ఎర్రకోట ముందు జెండా ఎగురవేసిన రైతులు

ఎర్రకోట ముందు జెండా ఎగురవేసిన రైతులు

న్యూఢిల్లీ: ఎర్రకోట ముందు రైతులు తమ జెండా ఎగురవేయడం చర్చనీయాంశంగా మారింది. కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీ ఉద్రిక్తంగా తయారైంది. సింఘూ, టిక్రీ, ఘాజీపూర్ సరిహద్దుల వద్ద బారికేడ్లను తొలగించడానికి రైతులు ప్రయత్నించడంతో వారిపై పోలీసులు లాఠీచార్జ్‌‌కు దిగారు. టియర్ గ్యాస్‌‌ను కూడా ప్రయోగించారు. ఈ ఘటనలో ఒక ట్రాక్టర్ తిరగబడటంతో ఓ రైతు మరణించాడు. అనంతరం రైతులు ఎర్రకోట దిశగా దూసుకెళ్లారు. ఎర్రకోట ముందు తమ జెండా (ఖాల్సా గుర్తుతో ఉన్న జెండా)ను ఎగురవేశారు. రైతులను అడ్డుకోవడానికి పోలీసులు యత్నించినా కుదరలేదు. తమను అడ్డుకోవడానికి వస్తున్న పోలీసులపై రైతులు రాళ్లు రువ్వారు. అన్నదాతల ర్యాలీ వల్ల ఢిల్లీలో చాలా చోట్ల ట్రాఫిక్ స్తంభించిపోయింది. సెంట్రల్ ఢిల్లీకి వెళ్లే అన్ని రోడ్లను పోలీసులు మూసేశారు. అలాగే 10 మెట్రో స్టేషన్స్‌‌ను కూడా మూసేశారు.