వీడియో వైరల్: చైనా ఆర్మీని తరిమికొట్టిన భారత సైనికులు

వీడియో వైరల్: చైనా ఆర్మీని తరిమికొట్టిన భారత సైనికులు

అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సరిహద్దు వద్ద డిసెంబర్ 9న చైనా, ఇండియా సైనికుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈవిషయాన్ని భారత రక్షణ శాఖ కూడా  ఇప్పటికే ధ్రువీకరించింది. ఈనేపథ్యంలో  ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  అయితే  అది డిసెంబరు 9న బార్డర్ లో చోటుచేసుకున్న ఘర్షణకు సంబంధించిన వీడియో కాదని భారత సైన్యం స్పష్టం చేసింది. 2020 జూన్ లో తూర్పు లడ్డాఖ్ పరిధిలోని గల్వాన్ లోయలో భారత్, చైనా  ఆర్మీ మధ్య ఘర్షణ జరిగింది. ఇది చోటుచేసుకున్న కొన్నాళ్లకే వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) సమీపంలోని యాంగ్ త్సే సెక్టార్ లో  ఇండియా, చైనా  ఆర్మీ మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఇప్పుడు తాజాగా వైరల్ అవుతున్న బహుశా అక్కడిదే అయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇంకొంత మంది అది 2017 నాటి వీడియో అని కామెంట్స్ పెడుతున్నారు.

భారత భూభాగంలోకి చొరబడేందుకు యత్నించిన చైనా సైనికులను కర్రలతో భారత సైనికులు తిప్పి కొడుతున్న దృశ్యాలు తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో కనిపిస్తున్నాయి. ‘‘వాళ్లను గట్టిగా కొట్టండి.. అలా చేస్తేనే మళ్లీ తిరిగి రారు’’ అంటూ సైనికులు పంజాబీ భాషలో అంటుండం ఈ వీడియోలో వినిపిస్తుంది. డిసెంబరు 9 ఇండియా, చైనా బార్డర్ ఘటన తర్వాత పలు రాజకీయ పార్టీల నాయకులు ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో దీనిపై చర్చ మొదలైంది. అయితే డిసెంబరు 9న అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సరిహద్దు వద్ద జరిగిన ఘర్షణకు సంబంధించిన వీడియోను భారత సైన్యం  ఇంకా విడుదల చేయలేదు. అది విడుదలైతే ఘర్షణ ఏ స్థాయిలో జరిగిందనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది.