ముంబైపై ఢిల్లీ కేపిటల్స్ గెలుపు

ముంబైపై ఢిల్లీ కేపిటల్స్ గెలుపు
  • 4 వికెట్ల తేడాతో గెలిచి ప్లే ఆఫ్ కు చేరిన ఢిల్లీ
  • తక్కువ స్కోర్.. అయినా చివరి ఓవర్ వరకు ఉత్కంఠ
  • ముంబయి స్కోర్: 129/8 ఢిల్లీ కేపిటల్స్: 132/6

షార్జా: ముంబయి ఇండియన్స్ పై ఢిల్లీ కేపిటల్స్ విజయం సాధించింది. తక్కువ స్కోర్.. టార్గెట్ అయినా..  చివరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపిన ఈ ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లో ఢిల్లీ జట్టు 4 వికెట్ల తేడాతో గెలుపొంది ప్లేఆఫ్ కు చేరుకుంది. ముంబై నిర్దేశించిన  130 పరుగుల లక్ష్యాన్ని సాధించడంలో ఢిల్లీ తడబడడంతో.. మ్యాచ్ చివరి ఓవర్ వరకు ఉత్కంఠ కొనసాగింది. అయితే మరో ఐదు బంతులు మిగిలుండగానే 19.1 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసి టార్గెట్ పూర్తి చేసింది. 
ఢిల్లీ జట్టులో  శ్రేయాస్ అయ్యర్ 33 పరుగులతో నాటౌట్ గా  నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. కెప్టెన్ రిషబ్ పంత్ 26, అశ్విన్ 20 నాటౌట్, హెట్మెయర్ 15 , అక్షర్ పటేల్ 9, శిఖర్ ధావన్ 8 పరుగులు చేశారు. ఢిల్లీ జట్టులో శ్రేయస్ అయ్యర్-రవిచంద్రన్ ల జోడీని విడదీయడానికి విఫలయత్నం చేసిన ముంబై చివరకు చేతులెత్తేసి మ్యాచ్ ను ఢిల్లీకి సమర్పించుకుంది. తక్కువ టార్గెట్ విధించినా బౌలింగ్ అటాకింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ బౌలర్లలో బౌల్ట్, జయంత్, కృనాల్, బుమ్రా, కౌల్టర్ నైల్ తలో వికెట్ తీశారు.

టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన ముంబయి ఇండియన్స్

టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన ముంబయి ఇండియన్స్ కు ఆదిలోనే ఢిల్లీ షాక్ ఇచ్చింది. కెప్టెన్.. రోహిత్ శర్మను రెండో ఓవర్లోనే అవేశ్ ఖాన్ బౌల్డ్ చేసి పెవిలియన్ పంపాడు. మరో ఎండ్ లో ఓపెనర్ గా బరిలోకి దిగిన క్వింటన్ డికాక్ (19) నిలదొక్కుకోకుండా అక్షర్ పటేల్ పెవిలియన్ బాట పట్టించాడు. మిడిలార్డర్ లో సౌరభ్ తివారి (15), కీరన్ పొలార్డ్ (6), చివర్లో హార్ధిక్ పాండ్య (17), జయంత్ యాదవ్ (11) కూడా తక్కువ స్కోరుకే పెవిలియన్ బాట పట్టడంతో  నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేయగలిగింది. జట్టులో సూర్యకుమార్ యాదవ్ (33) ఒక్కటే టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఢిల్లీ బౌలర్లలో అవేశ్ ఖాన్, అక్షర్ పటేల్ చెరి మూడు వికెట్లు తీయగా.. అన్రిల్ నోర్జే, రవిచంద్రన్ అశ్విన్ చెరో వికెట్ పడగొట్టారు.