శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య

శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య

కర్నూలు శ్రీ చైతన్య కాలేజీలో విషాదం జరిగింది. ఇంటర్ ఫస్టియర్ ఎంపీసీ చదువుతున్న దిలీప్ (16) అనే విద్యార్ధి హాస్టల్ గదిలోని బాత్ రూమ్ లో ఉరేసుకుని  ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చనిపోయే ముందు హస్టల్ గదిలో ఉన్న స్నేహితులందరితో కలిసి స్నాక్స్ పార్టీ చేసుకుని, అంత్యక్షరి ఆడి పాడిన దిలీప్.. ఆ తర్వాత వారికి బాత్ రూమ్ వెళ్లొస్తానని చెప్పి,  వెళ్లి ఉరేసుకున్నాడు.  గంట సేపయినా బాత్ రూమ్ నుంచి దిలీప్ రాకపోవడంతో అనుమానం వచ్చిన అతని స్నేహితులు వెళ్లి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించాడు.

దిలీప్ స్వస్థలం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం. ఇదే సంవత్సరంలో అతని తల్లిదండ్రులిద్దరూ ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు విడిచారు. అవి గుర్తొచ్చే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు. తరగతిలో, హాస్టల్ లో ఎప్పుడూ మూడీగా దిలీప్ ను.. తోటి స్నేహితులు  ఇబ్బంది ఉంటే చెప్పమని అడిగినా.. కాళ్లుపట్టుకుని బతిమాలినా చెప్పేవాడు కాదని వారు అన్నారు.

వారం క్రితం హోమ్ సిక్ నెస్ కింద వారం రోజులు సెలవుల్లో ఇంటికి వెళ్లేటప్పుడు తిరిగి రానని చెప్పిన దిలీప్.. సెలవుల అనంతరం అందరికంటే ముందు తిరిగొచ్చి, చివరి రోజు.. చివరి నిమిషం వరకు ఆడిపాడి.. ఆత్మహత్య చేసుకున్నాడని దిలీప్ రూమ్ మేట్స్ అంటున్నారు.

అంతా బాగుందని చెప్పి కాలేజీకి వెళ్లి ఇలా చేసుకున్నాడని దిలీప్ నానమ్మ కంట తడిపెట్టుకుని విలపించింది. తన మనవడు ఆర్డీటీ సేవా సంస్థ సంరక్షణలో చదువుకుంటున్నాడని ఆమె తెలిపింది.

చదువులో చురుకుగా ఉండేవాడు..ఎందుకిలా చేశాడో అర్థం కావడం లేదని ఆర్డీటీ చైర్మన్ తిప్పెస్వామి అన్నారు. ఆర్డీటీ ఆద్వర్యంలో వేల మందిని చదివిస్తున్నామని.. ఇబ్బంది పడే వాళ్లకు కౌన్సెలింగ్ ఇచ్చి వేరే కాలేజీల్లో చేర్పించే వాళ్లమని ఆయన అన్నారు.

పేరెంట్స్ ఫిర్యాదు మేరకు అన్ని కోణాల్లో విచారణ జరుపుతామని కర్నూలు తాలుకా సీఐ ఓబులేసు తెలిపారు.