పులులు వస్తేనే అడవికి కళ..

పులులు వస్తేనే అడవికి కళ..

అడవికి రాజు.. వేటలో రారాజు పులి. అరణ్యంలో టైగర్ల సందడి ఉంటే  ఆ ఫారెస్ట్​కు కళ ఉంటుంది. ఆ రాష్ట్రానికి గౌరవంతో పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది. తద్వారా ఆదాయం పెరగడంతోపాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు ఉంటాయి.  అయితే, కవ్వాల్​ అటవీ ప్రాంతంలో పులులకు ప్రధాన ఆహారమైన చిటాల్ (దుప్పి)ల సాంద్రత గణనీయంగా పెరిగింది. 2010లో చదరపు కిలోమీటరుకు కేవలం 1.94గా ఉన్న వీటి సంఖ్య, 2022 నాటికి 6.08కి చేరింది. 

శాస్త్రీయ అంచనాల ప్రకారం.. ప్రస్తుతం కవ్వాల్​లోని 893 చదరపు కిలోమీటర్ల కోర్ ఏరియా సుమారు 35 నుంచి 41 పులులకు ఆవాసం కల్పించగలదు. 2010 నాటి సామర్థ్యం (24 పులులు)తో పోలిస్తే ఇది భారీ పురోగతి. అయినప్పటికీ, అక్కడ పులుల సంతతి వృద్ధి చెందకపోవడం ఆందోళన కలిగిస్తోంది.  

పులుల జనాభా పెరగకపోవడానికి ప్రధాన కారణం ‘సంతానోత్పత్తి’ చేసే జనాభా లేకపోవడమే. గడిచిన దశాబ్ద కాలంలో సుమారు 15 పులులు కవ్వాల్​లోకి ప్రవేశించినట్టు రికార్డులు చెబుతున్నా.. అందులో కేవలం రెండే రెండు ఆడ పులులు ఉన్నాయి. తగినన్ని ఆడ పులులు లేకపోవడంతో వచ్చిన మగ పులులు కూడా అక్కడ ఉండకుండా వెనుదిరిగిపోతున్నాయి.