ఖర్జూర కల్లు కోసం ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాళ్ల భార్యలు

ఖర్జూర కల్లు కోసం ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాళ్ల భార్యలు

తెలంగాణలో ఈత కల్లు అందరికీ తెలుసు. కొన్ని ప్రాంతాల్లో తాటి కల్లు కూడా తాగుతరు. కానీ.. మన దగ్గర ఖర్జూర చెట్లకు కూడా కల్లు గీస్తున్నడు కొంక యాదయ్య గౌడ్‌‌. ఎక్కడో ఎడారి దేశాల్లో పెరిగే ఖర్జూర చెట్లను ఇక్కడ పెంచి, వాటి నుంచి కల్లు గీస్తున్నడు. దాని రుచి చూసేందుకు ఎక్కడెక్కడినుంచో యాదయ్య తోటకు క్యూ కడుతున్నరు జనాలు.

హైదరాబాద్‌‌ నుంచి 120 కిలోమీటర్ల దూరంలో నాగర్‌‌కర్నూల్‌‌ జిల్లాలో తర్నికల్‌‌ ఉంది. పొద్దున ఆ ఊరికి వెళ్తే.. రోడ్డు పక్కనే కార్లు, బైక్‌‌లు పార్క్‌‌ చేసి ఉంటాయి. అందరి అడుగులూ కుండలు వేలాడుతున్న ఖర్జూర చెట్ల వైపు పడుతుంటాయి. అదే యాదయ్య గౌడ్‌‌ ఖర్జూర తోట. ఈత, తాటి కల్లు గురించి అందరికీ తెలుసు. కానీ, ఇక్కడ మొదటిసారిగా ఖర్జూర కల్లును పరిచయం చేశాడు యాదయ్య. అందుకే ఎక్కడెక్కడి నుంచో ఖర్జూర కల్లు కోసం ఇక్కడికి వస్తుంటారు. ఎక్కువ టెంపరేచర్‌‌‌‌ ఉండే ఎడారి దేశాల్లో పెరిగే ఈ చెట్లను అసలు ఇక్కడ ఎలా పెంచాడు? వాటితో లాభాలు ఎలా పొందుతున్నాడు?

పాలేరు నుంచి రైతుగా..

‘‘తాటి చెట్లు ఎక్కాలన్నా, కల్లు గీయాలన్నా , నాకు చానా ఇష్టం. అయితే ఆ పని చేయలేకపోయా.పన్నెండేండ్లు ఒక దొర దగ్గర పాలేరుగ పనిచేసిన. మా కులవృత్తి చేద్దామంటే.. నాకేమో తాళ్లెక్కరాదు ఎలా? అని ఆలోచిస్తుంటే.. మా ఊళ్ల ఓ పెద్దాయన కల్లు గీయడం నేర్పిండు. ఆ తర్వాత ఆంధ్రకు పోయిన. ప్రకాశం జిల్లాల ఒకాయన దగ్గర ఆరేండ్లు కల్లు గీసే పనిచేసిన. నెల నెలా జీతం ఇచ్చిండు. తర్వాత సొంతూరు తర్నికల్‌‌కు వచ్చిన. ఆంధ్రలో ఆరేండ్లు కష్టపడి దాచిపెట్టిన పైసలతో రెండెకరాల భూమి కొన్న. కానీ, అది చానా రోజుల నుంచి బీడున్న భూమి. ఎవుసాయానికి పనికిరాదు. అప్పుడే ఖర్జూర తోట ఆలోచన తట్టింది. ఖర్జూర మొక్కలు నాటి పని మొదలు పెట్టిన” అన్నాడు యాదయ్య.

కష్టాల సాగు

అయితే.. ఇప్పటివరకు చెప్పిందంతా 18 ఏండ్ల నాటి సంగతి. యాదయ్య ఖర్జూర మొక్కల కోసం చాలా ఏరియాలు తిరిగాడు. చివరికి సంగారెడ్డిలోని నర్సరీ వాళ్ల సాయంతో కడియపు లంక(తూర్పుగోదావరి జిల్లా) నుంచి మొక్కలు తెప్పించాడు. తండ్రి ఇచ్చిన ఎకరానికి తోడు తాను కొన్న రెండెకరాల్లో మొక్కలు నాటాడు. పూర్తిగా చౌడు భూమి కావటంతో గుంతల్లో ఎర్రమట్టిని పోసి మొక్కలు పెంచాడు. ఒక్కో పాదు మధ్య 20 అడుగుల దూరం ఉండేలా చూసుకున్నాడు.

కాపాడిన కల్వకుర్తి కాల్వ

నీళ్లు లేక నాటిన మొక్కల్లో ఒక్కొక్కటిగా ఎండి పోవడం మొదలైంది. ఖర్జూర కల్లు పడాలంటే చెట్లకు బాగా నీళ్లుండాలి. ఇక లాభం లేదని, ఉన్న ఊళ్లోనే మళ్లీ తాళ్ళు, ఈత చెట్లు ఎక్కుతూ, కల్లు అమ్మడం మొదలుపెట్టాడు. అలా సంపాదించిన డబ్బుతో ఇరవై ఏడు బోర్లు వేశాడు. ఒక్క దానిలో కూడా నీళ్లు పడలే. అయినా పట్టు వదలకుండా ట్యాంకర్లతో నీళ్లు తెచ్చి చెట్లకు పోసి బతికించాడు. భార్య నీలమ్మతో కలిసి వాటిని కంటికి రెప్పలా కాపాడుకున్నాడు.
ఐదేండ్ల కింద చెట్లు ఏపుగా పెరిగి, పచ్చగా మారాయి. ఇప్పుడు తోట పక్కనుంచే కల్వకుర్తి కాల్వ పారుతోంది. దాంతో నాలుగు బోర్లలో ఊట పడింది. ఆ నీళ్లతోనే తోటను పారిస్తున్నాడు. దుందుభి నది మీద అక్విడెక్ట్‌‌ కట్టడంతో కల్వకుర్తికి నీళ్లొస్తున్నాయి. మూడు నెలలకోసారి చెట్ల చుట్టూ పాదుల్లో వర్మీ కంపోస్టు, వేప చెక్క వేస్తున్నాడు. ప్రతి మూడు రోజులకోసారి డ్రిప్‌‌ ద్వారా చెట్లకు తడి పెడుతున్నాడు.

చెట్టుకు ఐదు లీటర్లు

మొదట్లో నీళ్లు లేక కొన్ని చెట్లు చచ్చిపోయాయి. మిగిలిన వాటిలో ప్రతి చెట్టు నుంచి ఐదు లీటర్ల కల్లు వస్తుంది. రోజుకు ఇరవై చెట్ల నుంచి కల్లు తీస్తున్నాడు. కల్లు మీద వచ్చిన డబ్బుతోనే బిడ్డ పెండ్లి చేశాడు. కల్లు తీస్తున్న చెట్లకు కాయలు కాయవు. మిగతా చెట్లకు కాసినా పక్షులు, కోతుల కోసం వదిలేస్తున్నాడు. చాలామంది ఈత, తాటి కల్లుతో పోలిస్తే ఈ కల్లు చాలా రుచిగా, చెరకు రసంలా ఉంటుంది అంటారు తాగినవాళ్లు. మత్తు ఎక్కదు. వాసన రాదు. రెండు రోజుల వరకు పులవదు. ఆరోగ్యానికి మంచిది. అందుకే కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాళ్ల భార్యలు కూడా హైదరాబాద్‌‌ నుంచి  ఖర్జూర కల్లు కోసం వస్తుంటారు. రోజుకు 1200 నుంచి రెండు వేల వరకు సంపాదిస్తున్నాడు. ఇది రుచి చూసిన వాళ్లు ఈత కల్లుకంటే తీయగా ఉంది అంటారు. యాదయ్య రోజుకు దాదాపు ఇరవై చెట్లు గీస్తాడు.

జలుబు, దగ్గుకు చెక్‌‌

మిగతా కల్లుతో పోలిస్తే, ఈ కల్లులో ఆరోగ్యానికి మంచి చేసే గుణాలు ఎక్కువని సైంటిస్ట్‌‌లు చెబుతున్నారు. ‘‘చెట్టు నుంచి తీసిన తర్వాత 4 గంటల వరకు ఖర్జూర కల్లు తాజాగా ఉంటుంది. ఫ్రిజ్​లో పెడితే.. 12 గంటల వరకు ఉంటుంది. నెమ్మదిగా పులుస్తుంది. ఇందులో క్యాల్షియం, పాస్ఫరస్‌‌, ఐరన్‌‌, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. ఈ కల్లు తాగితే.. డైజెషన్‌‌ సిస్టమ్‌‌ బాగా పనిచేస్తుంది. తాటి, ఈత కల్లుతో పోలిస్తే ఇందులో ప్రొటీన్స్‌‌ ఎక్కువగా ఉండి, చక్కెర తక్కువగా ఉంటుంది. జలుబు, దగ్గు తగ్గించేందుకు బాగా పనిచేస్తుంది. శ్లేష్మం కరిగించి గొంతును క్లియర్‌‌ చేస్తుంది. బ్లడ్‌‌ ప్రెషర్‌‌‌‌ని కంట్రోల్‌‌ చేయడానికి హెల్ప్‌‌ చేస్తుంది” అని తూర్పు గోదావరి జిల్లా పందిరిమామిడిలోని తాటి పరిశోధనా కేంద్రంలో పనిచేస్తున్న సీనియర్‌‌ ఫుడ్ సైంటిస్ట్‌‌ పి.సి. వెంగయ్య చెప్పారు. అన్ని రకాల కల్లు వెరైటీలపై ఆయన స్టడీ చేస్తున్నారు. ఉత్తర నైజీరియన్లు ఖర్జూరాలకు మిర్చిని చేర్చి బీరును తయారుచేస్తారు.