మధ్యప్రదేశ్ హైకోర్టులో సోమవారం ఒక వింత ఘటన చోటుచేసుకుంది. న్యాయస్థానం అంటే కేవలం చట్టం, సాక్ష్యాధారాల ఆధారంగా నడిచే వేదిక అని.. భావోద్వేగాల ప్రదర్శనకు వేదిక కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. మారుతీ సుజుకి సంస్థపై రూ.200 కోట్ల కుంభకోణం ఆరోపణలు చేస్తూ, పరిహారం కోరిన దయాశంకర్ పాండే అనే వ్యక్తి.. తన వాదనను వినిపిస్తూ ఏకంగా గర్భస్రావం జరిగిన పిండాన్ని కోర్టు గదిలోకి తీసుకురావడం అందరినీ షాక్‌కు గురిచేసింది.
తాను మారుతీ సుజుకిలో జరిగిన భారీ కుంభకోణాన్ని బయటపెట్టినందుకు తనపై, తన కుటుంబంపై పదేపదే దాడులు జరిగాయని, ఆ దాడుల వల్లే తన భార్యకు గర్భస్రావం జరిగిందని ఆరోపించారు పిటిషనర్. తన కుమార్తె కూడా తీవ్రంగా గాయపడిందని చెబుతూ.. తన కుమార్తె చికిత్స కోసం రూ.82 లక్షలు, అలాగే ఇతర నష్టపరిహారంగా రూ.200 కోట్లు కావాలని ఆయన కోర్టును ఆశ్రయించారు. అయితే ఇన్ని తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నప్పటికీ.. కనీసం ఒక్క బేసిక్ ఎవిడెన్స్ కూడా పిటిషనర్ సమర్పించలేకపోయారని కోర్టు గుర్తించింది.
పిటిషనర్ ప్రవర్తనపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయస్థానంలో మానవ అవశేషాలను ప్రదర్శించడం చట్టవిరుద్ధమని, ఇది కోర్టు గౌరవ మర్యాదలను కించపరచడమేనని మండిపడింది. న్యాయం అనేది సాక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది తప్ప, ఇలాంటి ప్రదర్శనల వల్ల రాదని హితవు పలికింది. ఎటువంటి ఆధారాలు లేకుండా పదేపదే ఇలాంటి పిటిషన్లు వేయడం కోర్టు సమయాన్ని వృథా చేయడమేనని పేర్కొంటూ ఆ పిటిషన్‌ను కొట్టివేసింది.
బాధిత కుటుంబంపై సానుభూతి ఉన్నప్పటికీ.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని కోర్టు స్పష్టం చేసింది. పోలీసుల విచారణ సరిగ్గా లేదని భావిస్తే సంబంధిత మెజిస్ట్రేట్‌ను సంప్రదించాలి తప్ప, నేరుగా హైకోర్టులో ఇలాంటి విన్యాసాలు చేయకూడదని హెచ్చరించింది. భవిష్యత్తులో ఇలాంటి పనులు రిపీట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పిటిషనర్‌ను తీవ్రంగా మందలిస్తూ కేసును ముగించింది కోర్టు.
