భారత్ కు మిస్ యూనివర్స్ కిరీటం

 భారత్ కు  మిస్ యూనివర్స్ కిరీటం

మిస్ యూనివర్స్ కిరీటం భారత్ కు దక్కింది. పంజాబ్ కు చెందిన 21 ఏళ్ల హర్నాజ్ సంధు ఈ కిరీటం దక్కించుకుంది. ఇజ్రాయెల్ లో జరిగిన 70వ మిస్ యూనివర్స్ పోటీల్లో ఈ హర్నాజ్ ఈ ఘనత సాధించింది. 2 వేల సంవత్సరంలో చివరగా భారత్ కు చెందిన లారా దత్తాకు మిస్ యూనివర్స్ కిరీటం దక్కింది. అంతకు ముందు సుస్మితా సేన్ విశ్వ సుందరిగా ఎంపికయ్యారు. ఇన్నాళ్లకు హర్నాజ్ కౌర్ సంధుకు ఈ ఖ్యాతి దక్కింది. పరాగ్వే, సౌత్ ఆఫ్రికా నుంచి పోటీలో ఉన్న వారిని వెనక్కు నెట్టి హర్నాజ్ అందరి మనసు గెలుచుకుంది. 2020 మిస్ యూనివర్స్ మెక్సికోకు చెందిన అండ్రియా మీజా నుంచి మిస్ యూనివర్స్ కిరీటం అందుకుంది. 

హర్నాజ్ కౌర్ తర్వాత పరాగ్వే, సౌతాఫ్రికా నుంచి పాల్గొన్న యువతులు రెండు మూడు స్థానాల్లో నిలిచారు. ఇవాళ్టి రోజుల్లో యువతులకు ఎదురవుతున్న సవాళ్లు, సమస్యలను ఎలా డీల్ చేస్తారని నిర్వాహకులు హర్నాజ్ కు ప్రశ్న అడిగారు. దీనికి హర్నాజ్ చాలా తెలివిగా అద్భుతమైన సమాధానం చెప్పడంతో నిర్వాహకులను ఆకట్టుకున్నారు. యువత ఇతరులతో పోల్చుకోవడాన్ని ఆపాలని, ప్రపంచంలో జరుగుతున్న ఇష్యూస్ పై రియాక్ట్ అవ్వాలని అన్నారు. మీ జీవితానికి మీరే లీడర్లు అని, మీకోసం మీరు మాట్లాడేందుకు బయటకు రావాలని యువతకు పిలుపునిచ్చారు. తన వరకు తాను ఇది నమ్ముతానని అందుకే ఈ స్టేజ్ పై ఇంత వరకు వచ్చానని చెప్పుకొచ్చారు హర్నాజ్. తక్కువ మాట్లాడండి, ఎక్కువ పని చేయాలంటూ మరో పవర్ ఫుల్ ఆన్సర్ ఇచ్చింది హర్నాజ్ సంధు. 

క్లైమేట్ చేంజ్ పై నిర్వాహకులు అడిగిన ప్రశ్నకు హర్నాజ్ కౌర్ సంధు తనదైన శైలిలో సమాధానమిచ్చారు. మన బాధ్యతారాహిత్యమైన ప్రవర్తనతో ప్రకృతికి చాలా నష్టం జరుగుతోందని చెప్పారు. పర్యావరణ సమస్యలపై చాలా ఆవేదనతో ఉన్నట్లు చెప్పారు. పర్యావరణ పరిరక్షణపై మాటలు కట్టిపెట్టి చర్యలు తీసుకునే టైం వచ్చిందని అని అన్నారు. మన ప్రవర్తనే ప్రకృతిని కాపాడడమో చంపడమో చేస్తుందని చెప్పారు. ప్రకృతి విధ్వంసం జరిగాక చేపట్టే చర్యల కంటే ముందే మేల్కొని నివారణ చర్యలు చేపడితే మేలు అని చెప్పడంతో హాల్ అంతా చప్పట్లతో మార్మోగింది.  చండీగఢ్ కు చెందిన హర్నాజ్ మోడల్ గా నటిగా పేరు తెచ్చుకున్నారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్ చేస్తున్నారు హర్నాజ్. 2019లో ఫెమినా మిస్ ఇండియా పంజాబ్ కిరీటాన్ని అందుకున్నారు. చాలా పంజాబీ సినిమాల్లో హర్నాజ్ నటించారు.