కార్పోరేటర్లు మహిళలు..సర్కార్ టూర్ కు భర్తలు

కార్పోరేటర్లు మహిళలు..సర్కార్ టూర్ కు భర్తలు
  • కరీంనగర్​ మున్సిపల్​ కార్పొరేషన్లో నిర్వాకం
  • రూ. 1.71 లక్షలు దుర్వినియోగం
  • లోక్సత్తా ఆర్టీఐ దరఖాస్తుతో వెల్లడి
  • ఏడాది పాటు తిప్పాకే సమాచారం
  • సొమ్ము రికవరీకి డిమాండ్

కరీంనగర్, వెలుగు: కరీంనగర్​ మున్సిపల్​ కార్పొరేషన్​లో నీటి సరఫరాను బాగుచేయాలనుకున్నారు. ఇందుకోసం మహారాష్ట్రలోని నాగ్​పూర్​కు వెళ్లి అక్కడి నీటి సరఫరా విధానంపై స్టడీ చేయాలని నిర్ణయించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మేయర్, కార్పొరేటర్లు కలిపి 29 మంది నాగ్​పూర్​కు బయల్దేరారు. మరి వారంతా ప్రజాప్రతినిధులే అనుకుంటున్నారా.. కాదు.. కొందరు మహిళా కార్పొరేటర్లతో వారి భర్తలు బస్సెక్కారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కానివారు 14 మంది ఆ టూర్​లో పాల్గొన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన లోక్​సత్తా సంస్థ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేసింది. మహిళా ప్రజాప్రతినిధుల విధుల నిర్వహణలో వారి భర్త, బంధువులు పెత్తనం చలాయించడం రాజ్యాంగ విరుద్ధమని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది.

ఆర్టీఐ పిటిషన్​తో..

నాగ్​పూర్​ స్టడీ టూర్​కు సంబంధించిన వివరాలు కావాలంటూ లోక్​సత్తా సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసి వివరాలు సేకరించింది. స్టడీ టూర్​ కోసం కరీంనగర్​ కార్పొరేషన్​ నుంచి రూ. 5.5 లక్షలు ఖర్చు చేశారు. అందులో అనధికారికంగా వెళ్లిన 14 మందికి సంబంధించి ఒక్కొక్కరికి రూ.12,222 చొప్పున మొత్తం రూ.1.71 లక్షలు దుర్వినియోగమైనట్టు గుర్తించారు.

రికవరీ చేయాలె

‘‘కరీంనగర్​ మేయర్, కార్పొరేటర్లు గతేడాది మే 3 నుంచి 6 వరకు నాగ్​పూర్ నగరానికి స్టడీ టూర్ కు వెళ్లారు. టూర్ కు కార్పొరేటర్ల భర్తలు వెళ్లారు. దుర్వినియోగమైన నిధులను రికవరీ చేయాలి’’ అని లోక్​సత్తా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ డిమాండ్ చేశారు.

నాకు వివరాలు తెలియదు

‘‘గత నేను నెల రోజుల నుంచే కార్పొరేషన్​లో పని చేస్తున్నాను. గతంలో జరిగినవి నాకు పెద్దగా తెలియదు’’  అని కరీంనగర్ కార్పొరేషన్​ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి చెప్పారు.