
కల్యాణ్ రామ్, ఆషికా రంగనాథ్ జంటగా రాజేంద్ర రెడ్డి రూపొందిస్తున్న చిత్రం ‘అమిగోస్’. ఇదొక స్పానిష్ పదం. స్నేహితుడిని ఉద్దేశించి మాట్లాడేందుకు దీన్ని ఉపయోగిస్తారు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కల్యాణ్ రామ్.. మూడు డిఫరెంట్ రోల్స్‌లో కనిపించనున్నాడు. ఇప్పటికే బిజినెస్ మేన్ సిద్ధార్థ్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మంజునాథ్‌గా కల్యాణ్ రామ్‌ని ఇంట్రడ్యూస్ చేశారు. తాజాగా మనిషిని పోలిన మూడో మనిషి అంటూ తన మూడో క్యారెక్టర్‌ని పరిచయం చేశారు మేకర్స్.
‘ద అన్‌నోన్’ అంటూ ఎవరో తెలియని పాత్రగా కల్యాణ్ రామ్ పోస్టర్‌ని రిలీజ్ చేశారు. ఇందులో కల్యాణ్ రామ్ చాలా డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నాడు. చేతిలో గన్ పట్టుకుని, ఒత్తుగా జుట్టు పెంచి వెనుక పిలక వేసుకొని, పొడవాటి గడ్డంతో ఇంప్రెస్ చేస్తున్నాడు. అలాగే ఈ నెల 8న టీజర్‌ను రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 10న విడుదల కానుంది. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు.