26న కాంగ్రెస్ చీఫ్గా బాధ్యతలు చేపట్టనున్న ఖర్గే

26న కాంగ్రెస్ చీఫ్గా బాధ్యతలు చేపట్టనున్న ఖర్గే

పేద కుటుంబంలో పుట్టిన తనను అధ్యక్షుడిగా ఎన్నుకున్న కాంగ్రెస్ పార్టీకి జీవితాంతం రుణపడి ఉంటానని మల్లికార్జున ఖర్గే అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో చిక్కుకున్న ప్రస్తుత తరుణంలో.. పారదర్శక ఎన్నిక ద్వారా పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకున్న ఘనత కాంగ్రెస్ కే దక్కుతుందని చెప్పారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఖర్గే మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నిక ప్రక్రియలో  పాల్గొన్న పార్టీ నాయకులతో పాటు అధ్యక్ష స్థానానికి పోటీచేసిన శశిథరూర్ కు అభినందనలు తెలిపారు. తామంతా కలిసికట్టుగా నిరంకుశ కేంద్ర ప్రభుత్వంపై, ఫాసిస్టు శక్తులపై ఉమ్మడి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

‘‘ రక్తం, చెమటతో కాంగ్రెస్ పార్టీని సోనియాగాంధీ దేశవ్యాప్తంగా బలోపేతం చేశారు. ఆమె అధ్యక్షురాలిగా ఉన్న హయాం మాకు స్ఫూర్తిదాయకం.రాహుల్ గాంధీతో కలిసి మేమంతా నడుస్తం. ఆయన నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రను విజయవంతం చేస్తం. పాదయాత్రలో ఉన్నప్పటికీ నాకు ఫోన్ చేసి రాహుల్ అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ లో ప్రతి ఒక్కరు కార్యకర్తల్లా ముందుకు సాగాలి. కలిసికట్టుగా ఫాసిస్టు శక్తులపై పోరాడాలి’’ అని ఖర్గే పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఖర్గే ఈనెల 26న బాధ్యతలను స్వీకరిస్తారని కాంగ్రెస్ ఎంపీ రణ్ దీప్ సుర్జేవాలా ప్రకటించారు. ఆ రోజున ప్రెస్ మీట్ లో ఆయన మీడియాతో మాట్లాడుతారని వెల్లడించారు.