శ్రీశైలం ఘటన చాలా దురదృష్టకరం: జెన్కో సీఎండీ

శ్రీశైలం ఘటన చాలా దురదృష్టకరం: జెన్కో సీఎండీ

శ్రీశైలం ఘటన చాలా దురదృష్టకరం అని జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు అన్నారు. ఈ ఘటనలో తొమ్మిది మంది చనిపోవడం తనను తీవ్రంగా బాధించిందన్నారు. ఏడుగురు ఇంజనీర్లు, ఇద్దరు ఇతర వ్యక్తులు చనిపోయారని, వారి ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ప్రమాదం ఘటనపై ఆదివారం నాడు సీఎండీ ప్రభాకర్ రావు మీడియాతో మాట్లాడారు. సంఘటన జరిగిన కొన్ని గంటల్లోనే తాను, మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఘటనాస్థలికి చేరుకున్నామని చెప్పారు. విద్యుత్ కేంద్రంలో చిక్కుకున్న వారిని కాపాడటం కోసం అనేక ప్రయత్నాలు చేశామన్నారు. ప్రమాదం జరిగిన రోజు రాత్రంతా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టామన్నారు. అయితే తమ వల్ల కాకపోవడంతో ఎన్డీఆర్ఎఫ్, సీఐఎస్ఎఫ్ బృందాలను పిలిచామని తెలిపారు.

ప్రమాద సమయంలో విద్యుత్ కేంద్రంలో పవర్ పోయిందని, దాంతో లోపల అంతా అంధకారం అయిపోయిందని భాస్కర్ రావు అన్నారు. దట్టమైన పొగ అలముకోవడంతో అందులో చిక్కుకున్న వారికి ఆక్సీజన్ అందలేదన్నారు. పొగను బయటకు పంపేందుకు చాలా కష్టపడ్డామని, అయినప్పటికీ దురదృష్టవశాత్తు వారు చనిపోయారని అన్నారు. వాస్తవానికి అది ఆటోమేటిక్‌గా ట్రిప్ కావాలి కానీ కాలేదన్నారు. ఎందుకు ట్రిప్ కాలేదు అనేదానిపై విచారణకు కమిటీ వేశామని ఆయన తెలిపారు. అలాగే పవర్ పోవడంతో వెంటిలేషన్ ఆగిపోయిందని, దీంతో ఎమర్జెన్సీ వే కూడా తెరుచుకోలేదన్నారు.

గత 30 రోజుల నుండి చాలా చక్కగా పనులు జరుగుతున్నాయని, రోజుకు 128 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని వెల్లడించారు. ప్రమాదంపై వివిధ పక్షాల నుండి వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవం అని సీఎండీ భాస్కర్ రావు అన్నారు. గతంలో కూడా ఎన్టీపీసీలో బాయిలర్ పేలిందని, దాదాపు 30 మంది చనిపోయారని ఆయన గుర్తు చేశారు. తమిళనాడులో కూడా ఇలాంటి దుర్ఘటనే జరిగిందని, దురదృష్టవశాత్తు మన దగ్గర కూడా జరిగిందని అన్నారు. ప్రమాదంపై విచారణకు కమిటీ వేశామని, త్వరలోనే నివేదిక వస్తుందని తెలిపారు

ప్రమాదంపై స్పందించిన సీఎం కేసీఆర్.. ఇప్పటికే సీఐడీ దర్యాప్తునకు ఆదేశించారని చెప్పారు. ప్ర‌భుత్వం నుండి ఇప్పటికే బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ఇచ్చామని అన్నారుఇలాంటి సంఘటనలు జరిగిన రాష్ట్రాల్లో ఇంత ఎక్స్ గ్రేషియా ఇవ్వలేదని, మృతుల కుటుంబాల‌కు అండగా ఉంటామ‌ని ప్ర‌భాక‌ర్ అన్నారు.

Jenco CMD Prabhakar Rao responds to accident at Srisailam power plant fire accident