V6 News

క్రికెట్‌లో బిష్ణోయ్ గ్యాంగ్ హల్‌చల్.. పాయింట్ బ్లాంక్‌లో గన్‌ పెట్టి కెప్టెన్ చేయాలని ఒత్తిడి

క్రికెట్‌లో బిష్ణోయ్ గ్యాంగ్ హల్‌చల్.. పాయింట్ బ్లాంక్‌లో గన్‌ పెట్టి కెప్టెన్ చేయాలని ఒత్తిడి

T20 World Cup 2026: క్రికెట్ ప్రపంచంలో పెను కలకలం రేగింది. క్రికెట్‌లోకి మాఫియా అడుగు పెట్టిందన్న వార్తలు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. టీ20 వరల్డ్ కప్ 2026 వేదికగా కొనసాగుతున్న ఈ కుంభకోణంలో కెనడా జాతీయ జట్టు కెప్టెన్ దిల్‌ప్రీత్ బజ్వా పేరు వినిపిస్తోంది. అయితే ఇక్కడ అసలు విషయం ఏమిటంటే.. ఈ ఫిక్సింగ్ వెనుక భారత మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టార్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా పాత్ర ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా వార్తలని ప్రచురిస్తుంది. ఐసీసీ యాంటీ కరప్షన్ యూనిట్ ఇప్పటికే విచారణను వేగవంతం చేసింది.

కెనడియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ తెలిపిన కథనం ప్రకారం.. జూలై 2025లో బ్రిటిష్ కొలంబియాలోని ఒక రెస్టారెంట్‌లో జరిగిన సంఘటన ఈ స్కామ్ కి పునాది పడింది. అక్కడ భోజనం చేస్తున్న కెనడా నేషనల్ టీమ్ స్టార్ ప్లేయర్ దగ్గరకు ఇద్దరు వ్యక్తులు వచ్చి, తాము లారెన్ బిష్ణోయ్ గ్యాంగ్ మనుషులమని పరిచయం చేసుకున్నారట. దిల్‌ప్రీత్ బజ్వాను జట్టులోకి తీసుకోవడంతో పాటు కెప్టెన్‌గా నియమించడానికి సపోర్ట్ ఇవ్వాలని, లేదంటే మీ కుటుంబ సభ్యులను చంపేస్తామని వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. పాయింట్‌ బ్లాకులో గన్ పెట్టి మరీ బెదిరించి టీమ్ కెప్టెన్‌ను మార్చడం క్రికెట్ చరిత్రలో ఇదే మొదటిసారి అయినట్లు సమాచారం. 

న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కెనడా కెప్టెన్ దిల్‌ప్రీత్ బజ్వా బౌలింగ్ చేసిన ఒక ఓవర్ అనుమానాలకు తావిచ్చింది. ఆ ఓవర్‌లో అతను భారీగా పరుగులు ఇచ్చుకోవడం, బౌలింగ్ శైలి అనుమానాస్పదంగా ఉండటంతో ఐసీసీ అధికారులు అలర్ట్ అయ్యారు. స్పాట్ ఫిక్సింగ్ జరిగిందన్న అనుమానంతో బజ్వా మొబైల్ ఫోన్‌ను సీజ్ చేయడంతో పాటు అతడ్ని విచారించారు. ఈ క్రమంలోనే గ్యాంగ్‌స్టర్లతో అతడికి ఉన్న లింకులు బయటపడ్డాయి. జైలులో ఉంటూనే నెట్‌వర్క్ నడిపించే బిష్ణోయ్, ఇప్పుడు క్రికెట్ బెట్టింగ్ మాఫియాలోకి కూడా ఎంట్రీ ఇచ్చాడని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. 

►ALSO READ | చాహల్‌తో డేటింగ్ పుకార్లు ఫేక్.. కోహ్లీ లాంటి అబ్బాయి కావాలన్న యాంకర్

కాగా కేవలం ప్లేయర్స్ కాదు, క్రికెట్ కెనడా ప్రెసిడెంట్ అరవిందర్ ఖోసా కూడా ఈ గ్యాంగ్ కి సపోర్టు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. దిల్‌ప్రీత్ బజ్వాను కెప్టెన్ చేయడంలో ఖోసా కీ రోల్ పోషించారని, ఇది కేవలం మ్యాచ్‌లు ఫిక్స్ చేసి డబ్బు సంపాదించడానికే అని పలువురు బోర్డు సభ్యులు ఆరోపిస్తున్నారు. కానీ ఖోసా ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఇదంతా తనపై జరుగుతున్న రాజకీయ కుట్రని వాదిస్తున్నారు. మరోవైపు, మాజీ కోచ్ ఖుర్రం చోహన్ కూడా గతంలో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కోసం బోర్డు సభ్యుల నుంచి ఒత్తిడి వచ్చినట్లు చెప్పడం ఇప్పుడు సంచలనం రేపుతోంది.

కెనడా సర్కార్ ఇప్పటికే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ను ఒక ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. సౌత్ ఏషియన్ కమ్యూనిటీని టార్గెట్ గా చేసుకుని ఈ ముఠా అక్కడ హత్యలు, వసూళ్లకు తెగబడుతుంది. ఇప్పుడు వీరి దృష్టి క్రికెట్‌పై పడటంతో ప్లేయర్స్ భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఐసీసీ యాంటీ కరప్షన్ యూనిట్ సమగ్రంగా దర్యాప్తు జరిపి నివేదిక ఇస్తే తప్ప, ఇది ఎంత వరకు వెళ్లిందనే విషయం తెలియదు.