న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో విచ్చలవిడిగా పెరిగిపోతున్న ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) డీప్ ఫేక్ కంటెంట్‌పై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఏఐ డీప్ ఫేక్ కంటెంట్ కట్టడికి కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ కొత్త ప్రతిపాదనలు చేసింది. ఏఐ ద్వారా సృష్టించబడిన ఆడియో, వీడియో, టెక్స్ట్‌తో సహా డీప్‌ఫేక్‌ల వ్యాప్తిని అరికట్టడానికి కఠినమైన నిబంధనలను ప్రవేశపెట్టింది.
ఈ కొత్త రూల్స్ ప్రకారం.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఏఐ ఆధారంగా రూపొందించిన కంటెంట్‌కు ఏఐ లేబులింగ్ తప్పనిసరి చేసింది. తద్వారా సోషల్ మీడియా యూజర్స్ ఏది నిజమైన కంటెంట్, ఏది ఏఐ ద్వారా రూపొందించిన కంటెంట్ అనే దానిని ఈజీగా ఐడెంటిఫై చేయగలరని కేంద్రం పేర్కొంది. అలాగే, కోర్టు ఉత్తర్వు లేదా ప్రభుత్వ ఆదేశం మేరకు చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను తొలగించడానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు ఇచ్చిన గడువును కేంద్రం భారీగా తగ్గించింది.
చట్టవిరుద్ధమైన లేదా హానికరమైన ఏఐ కంటెంట్‌ను తమ వేదికల నుంచి తొలగించడానికి ఆయా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు ప్రస్తుతం 36 గంటల గడువు ఉంది. ఇప్పుడు ఈ సమయాన్ని ప్రభుత్వం 3 గంటలకు తగ్గించింది. అంటే.. ఇకపై కోర్టు ఉత్తర్వు లేదా కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తే ఏఐ కంటెంట్‌ను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ మూడు గంటల్లో తొలగించాల్సిందే. అలాగే సున్నిత అంశాలకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కార సమయాన్ని 24 గంటల నుంచి 2 గంటలకు తగ్గించింది. ఇతర ఫిర్యాదుల పరిష్కార సమయాన్ని 72 గంటల నుంచి 36 గంటలకు తగ్గించింది.
డిజిటల్ మాధ్యమాల్లో యూజర్ల రక్షణ, పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ కీలక చర్యలు చేపట్టింది. డీప్‌ఫేక్‌లు, ఇతర రకాల చట్టవిరుద్ధమైన ఏఐ-సృష్టించిన కంటెంట్‌ను గుర్తించి ఫ్లాగ్ చేయడానికి, వాటి వ్యాప్తిని నిరోధించడానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు స్వయంచాలక సాంకేతిక చర్యలను తప్పనిసరిగా అవలంబించాలి. కొత్త ఐటీ నిబంధనలను పాటించడంలో విఫలమయ్యే ప్లాట్‌ఫారమ్‌లు సమాచార సాంకేతిక చట్టం కింద లభించే సేఫ్ హార్బర్ రక్షణను కోల్పోవచ్చని ప్రభుత్వం హెచ్చరించింది.
