- జూన్ 2 వరకు హామీలు అమలు చేయకుంటే ఉద్యమిస్తామని ప్రభుత్వానికి హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ఎన్నికలకు ముందు తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని టీఆర్ఎస్ చీఫ్ కవిత డిమాండ్చేశారు. జూన్ 2 వరకు ప్రభుత్వం హామీలు అమలు చేయకుంటే ఉద్యమకారులతో కలిసి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఆదివారం బంజారాహిల్స్ లోని పార్టీ కార్యాలయంలో ఉద్యమకారులతో కవిత సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జార్ఖండ్ ప్రభుత్వం ఉద్యమకారులకు అందిస్తున్న సంక్షేమ పథకాల మాదిరిగా తెలంగాణ ఉద్యమకారులకు కూడా అందించాలని డిమాండ్ చేశారు. హామీల అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు భువనగిరి జిల్లా కేంద్రంలో సభ నిర్వహించాలని, భూపోరాటాలు ఉధృతం చేయాలని, జిల్లాల వారీగా ఉద్యమకారులతో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు రూప్ సింగ్, సయ్యద్ ఇస్మాయిల్, ఉద్యమకారులు పాల్గొన్నారు.
