హైదరాబాద్, వెలుగు:
ఈ నెల 11వ తేదీలోపు చర్చలు జరిపి సమస్యను పరిష్కరించే దిశగా రెండు వర్గాలు ప్రయత్నించాలని హైకోర్టు ఆదేశించిందని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. గురువారం హైకోర్టు విచారణ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. మూడున్నర గంటల విచారణ తర్వాత ప్రభుత్వ అధికారులు ఇచ్చిన రిపోర్టులను హైకోర్టు తీవ్రంగా పరిగణించిందని చెప్పారు. అధికారులు తప్పుల తడకగా రిపోర్టులు రాసి తమ టేబుల్ మీద పెడతారని అనుకోలేదని, ఇది హైకోర్టును మోసం చేయడమేనని పేర్కొందని తెలిపారు. రిపోర్టులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఐఏఎస్‌లు క్షమాపణలు చెప్పాల్సి వచ్చిందన్నారు. సీఎం కేసీఆర్ 9 గంటలపాటు అధికారులతో సమీక్ష చేసే బదులు 90 నిమిషాలు తమతో చర్చిస్తే సమస్య పరిష్కారం అయ్యేదని చెప్పారు. ఆర్టీసీ కార్మికులను సీఎం కేసీఆర్ చర్చలకు పిలిస్తే సమస్య వెంటనే పరిష్కారం అవుతుందన్నారు.
హైదరాబాద్, వెలుగు:
ఆర్టీసీ జేఏసీ శనివారం చలో ట్యాంక్ బండ్ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. అనంతరం అక్కడే కార్మికులు సామూహిక దీక్షలు చేపట్టనున్నారు. శుక్రవారం ఎలాంటి నిరసన కార్యక్రమాలు నిర్వహించకుండా రేపు జరిగే చలో ట్యాంక్ బండ్‌పై ఫోకస్ చేయాలని కార్మికులకు ఆర్టీసీ జేఏసీ సూచించింది. పార్టీల మద్దతు, జనసమీకరణపై నేటి సన్నాహాక సమావేశంలో చర్చించనున్నారు. ఇప్పటికే అన్ని పార్టీలు చలో ట్యాంక్ బండ్‌కు మద్దతు ప్రకటించాయి. ఆయా పార్టీలు భారీగా జనసమీకరణ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. జిల్లాలు, డిపోల వారీగా ఇప్పటికే జేఏసీ నాయకులు సంప్రదింపులు జరిపారు. కార్మికుల కుటుంబాలతోపాటు ప్రజలు కూడా వస్తారని, మరో మిలియన్ మార్చ్‌ను తలపించేలా నిరసన కార్యక్రమం ఉండబోతోందని ఆర్టీసీ జేఏసీ నేతలు చెబుతున్నారు.
పోలీసులు పర్మిషన్‌కు చాడ దరఖాస్తు
చలో ట్యాంక్ బండ్ కార్యక్రమానికి పోలీసుల అనుమతి కష్టమేనని తెలుస్తోంది. భారీ సంఖ్యలో జనం వస్తే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందనే కారణంతో పోలీసులు పర్మిషన్ తిరస్కరించే అవకాశముంది. అనుమతి కోసం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి శుక్రవారం దరఖాస్తు చేయనున్నారు.
ఆర్టీసీ ‘చలో ట్యాంక్ బండ్’కు తరలిరండి. ఎమ్మెల్సీ రాంచందర్ రావు
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికులు శనివారం నిర్వహించనున్న ‘చలో ట్యాంక్ బండ్’ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలి రావాలని బీజేపీ హైదరాబాద్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రాంచందర్ రావు పిలుపునిచ్చారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఆ పార్టీ ఎంప్లాయీస్, టీచర్స్ సెల్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రెండున్నర లక్షల మంది రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారని, వీరందరిని పార్టీలో చేర్పించేందుకు బీజేపీ రిటైర్డ్ టీచర్స్, ఎంప్లాయీస్ సెల్ జిల్లా కమిటీలు పని చేయాలని సూచించారు. రిటైర్డ్ ఉద్యోగులు, టీచర్ల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ అండగా ఉంటుందని చెప్పారు. బీజేపీ ఎంప్లాయీస్, టీచర్స్ సెల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి33 జిల్లాల పార్టీ సెల్ కన్వీనర్ లు, కో కన్వీనర్ లు హాజరయ్యారు. ఆర్టీసీ సమ్మెకు సంపూర్ణ మద్ధతునిచ్చి, వారికి అండగా ఉండాలని సమావేశం తీర్మానం చేసింది. హత్యకు గురైన తహసీల్దార్ విజయా రెడ్డి, సమ్మె నేపథ్యంలో మరణించిన ఆర్టీసీ ఉద్యోగులకు సంతాపం ప్రకటించింది. ఆర్టీసీ కార్మికుల ‘చలో ట్యాంక్ బండ్’ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నిర్ణయించింది.
చలో ట్యాంక్‌బండ్‌లో పాల్గొనండి : ఉత్తమ్
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం శనివారం ఆర్టీసీ జేఏసీ నిర్వహించే ‘చలో ట్యాంక్‌బండ్’ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొనాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గురువారం పిలుపునిచ్చారు. నెల రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నా, వాళ్ల సమస్యలు పరిష్కరించాలని కోర్టు ఆదేశిస్తున్నా కేసీఆర్ మాత్రం నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చలో ట్యాంక్‌బండ్ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అన్ని జిల్లా కేంద్రాల్లో ఏఐసీసీ పిలుపులో భాగంగా శనివారం నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు ఉత్తమ్ పిలుపునిచ్చారు


