కేరళలో 22కు చేరిన జికా వైరస్ కేసులు

కేరళలో 22కు చేరిన జికా వైరస్ కేసులు
  • తాజాగా ఇవాళ మరో మూడు కొత్త కేసులు వెలుగులోకి రాక

తిరువనంతపురం: కరోనా మహమ్మారి ప్రభావం నుంచి ఇంకా బయటపడలేకపోతున్న కేరళకు పులిమీద పుట్రలా జికా వైరస్ కేసులు చికాకుపెడుతున్నాయి. గత వారం రోజులుగా బయటపడుతున్న జికా వైరస్ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా మంగళవారం నాడు మరో మూడు కేసులు వెలుగులోకి రావడంతో కేరళలో బయటపడిన జికా వైరస్ కేసుల సంఖ్య 22కు చేరింది. 
తిరువనంతపురంలో మంగళవారం నుంచి జికా వైద్య పరీక్షలు ప్రారంభించగా తొలిరోజే మూడు కేసులు వెలుగులోకి రావడం కలకలం రేపింది. అనుమానంతో కోయంబత్తూరులోని మరో ల్యాబ్ కు శాంపిల్స్ పంపి పరీక్షించగా జికా వైరస్ గానే నిర్ధారణ అయింది.  ప్రాణాంతం కాకపోయినా ఇప్పటి వరకు మందు లేకపోవడం వైద్య నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ వైరస్ సోకితే కొందరిలో జ్వరం.. దద్దుర్లు, తలనొప్పి.. ఒళ్లు నొప్పులు వంటి సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. 
ప్రపంచంలో తొలిసారిగా 70 ఏళ్ల క్రితం 1947లో ఉగాండా  అడవుల్లో కోతుల్లో జికా వైరస్ వెలుగులోకి వచ్చింది. 1952లో తిరిగి రెండోసారి వెలుగులోకి వచ్చినా మనుషుల్లో కనిపించింది. అటు తర్వాత చాలా గ్యాప్ తో 2017లో మనదేశంలోని తమిళనాడు, అహ్మదాబాద్ ప్రాంతాల్లో కేసులు వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఇప్పుడు కేరళలో జికా వైరస్ కేసులు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. మంగళవారం వెలుగులోకి వచ్చిన మూడు కొత్త కేసుల్లో 35 ఏళ్ల వ్యక్తి ఒకరు.. 41 ఏళ్ల మహిళ ఇంకొకరు.. మరొకరు ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తున్న 38 ఏళ్ల వయసున్న వైద్యుడికి సోకినట్లు నిర్ధారణ అయింది.