బృందావనంలో.. ఐటీ కపుల్‌‌‌‌‌‌‌‌!

బృందావనంలో..  ఐటీ కపుల్‌‌‌‌‌‌‌‌!

అది 2016. అమెరికాలోని సిలికాన్‌‌‌‌ వ్యాలీలో వివేక్‌‌‌‌ షా కెరీర్‌‌‌‌‌‌‌‌ పీక్‌‌‌‌లో ఉంది. అంతా బాగానే ఉంది. కానీ, ఏదో మిస్‌‌‌‌ అవుతున్న ఫీలింగ్‌‌‌‌. సరిగ్గా అప్పుడే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. ఈ నాలుగు గోడల మధ్య ఆనందం లేదు. వెంటనే లగ్జరీ లైఫ్‌‌‌‌ ఇస్తున్న ఐటీ జాబ్‌‌‌‌ని వదిలేయాలని డిసైడ్ అయ్యాడు. ప్రింట్‌‌‌‌మేకింగ్‌‌‌‌లో మాస్టర్స్‌‌‌‌ చేసిన తన భార్య బృందాని తీసుకొని మన దేశానికి వచ్చేశాడు. ఇద్దరూ కలిసి వ్యవసాయం స్టార్ట్‌‌‌‌ చేసి.. పెద్ద ఫుడ్‌‌‌‌ ఫారెస్ట్‌‌‌‌నే క్రియేట్ చేశారు!

సిలికాన్‌‌‌‌ వ్యాలీలోఉద్యోగం చేస్తున్నాం. మంచి జీతం. లగ్జరీ లైఫ్‌‌‌‌. కానీ, కొన్నాళ్ల తర్వాత మాలో మార్పు రావడం స్టార్ట్ అయింది. షిఫ్ట్‌‌‌‌లు, షెడ్యూళ్లు, మా ఆరోగ్యాన్ని తినేస్తున్నాయని అర్థమైంది’ అన్నాడు వివేక్. మరోవైపు కొనుక్కొని తింటున్న ఫుడ్‌‌‌‌ కూడా హెల్త్‌‌‌‌ పాడవడానికి మరో కారణమని తెలుసుకున్నారు. సిలికాన్‌‌‌‌ వ్యాలీలో ఉన్నప్పుడే ఇద్దరు కలిసి వంట చేసుకుని తినడం స్టార్ట్ చేశారు. ‘ వండుకొని తింటున్నా.. మేం ఎలాంటి ఫుడ్‌‌‌‌ తింటున్నాం? అది ఎక్కడి నుంచి వస్తుంది? మంచిదేనా? కాదా? అనే డౌట్లు ఉండేవి’ అని చెప్పింది బృందా.

నిర్ణయం వెనక

అమెరికాలో వాళ్లు ఉన్న  ప్లేస్‌‌‌‌కి కొంచెం దూరంలో ఎక్కడ చూసినా.. విరగగాసిన స్ట్రాబెర్రీ పండ్ల చెట్లే ఉండేవి. వాటిని చూసినప్పుడల్లా వివేక్‌‌‌‌కి తన చిన్ననాటి జ్ఞాపకాలు కళ్లలో మెదిలేవి. చిన్నప్పుడు మామిడి పండ్లకోసం చెప్పులు లేకుండా చెట్లెక్కడం. కిందపడి మోకాళ్లు కొట్టుకుపోయి రక్తం కారడం. అయినా ఆ పండు తింటుంటే సంతోషం కలిగేది. ఆ జ్ఞాపకాలే వాళ్లను సొంతగూటికి చేర్చడానికి కారణమయ్యాయి. చిన్నప్పటిలాగే.. ఇప్పుడూ తన జీవితంలో ఆనందం నింపుకోవాలనుకున్నాడు. తన ఫుడ్‌‌‌‌ని తానే పండించుకోవాలనే ఆలోచన వచ్చింది. ఒక వైపు ఉద్యోగం సాగుతుంటే..  మరోవైపు ఆ ఆలోచన అలాగే మెదడులో తిరుగుతోంది.

టర్నింగ్‌‌‌‌ పాయింట్‌‌‌‌…

‘‘మాది అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌ బ్యాక్‌‌‌‌గ్రౌండ్‌‌‌‌ కాదు. అందుకే  కాలిఫోర్నియా శివారులో ఉన్న ఒక ఫీల్డ్‌‌‌‌లో  ఇద్దరం కలిసి అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌ కోర్సులో చేరాం. ఫీల్డ్‌‌‌‌లో కోర్స్‌‌‌‌ నేర్చుకోవడానికి మొదటిరోజు స్ట్రాబెర్రీ ఫీల్డ్‌‌‌‌లో నడిచాం.  మేం ఆ వ్యూని చాలా ఎంజాయ్ చేశాం. కానీ, కొంచెం ముందుకు వెళ్లగానే షాక్‌‌‌‌ తిన్నాం. ఒక వ్యక్తి నిండుగా వైట్‌‌‌‌ సూట్‌‌‌‌లాంటిది వేసుకొని పంటలపై లిక్విడ్  స్ప్రే కొడుతున్నాడు.  మా వెన్ను వణికింది.  కొంచెం ముందుకు వెళ్లాక కూడా చాలామంది  స్ప్రే చేస్తున్న  కెమికల్స్ సైడ్‌‌‌‌ ఎఫెక్ట్స్‌‌‌‌ని తట్టుకోవడానికి ప్రొటెక్టివ్‌‌‌‌ లేయర్స్‌‌‌‌ ధరించారు. ఆ పంటల్ని ఎలా పండిస్తున్నారో? ఎలాంటి ఫుడ్‌‌‌‌ తింటున్నామో ఊహించుకోండి. ఈ కెమికల్స్‌‌‌‌ కేవలం తినేవాళ్ల మీదే కాదు, పండించేవాళ్ల మీద కూడా ప్రభావం చూపిస్తాయి.  అంతేకాదు ఎన్విరాన్‌‌‌‌మెంట్‌‌‌‌ని కూడా కలుషితం చేస్తాయి. మేం ఇలాంటి పంటలు పండించొద్దని ఫిక్స్‌‌‌‌ అయ్యాం. అదే మా నిర్ణయానికి టర్నింగ్‌‌‌‌పాయింట్‌‌‌‌ అయింది’ అని చెప్పాడు వివేక్.

సొంతూరికి వచ్చారు

పురుగుల మందు వాడుతూ పంటలు పండిస్తున్న తీరు వాళ్లకు నచ్చలేదు. ఆ నచ్చకపోవడమే మనదేశానికి వచ్చి ఫామ్‌‌‌‌ ఏర్పాటు చేసుకునేలా ప్రేరేపించింది. 2016లో ఆ జాబ్‌‌‌‌ని వదిలేసి… గుజరాత్‌‌‌‌లో ఉన్న వాళ్ల సొంతూరికి వచ్చేశారు. వాళ్ల నిర్ణయానికి ఎవరూ అడ్డు చెప్పలేదు. వాళ్ల ఫ్యామిలీస్‌‌‌‌ సపోర్ట్‌‌‌‌గా నిలిచాయి. అహ్మదాబాద్‌‌‌‌కి గంటన్నర దూరంలో పదెకరాల ల్యాండ్‌‌‌‌ కొని ఒక ఫామ్‌‌‌‌ ఏర్పాటు చేసుకున్నారు. అది మొదట్లో  వాళ్ల కిచెన్‌‌‌‌ అవసరాలను తీర్చింది. తర్వాత మార్కెట్‌‌‌‌ వైపు నడవకుండా చేసింది. ఇప్పుడు లాభాల పంట పండిస్తోంది.

కంప్లీట్‌‌‌‌ ఆర్గానిక్‌‌‌‌

“ అమెరికాలో అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌ కోర్స్‌‌‌‌ మాకు హెల్ప్ చేసింది. వ్యవసాయంలో ఎన్నో టెక్నిక్స్‌‌‌‌ని అక్కడే నేర్చుకున్నాం. అవే ఇక్కడా పాటిస్తున్నాం. అయితే, మేం పూర్తిగా నేచురల్‌‌‌‌ఫాంని డెవలప్ చేశాం. ముందుగా.. మేం తినేవి,
మాకిష్టమైన వాటిని పండించాలని నిర్ణయించుకున్నాం. ఒక గుజరాతీగా ముందుగా మామిడిని పండించాలని డిసైడ్‌‌‌‌ అయ్యాం. తర్వాత నెమ్మదిగా మిగతా పంటలపై దృష్టి పెట్టాం’ అని చెప్పాడు వివేక్. ఇప్పుడు వాళ్ల ఫాంలో సజ్జల నుంచి మొదలు పెడితే.. గోధుమ, ఆలుగడ్డ, రకరకాల కూరగాయలు, మునగకాయ, అరటిపండ్లు, బొప్పాయి,
జామ, నేరేడు పండ్లను పండిస్తున్నారు.  కమర్షియల్‌‌‌‌గా టేకు చెట్లను కూడా పెంచుతున్నారు ఈ కపుల్‌‌‌‌.

ఫాంలోనే ఇంకుడు గుంతలు

వీళ్లు నేలను ఆరోగ్యంగా ఉంచడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వర్షపు నీటిని నిల్వ చేయడానికి ఇంకుడు గుంతలు తవ్వారు. ప్రస్తుతం 20వేల లీటర్ల వాన నీళ్లను స్టోరేజ్​ ట్యాంకుల్లో నిల్వ చేస్తున్నారు. ఇది వాళ్ల ఫామ్‌‌‌‌లో ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకోవడానికి ఉపయోగపడింది. ఇవి ఒక్కసారి నిండితే.. మూడేళ్లకు సరిపడా తాగునీరు లభించినట్టే!  అయితే, వాళ్లకు ఉన్న పది ఎకరాల్లో పదిశాతం నేల అంటే ఒక ఎకరం మొత్తం వర్షం నీళ్లని నిల్వ చేయడానికే కేటాయించారు. వానాకాలంలో పది ఎకరాల నుంచి వచ్చే వరద మొత్తం అక్కడికే చేరుతుంది. సరిహద్దుల నుంచి వచ్చే విషపూరితమైన వరద…  వాళ్ల పొలంలోకి రాకుండా కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇంకుడు గుంతల చుట్టూ నీటిని శుభ్రం చేసే మొక్కలను నాటారు. ఇక ఇప్పుడు చిన్న చెరువుని నిర్మించే పనిలో ఉన్నారు. ఇది కంప్లీట్‌‌‌‌ అయితే, ఐదు నుంచి పది లక్షల లీటర్ల వరకు నీరు నిల్వ అవుతుంది. ‘త్వరలోనే ఈ చెరువులో చేపల్ని, బాతుల్ని కూడా పెంచుతాం. ఇది సెకండరీ బిజినెస్‌‌‌‌గా ఉంటుంది’ అని చెప్పాడు వివేక్‌‌‌‌.

ఫుడ్‌‌‌‌ఫారెస్ట్

ఈ ఫామ్‌‌‌‌ ఒక అడవిలాగ ఉంటుంది. ఒకవైపు రకరకాల పండ్ల చెట్లు, వేప చెట్లు, కూరగాయల తోటలు ఉంటే.. మరోవైపు ఏడు రకాల తేనెటీగలున్న తేనె తుట్టెలు, పక్షులు, కీటకాలు ఈ ఫామ్‌‌‌‌లో ఉన్నాయి.‘ ఫుడ్‌‌‌‌ పండిస్తూనే.. సేమ్‌‌‌‌టైం అడవులను సృష్టించాల్సిన అవసరం ఉంది.  గ్లోబల్‌‌‌‌వార్మింగ్‌‌‌‌, క్లైమెట్ చేంజ్‌‌‌‌ ఎవరికోసం ఆగవు. ఇంకా ఏం ఆలోచించకుండా వెంటనే నేచురల్‌‌‌‌ ఫామింగ్‌‌‌‌ మొదలుపెట్టండి. ఎన్విరాన్‌‌‌‌మెంట్‌‌‌‌ని కాపాడండి’ అంటున్నాడు వివేక్‌‌‌‌.

ఇదొక బృందావనం

అవును ఈ ఫాం ఒక బృందావనం. ఫాంలోనే ఉండేందుకు వీలుగా ఒక మట్టి ఇల్లుని కట్టుకున్నారు. ఈ ఇంటికి కేవలం మట్టి, రాళ్లు, ఆవు  పేడను మాత్రమే  వినియోగించారు. వీళ్లు వ్యవసాయంలో వాళ్లకు అందుబాటులో ఉన్న ఏ అవకాశాన్నీ వదలడం లేదు. చాలా కమర్షియల్‌‌‌‌ ప్రయోగాలు చేస్తున్నారు. కూరగాయలు పండిస్తున్నారు. ఎక్కువ లాభాలు పొందేలా.. ఆర్గానిక్‌‌‌‌ ఆలు, అరటి చిప్స్‌‌‌‌ తయారు చేసి అమ్ముతున్నారు. నర్సరీలో మొక్కలు పెంచి అమ్ముతున్నారు. పక్షులు ఇష్టపడే మొక్కలు, సీతాకోక చిలుకలు వాలే మొక్కలు, తేనెటీగలకు ఇష్టమైన మొక్కల్ని పెంచుతూ తేనె తీసి అమ్ముతున్నారు. అది కూడా ఎలాంటి కెమికల్స్‌‌‌‌ వాడకుండా..  పూర్తి ఆర్గానిక్‌‌‌‌ పద్ధతిలో! ఇక, పంటలను పీడించే చీడపురుగుల్ని నివారించడానికి ఎలాంటి పురుగుల మందు వాడకుండా..  ఫామ్‌‌‌‌ సరిహద్దుల్లో పరిమళాలు వెదజల్లె తులసి, నిమ్మగడ్డి వంటి వాటిని పెంచుతున్నారు. ఇవి చీడపురుగులు రాకుండా అడ్డుకుంటాయి. రకరకాల పంటలు ఒకే చోట వేయడం వల్ల అన్ని పంటలకు చీడ పట్టదు. కాబట్టి వాటి వల్ల కలిగే నష్టాలు తక్కువ. ఫాంలో నుంచి వచ్చే ఒక్క ఆకుని కూడా వదలకుండా కంపోస్ట్ ఎరువుగా మారుస్తున్నారు ఈ కపుల్‌‌‌‌.