. విచారణ తర్వాత బుధవారం తన తీర్పు వెల్లడించారు. ఐదుగురు ఎమ్మెల్యేలు అయిన అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, కృష్ణమోహన్ రెడ్డిలు పార్టీ మారలేదని.. వాళ్లు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగానే.. అసెంబ్లీలో కొనసాగుతారని.. స్పీకర్ ప్రసాద్ కుమార్ విచారణ తర్వాత స్పష్టం చేశారు.
ఈ ఐదుగురు ఎమ్మెల్యేలను విచారించిన తర్వాత.. వాళ్లు పార్టీ మారినట్లు ఆధారాలు లేవని వెల్లడించారు స్పీకర్. పార్టీ మారలేదని.. అసెంబ్లీలో కూడా వాళ్లు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగానే ఉంటారని.. ఆ పార్టీ తరపున ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు కొనసాగుతారని స్పీకర్ వివరించారు.
