మసూద్ తమ్ముడు సహా 44 మంది టెర్రరిస్టుల నిర్బంధం

మసూద్ తమ్ముడు సహా 44 మంది టెర్రరిస్టుల నిర్బంధం
మసూద్ తమ్ముడు రవూఫ్

ఇస్లామాబాద్: జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ చీఫ్ మౌలానా మసూద్ అజార్ సోదరుడు ముఫ్తీ అబ్దుల్ రవూఫ్, బావ హమ్మద్ అజ్గర్ లను పాక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే నిషేధిత ఉగ్రవాద సంస్థలకు చెందిన మరో 43 మందిని నిర్బంధించారు. ఈ విషయాన్ని పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి షహర్యార్ అఫ్రిది మీడియాకు వెల్లడించారు. దేశ భద్రతకు సంబంధించిన నేషనల్ యాక్షన్ ప్లాన్ కమిటీ సోమవారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. నిషేధిత సంస్థలపై చర్యలు కొనసాగుతాయన్నారు. అదుపులోకి తీసుకున్న వారిపై దర్యాప్తు చేస్తామని, ఏవైనా ఉగ్ర కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు ఆధారాలు లభిస్తే చర్యలు తీసుకుంటామని అఫ్రిది తెలిపారు. రెండు వారాలపాటు నిర్బంధంలో ఉంచుతామని, ఏ ఆధారాలు లభించకపోతే వారిని విడుదల చేస్తామని చెప్పారు.

పుల్వామా దాడి తర్వాత పాక్ పై భారత్ సహా ప్రపంచ దేశాల ఒత్తిడికి ఇది నిదర్శనమని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే పాకిస్థాన్ మాత్రం అలాంటిదేం లేదని, ఇది తమ సొంత నిర్ణయమని చెబుతోంది. పాక్ సమాచార శాఖ మంత్రి ఫవాద్ చౌదరి మాట్లాడుతూ తమ దేశంలో ఉగ్రవాదాన్ని రూపుమాపడానికి కట్టుబడి ఉన్నామన్నారు. నేషనల్ యాక్షన్ ప్లాన్ కమిటీ సమావేశం నిర్వహించాలని పుల్వామా దాడి జరగకముందే నిర్ణయించామని చెప్పారు.

ఎవడీ ముఫ్తీ రవూఫ్

జైషే మహమ్మద్ టెర్రర్ గ్రూప్ చీఫ్ మసూద్ అజార్ తమ్ముడు ముఫ్తీ రవూఫ్ ఆ సంస్థ ఆపరేషనల్ హెడ్. భారత్ లో జరిగిన అనేక దాడుల వెనక కీలక పాత్ర ముఫ్తీదే. 1999లో ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానాన్ని హైజాక్ చేసి భారత్ లో ఖైదీగా ఉన్న మసూద్ ను విడిపించడంలో ప్రధాన పాత్ర పోషించాడు. 2001లో పార్లమెంటుపై దాడి, 2016లో పఠాన్ కోఠ్ ఎయిర్ బేస్ పై అటాక్, పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై ఆత్మాహుతి దాడి వెనుక సూత్రదారిగా వ్యవహరించాడు. రవూఫ్ పై ఆయా కేసులన్నింటిలో ఎన్ఐఏ చార్జిషీట్లు వేసింది.