- జనరల్ ట్రాన్స్‌ఫర్లపై నిషేధం ఎత్తివేస్తూ రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు
- ఒకేచోట కనీసం మూడేండ్ల సర్వీస్ పూర్తిచేసి ఉంటేనే బదిలీకి అర్హత
- నాలుగేండ్లు అదే చోట ఉంటే తప్పనిసరి ట్రాన్స్‌ఫర్
- జనగణన విధుల్లో ఉన్న సిబ్బందికి పూర్తిగా మినహాయింపు
- ఏ కేడర్‌లో అయినా మొత్తం సిబ్బందిలో బదిలీలు 40 శాతానికి మించొద్దు
- స్పౌజ్ కేసులు, క్యాన్సర్ బాధితులకు టాప్ ప్రయారిటీ
- మే 1 నుంచి 31 వరకు బదిలీల షెడ్యూల్
- జూన్ 1 నుంచి మళ్లీ బదిలీలపై నిషేధం
- గెజిటెడ్ ఆఫీసర్లకు ‘సొంత జిల్లా’లో నో ఎంట్రీ
- ‘స్టేషన్’ అంటే ఊరే.. రిక్వెస్ట్ బదిలీలకు టీటీఏ కట్
- 3 స్థాయిల్లో బదిలీల కమిటీలు.. 5 ఆప్షన్లకు చాన్స్.. పక్కాగా వెబ్ కౌన్సెలింగ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల ప్రక్రియకు రాష్ట్ర సర్కారు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. మే ఒకటో తేదీ నుంచి 31 వరకు ఈ బదిలీల ప్రక్రియ కొనసాగనున్నది. గతంలో ఉన్న బదిలీల నిషేధాన్ని తాత్కాలికంగా సడలిస్తూ, ఉద్యోగుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ఈ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని, ఎక్కడా అవినీతికి తావులేకుండా ఆన్‌లైన్ లేదా కౌన్సెలింగ్ పద్ధతిని అనుసరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
షెడ్యూల్ ప్రకారం మే మొదటి వారంలో ఖాళీల వివరాలను ప్రకటించి, నెలాఖరులోపు బదిలీ ఉత్తర్వులను అందించాలని హెచ్‌వోడీలను ఆదేశించింది. కాగా, జన గణన సంబంధిత విధుల్లో ఉన్న ఉద్యోగులకు ఈ బదిలీ మార్గదర్శకాలు వర్తించవని స్పష్టం చేసింది. ప్రస్తుతం సెన్సస్ విధుల్లో నిమగ్నమైన సిబ్బందిని ఈ బదిలీల ప్రక్రియ నుంచి పూర్తిగా మినహాయించారు. అంటే, వారు ప్రస్తుతం ఎక్కడైతే విధులు నిర్వహిస్తున్నారో, ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు అక్కడే కొనసాగాల్సి ఉంటుంది. ఒకవేళ వారు బదిలీ కోరుకున్నా లేదా తప్పనిసరి బదిలీ పరిధిలోకి వచ్చినా, ఈ విడతలో వారిని కదిలించరు. బదిలీల్లో ‘ఫోకల్’ (కీలక) పోస్టుల నుంచి ‘నాన్-ఫోకల్’ పోస్టులకు, అలాగే నాన్-ఫోకల్ నుంచి ఫోకల్ పోస్టులకు మార్పులు ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఒకేచోట మూడేండ్ల సర్వీస్ పూర్తిచేసి ఉంటేనే..
బదిలీలకు సంబంధించి ప్రభుత్వం కచ్చితమైన మార్గదర్శకాలు ఖరారు చేసింది. 2026 జనవరి 1వ తేదీ నాటికి ఒకే చోట మూడేండ్ల సర్వీసు పూర్తి చేసిన వారు మాత్రమే బదిలీలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని పేర్కొన్నది.
అలాగే, 2025 డిసెంబర్ 31 నాటికి ఒకే స్టేషన్ లో నాలుగేండ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారిని తప్పనిసరిగా బదిలీ చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.అదే సమయంలో ప్రభుత్వ పాలనావ్యవహారాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కీలక నిబంధన విధించారు. ఏ కేడర్‌లోనైనా మొత్తం సిబ్బంది సంఖ్యలో 40 శాతానికి మించి బదిలీలు చేయకూడదని స్పష్టం చేశారు. స్టేషన్ అంటే కేవలం ఒక కార్యాలయం మాత్రమే కాదు.. ఆ గ్రామం, పట్టణం లేదా నగరాన్ని ఒకే యూనిట్‌గా పరిగణించాల్సి ఉంటుంది.
ఒకే ఊరిలో ఆఫీసు మారినా అది స్టేషన్ కిందకే వస్తుందని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. దీనివల్ల నగరాల్లోనే తిష్ట వేసే వారికి అడ్డుకట్ట పడనున్నది. గెజిటెడ్ అధికారులను వారి సొంత జిల్లాలకు బదిలీ చేయకూడదనే పాత నిబంధనను కూడా ప్రభుత్వం గుర్తు చేసింది. సొంత అభ్యర్థనపై బదిలీ అయ్యే వారికి టీటీఏలాంటి ప్రయాణ భత్యాలు వర్తించవని, రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడే ఈ బదిలీలు ఉంటాయని, ఎక్కడా నిబంధనల ఉల్లంఘన జరగకూడదని, ఒకవేళ అలాంటివి దృష్టికివస్తే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది.
క్లిష్టమైన చోట్ల పనిచేస్తున్న వారికి బదిలీల్లో వెయిటేజీ
తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఊరట కల్పించారు. క్యాన్సర్, న్యూరో సర్జరీ, కిడ్నీ మార్పిడి, కాలేయ మార్పిడి, ఓపెన్ హార్ట్ సర్జరీ, బోన్ టీబీలాంటి వ్యాధులతో బాధపడుతున్న వారు లేదా వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఈ సమస్యలు ఉన్నా బదిలీల్లో ప్రాధాన్యత కల్పిస్తారు. ఇందుకు సంబంధించి మెడికల్ బోర్డు ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. క్లిష్టమైన ప్రాంతాల్లో సుదీర్ఘకాలం పనిచేసిన ఉద్యోగులకు ఈసారి గుర్తింపు లభించనున్నది. ప్రతి శాఖ తమ పరిధిలోని అలాంటి ప్రాంతాలను గుర్తించి, అక్కడ పనిచేసిన వారికి వారు కోరుకున్న చోటుకు బదిలీ అయ్యేలా వెయిటేజీ కల్పించనున్నారు. ఒకవేళ అలాంటి ప్రాంతాలకు ఎవరూ స్వచ్ఛందంగా వెళ్లకపోతే, లాటరీ పద్ధతి ద్వారా సిబ్బందిని అక్కడికి పంపాలని నిర్ణయించారు. దీనివల్ల అన్ని ప్రాంతాల్లోనూ పరిపాలన సమర్థవంతంగా సాగుతుందని ప్రభుత్వం ఆశిస్తున్నది.
శాఖల వారీగా ప్రత్యేక మార్గదర్శకాలు.. 3 రోజుల్లోగా రిలీవ్
బదిలీల ప్రక్రియలో అవినీతికి తావులేకుండా ఉండేందుకు ప్రభుత్వం 3 స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేసింది. రాష్ట్ర స్థాయి కేడర్ కోసం సంబంధిత శాఖ కార్యదర్శి, హెచ్‌వోడీ, అదనపు కార్యదర్శితో కూడిన కమిటీ బదిలీలను పర్యవేక్షిస్తుంది. జోనల్, మల్టీ జోనల్ పోస్టుల కోసం హెచ్‌వోడీ నేతృత్వంలో కమిటీ పనిచేస్తుంది. ఇక జిల్లాస్థాయి కేడర్ ఉద్యోగుల బదిలీలను ఆయా జిల్లాల కలెక్టర్లు, జిల్లా రెవెన్యూ అధికారులు జిల్లా హెచ్‌వోడీలతో కూడిన కమిటీలు తుది నిర్ణయం తీసుకుంటాయి.
బదిలీల కోసం ఉద్యోగుల నుంచి గరిష్టంగా 5 ఆప్షన్లను స్వీకరిస్తారు. వీలైనంత వరకు వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ లేదా ఆన్‌లైన్ పద్ధతిలోనే బదిలీలు చేపట్టాలని, ప్రతి విషయాన్ని పారదర్శకంగా నోటీసు బోర్డుల్లో ఉంచాలని ప్రభు త్వం ఆదేశించింది. ఒకవేళ ఎవరైనా తప్పుడు సమాచారంతో లేదా వైద్య కారణాలతో బదిలీ పొందితే, వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు హెచ్‌వోడీలు అలాంటి కేసులను క్షుణ్నంగా తనిఖీ చేయాలని నిబంధనలు విధించింది.
ప్రధాన శాఖలతో పాటు కొన్ని కీలక విభాగాలకు ప్రభుత్వం ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. విద్యాశాఖలో టీచర్లు, లెక్చరర్ల బదిలీల కోసం ఆ శాఖ ప్రత్యేకంగా గైడ్‌లైన్స్ రూపొందించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, స్టాంపులు రిజిస్ట్రేషన్లు, రవాణా, అటవీ శాఖలాంటి ఆదాయాన్ని సమకూర్చే శాఖలు గతంలో ఉన్న ప్రత్యేక జీవోల ఆధారంగా బదిలీలు చేపట్టాలి. పోలీస్ శాఖ తన సిబ్బంది కోసం వేర్వేరుగా మార్గదర్శకాలు విడుదల చేయనున్నది. బదిలీ ఉత్తర్వులు అందిన 3 రోజుల్లోపు ఉద్యోగి ప్రస్తుత స్థానం నుంచి రిలీవ్ అయినట్టు పరిగణిస్తారు. విధుల్లో చేరడంలో జాప్యం చేస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. బదిలీల ప్రక్రియ పర్యవేక్షణ బాధ్యతలను ఆయా శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు చూస్తారని ప్రభుత్వం స్పష్టం చేసింది.
పదవీ విరమణకు దగ్గరైనవారికి, దివ్యాంగులకు ఊరట
ఉద్యోగుల వ్యక్తిగత ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రాధాన్యతా క్రమాన్ని ప్రభుత్వం ప్రకటించింది. భార్యాభర్తలు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైతే , వారిని ఒకే చోటకి చేర్చేందుకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు. కాగా, భార్యాభర్తల్లో ఒకరికి మాత్రమే ఈ బదిలీ వర్తిస్తుంది. 2027 మే 31లోపు పదవీ విరమణ చేయనున్న ఉద్యోగులకు ఊరట కల్పించారు. వారికి బదిలీ నుంచి మినహాయింపు ఇచ్చారు. ఒకవేళ వారు స్వచ్ఛందంగా బదిలీ కోరుకుంటే తప్ప, వారిని ప్రస్తుతమున్న చోటు నుంచి కదిలించరు. వైకల్యం ఉన్న ఉద్యోగులకు కూడా ప్రాధాన్యత కల్పించారు. 70 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారికి, మానసిక వైకల్యంతో బాధపడుతున్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు వైద్య సదుపాయాలు మెరుగ్గా ఉన్న ప్రాంతాలకు బదిలీ చేసేలా నిబంధనలు రూపొందించారు. వితంతువుల దరఖాస్తులను కూడా పరిశీలించనున్నారు.
షెడ్యూల్ ఇదే మే 1 నుంచి 7: విధివిధానాల ఖరారు
మే 8-15: దరఖాస్తుల స్వీకరణ
మే 16 నుంచి 24: దరఖాస్తుల పరిశీలన, కౌన్సెలింగ్, మాస్టర్ లిస్ట్ రెడీ
మే 25 నుంచి 31: బదిలీ ఉత్తర్వులు జారీ
జూన్ 1: రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ బదిలీలపై నిషేధం
సర్వీసును రెండేండ్లకు కుదించాలి ప్రభుత్వానికి ఉద్యోగ జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: ఉద్యోగుల బదిలీల ప్రక్రియపై తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు చేసింది. బదిలీలకు కనీస సర్వీసు నిబంధనను మూడేండ్ల నుంచి రెండేండ్లకు కుదించాలని జేఏసీ చైర్మన్ వి. లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ వొడ్నాల రాజశేఖర్ కోరారు. ఈ మేరకు వారు మంగళవారం ఓ ప్రకటన రిలీజ్ చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో నం. 38 ప్రకారం.. ఒకే చోట మూడేండ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు మాత్రమే బదిలీలకు అవకాశం కల్పించారు. అయితే, దీనిని రెండేండ్లకు కుదించడం వల్ల మరింత మంది ఉద్యోగులకు, ముఖ్యంగా సుదూర ప్రాంతాల్లో పనిచేస్తున్న వారికి మేలు జరుగుతుందని జేఏసీ నేతలు అభిప్రాయపడ్డారు. దీనివల్ల బదిలీల ప్రక్రియ మరింత విస్తృతంగా మారుతుందన్నారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల్లో కొన్నింటిని మార్చాలని కోరారు.

