షాంఘై: వరల్డ్ కప్ స్టేజ్–2 ఆర్చరీ టోర్నీలో ఇండియా విమెన్స్ రికర్వ్ జట్టు సంచలనం సృష్టించింది. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో దీపిక కుమారి–అంకితా భకత్–కుంకుమ్ మొహోద్‌లతో కూడిన ఇండియా త్రయం షూటాఫ్‌లో 5–4 (28–26)తో రెండోసీడ్ చైనా (జు జింగ్‌యి–హుయాంగ్ యివీ–యు క్వి)పై గెలిచి గోల్డ్ మెడల్‌ను సాధించింది. ఫలితంగా 2021 తర్వాత వరల్డ్ కప్‌లో విమెన్స్ జట్టుకు ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం. అలాగే 2010 నుంచి దీపిక గెలిచిన ఏడో వరల్డ్ కప్ టీమ్ గోల్డ్ మెడల్ ఇది.
2023లో పారిస్‌లో జరిగిన వరల్డ్ కప్ స్టేజ్–4లో అంకితా భకత్, భజన్ కౌర్, సిమ్రన్‌జిత్ కౌర్ బృందం చివరిసారి కాంస్య పతకం నెగ్గింది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో ఇండియా, చైనా 4–4 స్కోరుతో సమంగా నిలవడంతో షూటాఫ్ నిర్వహించారు. షూటాఫ్‌లో అంకిత 9, కుంకుమ్ 10 పాయింట్లు నెగ్గారు. చివరి బాణానికి సీనియర్ దీపిక 9 పాయింట్లు రాబట్టడంతో ఇండియాకు గోల్డ్ మెడల్ ఖాయమైంది.
విమెన్స్ ఇండివిడ్యువల్ రికర్వ్ సెమీస్‌లో వరల్డ్ నంబర్‌వన్ కాంగ్ చాయెంగ్ (సౌత్ కొరియా) చేతిలో ఓడిన సిమ్రన్‌జిత్ కౌర్.. బ్రాంజ్ మెడల్ ప్లే ఆఫ్స్‌లోనూ జాంగ్ మిన్హీ (కొరియా) చేతిలో ఓడి పతకానికి దూరమైంది. ఓవరాల్‌గా ఇండియా ఒక గోల్డ్, బ్రాంజ్ మెడల్‌తో టోర్నీని ముగించింది.
