ఫైర్ సేఫ్టీపై హైడ్రా స్పెషల్ ఫోకస్.. షాపుల యజమానులకు కీలక ఆదేశాలు..

ఫైర్ సేఫ్టీపై హైడ్రా స్పెషల్ ఫోకస్.. షాపుల యజమానులకు కీలక ఆదేశాలు..

హైదరాబాద్ లోని నాంపల్లిలో ఇటీవల జరిగిన ఫర్నిచర్ షాపు అగ్నిప్రమాదాన్ని సీరియస్ గా తీసుకుంది హైడ్రా. ఈ క్రమంలో పలు ఫర్నిచర్ షాపులపై మెరుపు దాడులు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించిన పలు షాపులను సీజ్ చేశారు అధికారులు. శనివారం ( జనవరి 31 ) జీహెచ్ఎంసీ, ఫైర్, విద్యుత్ శాఖ అధికారులతో కలిసి వ్యాపార సంఘాలతో కీలక సమావేశం నిర్వహించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఈ సమావేశంలో షాపుల యజమానులకు కీలక ఆదేశాలు జారీ చేశారు కమిషనర్ రంగనాథ్. ఫైర్ సేఫ్టీ నిబంధనలపై నెల రోజుల పాటు అవహగానా కార్యక్రమాలు నిర్వహిస్తామని.. నెల రోజుల తర్వాత కఠిన తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకుంటామని అన్నారు.

నెలరోజుల్లోపు అందరూ ఫైర్ సేఫ్టీ నిబంధనలు అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫైర్ సేఫ్టీ ఉల్లంఘనలపై షాపుల సీజ్ కార్యక్రమానికి తాత్కాలిక విరామం ఇచ్చామని.. వ్యాపార సంఘాల విజ్ఞప్తితో నెల గడువు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇటీవల సీజ్ చేసిన 9 షాపుల నుంచి అఫిడవిట్లు తీసుకుని అనుమతిస్తామని అన్నారు. భవిష్యత్తులో తప్పులు చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు కమిషనర్ రంగనాథ్.

పాతబస్తీ, బేగంబజార్, ట్రూప్ బజార్, మదీన సెంటర్‌లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని..కరపత్రాల ద్వారా ఫైర్ సేఫ్టీ నిబంధనల ప్రచారం చేయాలని అన్నారు. వ్యాపార సముదాయాల్లో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలని.. అగ్ని ప్రమాదాల వీడియోల ప్రదర్శనతో ప్రమాదాలపై అవగాహన పెంచాలని అన్నారు రంగనాథ్. సెల్లార్లను గోదాములుగా మార్చవద్దని.. సెల్లార్లలో స్టాక్, గ్రిల్స్, తాళాలు ప్రమాదకరమని హెచ్చరించారు.

►ALSO READ | హైదరాబాద్ బస్ భవన్ లో అగ్ని ప్రమాదం..సెల్లార్ లో ఎగిసిపడిన మంటలు

నాంపల్లి ఘటనలో సెల్లార్ కారణంగానే ప్రాణ నష్టం సంభవించిందని.. సెల్లార్లను వాహనాల పార్కింగ్‌కు మాత్రమే వినియోగించాలన్న సూచించారు. ఆటోమేటిక్ వాటర్ స్ప్రింక్లర్లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని..స్మోక్ డిటెక్టర్లు, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ల నిర్వహణపై దృష్టి పెట్టాలని అన్నారు. నాణ్యమైన విద్యుత్ వైర్లను వినియోగించాలని సూచించారు. విద్యుత్ సామర్థ్యానికి మించి వినియోగిస్తే ప్రమాదాల జరుగుతాయని అన్నారు.

పవర్ ప్యానెల్స్ దగ్గర అగ్ని వ్యాప్తి నివారణ చర్యలు అవసరమని.. విద్యుత్ లైట్లు, వైర్లకు దగ్గరగా మండే వస్తువులు ఉంచొద్దని సూచించారు. కింద షాపులు, పై నివాసాలున్న భవనాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఏసీలు, ఛార్జింగ్ పాయింట్లతో విద్యుత్ లోడ్ పెరుగుతుందని అన్నారు. మదీన, బేగంబజార్ ప్రాంతాల్లో ఫైర్ ఇంజన్లకు మార్గం కల్పించాలని.. సెల్లార్లలో వాచ్మెన్ కుటుంబాలు, క్యాంటీన్లు వద్దని స్పష్టం చేశారు.