వెయిట్‌‌‌‌ లిఫ్టింగ్‌‌లో మీరాబాయికి గోల్డ్‌‌ 

వెయిట్‌‌‌‌ లిఫ్టింగ్‌‌లో మీరాబాయికి గోల్డ్‌‌ 

సంకేత్‌‌‌‌కు సిల్వర్‌‌, గురురాజాకు బ్రాంజ్‌‌
కామన్వెల్త్‌‌లో 3 పతకాలు తెచ్చిన ఇండియా లిఫ్టర్లు

ఒకరిదేమో సూపర్‌‌‌‌‌‌‌‌‌‌ ఫామ్‌‌‌‌..! మరొకరిదేమో నాలుగేళ్ల కిందట ఇచ్చిన హామీ..! ఇంకొకరిది త్యాగం..! ఈ మూడు కలిపి కామన్వెల్త్‌‌‌‌ గేమ్స్‌‌‌‌లో ఇండియాకు మూడు పతకాలు అందించాయి..! టోక్యో ఒలింపిక్స్‌‌‌‌ ఫామ్‌‌‌‌ను కొనసాగిస్తూ మీరాబాయి చాను కామన్వెల్త్‌‌‌‌ గేమ్స్‌‌‌‌లో వరుసగా రెండో  గోల్డ్‌‌‌‌ మెడల్‌‌‌‌తో మెరిస్తే.. ఆనాడు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ మహారాష్ట్ర లిఫ్టర్‌‌‌‌ సంకేత్‌‌‌‌ మహదేవ్‌‌‌‌ సర్గార్‌‌‌‌ రజత కాంతులు విరజిమ్మాడు..!  తానేమీ తీసిపోనంటూ గురురాజా పూజారి బ్రాంజ్‌‌‌‌ మెడల్‌‌‌‌తో దేశం ఆనందాన్ని ట్రిపుల్‌‌‌‌ చేశాడు..! ఓవరాల్‌‌‌‌గా గేమ్స్‌‌‌‌ రెండో రోజే వెయిట్‌‌‌‌ లిఫ్టింగ్‌‌‌‌లో ఇండియాకు మూడు పతకాలు రావడం అతిపెద్ద విశేషం..! మిగతా ఈవెంట్లలో ఇండియా అథ్లెట్లు మెరుగైన పెర్ఫామెన్స్​ కనబరిచారు.

బర్మింగ్‌‌‌‌‌‌హామ్‌‌‌‌ : కామన్వెల్త్‌‌‌‌ గేమ్స్‌‌‌‌లో ఇండియా లిఫ్టర్లు పతకాల వేట ప్రారంభించారు. ఊహించినట్లుగానే రెండో రోజే మూడు పతకాలతో అదరహో అనిపించారు. శనివారం జరిగిన విమెన్స్‌‌‌‌ 49 కేజీ ఫైనల్లో మీరాబాయి సైకోమ్‌‌‌‌ చాను మొత్తం 201 (స్నాచ్‌‌‌‌ 88+ క్లీన్‌‌‌‌ అండ్‌‌‌‌ జర్క్‌‌‌‌ 113)  కేజీల బరువు ఎత్తి గేమ్స్‌‌‌‌ రికార్డుతో స్వర్ణం గెలుచుకుంది. 2018 గోల్డ్‌‌‌‌కోస్ట్‌‌‌‌ గేమ్స్‌‌‌‌లోనూ ఈ మణిపూరి లిఫ్టర్‌‌‌‌ గోల్డ్‌‌‌‌ను సాధించింది. స్నాచ్‌‌‌‌ తొలి రెండు ప్రయత్నాల్లో చాను వరుసగా 84, 88 కేజీల బరువు లిఫ్ట్‌‌‌‌ చేసింది. స్నాచ్‌‌‌‌లో 88 కేజీలు కామన్వెల్త్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌, గేమ్స్‌‌‌‌ రికార్డు కూడా కావడం విశేషం. ఆఖరిదైన మూడో ప్రయత్నంలో 90 కేజీలు ట్రై చేసి విఫలమైంది. క్లీన్‌‌‌‌ అండ్‌‌‌‌ జర్క్‌‌‌‌లో వరుసగా 109, 113 కేజీలు ఎత్తింది. 113 కేజీలు గేమ్స్‌‌‌‌ రికార్డు. మూడో ప్రయత్నంలో 115 కేజీలు ఎత్తలేకపోయింది. మేరీ హనిత్రా రోలియా రణైవోసో (మారిషస్‌‌‌‌) మొత్తం 172 (76+96) కేజీల బరువుతో సిల్వర్‌‌‌‌, హన్నా కామిన్‌‌‌‌స్కి (కెనడా) 171 (74+97) కేజీలతో బ్రాంజ్‌‌‌‌ మెడల్‌‌‌‌ను సొంతం చేసుకున్నారు. ఈసారి గేమ్స్‌‌‌‌లో ఇండియాకు మీరాదే తొలి స్వర్ణం కావడం విశేషం. 

మీరాబాయి ఇండియా మరోసారి గర్వించేలా చేసింది. బర్మింగ్‌‌‌‌హామ్‌‌ గేమ్స్‌‌లో ఆమె గోల్డ్‌‌ గెలిచి కొత్త కామన్వెల్త్‌‌ రికార్డును నెలకొల్పినందుకు ప్రతి ఇండియన్‌‌ సంతోషిస్తున్నాడు. ఆమె విజయం అనేక మంది భారతీయులకు, ముఖ్యంగా వర్ధమాన క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుంది.

‑ ప్రధాని మోడీ

రజత ‘సంకేతం’..
అంతకుముందు జరిగిన మెన్స్‌‌‌‌ 55 కేజీ ఫైనల్లో సంకేత్‌‌‌‌ మహాదేవ్‌‌‌‌ సర్గార్‌‌‌‌ 248 ( స్నాచ్‌‌‌‌113 + క్లీన్ అండ్‌‌‌‌ జర్క్‌‌‌‌135) కేజీల బరువు ఎత్తి రెండో స్థానంతో సిల్వర్‌‌‌‌ మెడల్‌‌‌‌ను సొంతం చేసుకున్నాడు. మలేసియా లిఫ్టర్‌‌‌‌ 249 (107+142) కేజీలతో గోల్డ్‌‌‌‌ నెగ్గాడు. దాంతో పాటు క్లీన్‌‌‌‌ అండ్‌‌‌‌ జర్క్‌‌‌‌లో 142 కేజీలతో గేమ్స్‌‌‌‌ రికార్డును బద్దలుకొట్టాడు. శ్రీలంకకు చెందిన ఇసురు కుమారా 225 (105+120) కేజీలతో బ్రాంజ్‌‌‌‌ను దక్కించుకున్నాడు. మెన్స్‌‌‌‌ 61 కేజీ కేటగిరీలో గురురాజ పూజారి.. మొత్తం 260 (స్నాచ్‌‌‌‌ 118+ క్లీన్‌‌‌‌ అండ్‌‌‌‌ జర్క్‌‌‌‌151) కేజీల బరువు ఎత్తి మూడో ప్లేస్‌‌‌‌లో నిలిచి బ్రాంజ్‌‌‌‌ మెడల్‌‌‌‌ను సాధించాడు. గోల్డ్‌‌‌‌కోస్ట్‌‌‌‌ గేమ్స్‌‌‌‌లో సిల్వర్‌‌‌‌తో మెరిసిన గురురాజ ఈసారి ఆ ఫీట్‌‌‌‌ను రిపీట్‌‌‌‌ చేయలేకపోయాడు. మలేసియా లిఫ్టర్‌‌‌‌ అజ్నిల్‌‌‌‌ బిన్‌‌‌‌ బిడిన్‌‌‌‌ మహ్మద్‌‌‌‌ 285 (127+158) కేజీల బరువుతో గేమ్స్‌‌‌‌ రికార్డు సృష్టించి గోల్డ్‌‌‌‌ మెడల్‌‌‌‌ను కైవసం చేసుకున్నాడు. మోరియా బారు (పపువా న్యూగినియా) 237 (121+152) కేజీలతో సిల్వర్‌‌‌‌ను గెలుచుకున్నాడు. 


ఫైనల్లో శ్రీహరి నటరాజ్‌‌‌‌
ఇండియా స్విమ్మర్‌‌ శ్రీహరి నటరాజ్‌‌ మెన్స్‌‌ 100 మీ. బ్యాక్‌‌స్ట్రోక్‌‌ ఈవెంట్‌‌లో ఫైనల్‌‌ చేరుకున్నాడు. సెమీస్‌‌లో అతను 54:55 సెకండ్ల టైమింగ్‌‌తో ఓవరాల్‌‌గా ఏడో ప్లేస్‌‌తో మెడల్‌‌ రౌండ్‌‌కు అర్హత సాధించాడు.అయితే, మెన్స్‌‌ 200 మీ. ఫ్రీ స్టయిల్‌‌ ఈవెంట్‌‌లో కుశాగ్ర రావత్‌‌ తన హీట్స్‌‌లో 1:54.6 సెకండ్ల టైమింగ్‌‌తో చివరి స్థానంలో నిలిచి నిరాశ పరిచాడు.  మెన్స్‌‌ 400మీ. ఫ్రీస్టయిల్‌‌లోనూ అతను సెమీస్‌‌ చేరలేకపోయాడు. 50 మీ.బటర్ ఫైలో సాజన్ ప్రకాశ్‌‌ ఏడో స్థానంతో సరిపెట్టాడు. – మెన్స్‌‌ మారథాన్‌‌లో నతేంద్ర రావత్‌‌  రెండు గంటల 19 నిమిషాల 22 సెకండ్లతో 12వ స్థానంలో నిలిచి నిరాశ పరిచాడు.

 

తుదిపోరుకు జిమ్నాస్ట్‌‌‌‌ యోగేశ్వర్‌‌
మెన్స్‌‌ ఆర్టిస్టిక్‌‌ జిమ్నాస్టిక్స్‌‌లో యోగేశ్వర్‌‌ సింగ్‌‌ ఒక్కడే ఆల్‌‌రౌండ్‌‌ ఫైనల్‌‌ చేరగా.. మిగతా జిమ్నాస్ట్‌‌లు నిరాశ పరిచారు. గట్టి పోటీ ఎదురైన క్వాలిఫికేషన్‌‌లో యోగేశ్వర్‌‌ 73.600 ఓవరల్‌‌ స్కోరుతో 16వ స్థానం సాధించాడు. 

14 ఏండ్ల అనాహత్‌‌‌‌ తొలి గెలుపు
ఈ కామన్వెల్త్‌‌లో పోటీ పడుతున్న ఇండియా యంగెస్ట్‌‌ అథ్లెట్‌‌ అయిన 14 ఏండ్ల స్క్వాష్‌‌ ప్లేయర్‌‌ అనాహత్‌‌ సింగ్‌‌ శుభారంభం చేసింది. శుక్రవారం రాత్రి జరిగిన విమెన్స్‌‌ సింగిల్స్‌‌ తొలి రౌండ్‌‌లో అనాహత్‌‌ 11–5, 11–2, 11–0తో జడా రాస్‌‌(సెయింట్‌‌ విన్సెంట్‌‌)ను ఓడించింది.  మరో మ్యాచ్‌‌లో సీనియర్‌‌ ప్లేయర్‌‌ జోష్న చిన్నప్ప 11–8, 11–9, 12–0తో మీగన్‌‌ బెస్ట్ (బార్బడోస్‌‌)పై నెగ్గగా సునయన ఓడిపోయింది.  మరోవైపు మెన్స్‌‌ సింగిల్స్‌‌లో తొలి రౌండ్‌‌లో స్టార్‌‌ ప్లేయర్‌‌ సౌరవ్‌‌ ఘోశాల్‌‌ 11–4, 11–4, 11–6తో షామిల్‌‌ వకీల్‌‌(శ్రీలంక)ను చిత్తు చేశాడు. మరో మ్యాచ్‌‌లో గాయం కారణంగా రమిత్‌‌ టాండన్‌‌ విత్‌‌డ్రా అయ్యాడు.